పాతగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భేరిపూజ, గరుత్మంతుడితో దేవతాహ్వానం తంతును సంప్రదాయబద్ధంగా జరిపారు. గరుడమూర్తికి ఇలా నివేదించిన ముద్గానాన్ని స్వీకరించిన మహిళలకు సంతానప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి.
యాదాద్రి, ఫిబ్రవరి 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భేరిపూజ, గరుత్మంతుడితో దేవతాహ్వానం తంతును సంప్రదాయబద్ధంగా జరిపారు. గరుత్మంతుడిని ఆహ్వానించే ధ్వజారోహణం, గరుత్మంతుడి దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం శ్రీవారు పెండ్లి కొడుకుగా ముస్తాబు కానున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం, వివాహ నిశ్చయ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్మంతుడిని ఆహ్వానించి సకల దేవతలకు యాదాద్రీశుడు బుధవారం పెండ్లి కొడుకు అవుతున్నారని సబ్బండ బంధుగణంతో తరలిరావాలనే ఆహ్వానాన్ని పంపే తంతును అర్చక బృందం ఆధ్వర్యంలోని వేద పండితులు, అర్చకులు, పారాయణీకులు, వేదమంత్రాల ఘోషలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో ముస్తాబు చేసి పుష్పాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్ల ధ్వజస్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేసి ధ్వజారోహణం తంతు నిర్వహించారు. కుంకుమతో గరుత్మంతుడి చిత్రపటం వేసి, ఆ వస్ర్తానికి షోడషోపో చరాలు చేశారు. ధ్వజస్థంభానికి దర్భలతో తయారు చేసిన తాడుతో గరుత్మంతుడి చిత్రపటానికి వస్ర్తాన్ని కట్టారు. అర్చకుల వేదోక్తమైన పాటలతో గరుడిని ఆహ్వానించారు.
ధ్వజారోహణం విశిష్టత..
ధ్వజారోహణం వేడుక ద్వారా గరుత్మంతుడి చిత్రపటాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్థంభంపై అలంకరించి, ఆరాధనలు చేసి, 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానించారు. దీనిని తిలకించిన వారికి పాపవిముక్తి కలుగుతుంది. గరుడమూర్తికి నివేదించిన ముద్గానాన్ని స్వీకరించిన మహిళలకు సంతానప్రాప్తి కలుగునని పురాణోక్తి. సామూహిక దీక్షాపరులైన వేదపారాయణీకులచే చతుర్వేద పారాయణాలు, పురాణ, ఇతిహాస, ప్రబంధ, మూలమంత్ర, మూర్తిమంత్ర జపములు ఈ ఉత్సవంలో నిర్వహిస్తారు.
ఆలయంలో హవనం
బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు ఎదురుగా అగ్ని ప్రతిష్ఠ చేసి, ఆ అగ్నిలో రాగి, మేడిచ జువ్వి, మోదుగు, మామిడి చెట్ల కర్రలతో హోమాన్ని వెలిగించారు. అందులో నారాయణ, లక్ష్మి, సుదర్శన, నారసింహ, ఆంజనేయ, గరుడ మొదలైన మూలమంత్రాలతో హవనం చేశారు.
నేడు ఎదుర్కోలు..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు హవనం, సింహ వాహనసేవ, సాయంత్రం 5 గంటలకు హవనం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రికి శ్రీవారు అశ్వవాహన సేవలో ఊరేగుతారు. అనంతరం శ్రీవారి వివాహ నిశ్చయ ఘడియలు ఖరారు చేసే తంతును రాత్రి 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.
సాయంకాలం భేరిపూజ, దేవతాహ్వానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం వేదపారాయణీకులచే వేదపారాయణాలు, మూలమంత్ర, అనుష్టానం గావించారు. శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే ప్రక్రియ అయిన దేవతాహ్వానాన్ని సాయం త్రం నిర్వహించారు. ముందు ఆలయ అర్చకులు భేరిపూజ జరిపారు. సకల దేవతలకు భేరి నినాదాలు, మంగళవాయిద్యాలతో రాగ, తాళయుక్తంగా ఆవాహనం చేసి గర్భాలయంలోని ప్రధాన కలశంలో అధిష్ఠింపజేశారు. సకల మూలమంత్రాలతో హవనం జరిపారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీత, అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చకులు సంపతాచార్యులు, ఏఈవోలు భాస్కర్, శంకర్, జూనియర్ అసిస్టెంట్లు నర్సింహ, కె.సింహచారి, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
భేరిపూజ, దేవతాహ్వానం ప్రత్యేకత
బ్రహ్మోత్సవాల్లో ఆయా రాగతాళ వాయిద్యాలతో, వేదమంత్రాలతో బ్రహ్మాది దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవ నిర్వహించడం ప్రత్యేకత. శబ్దం భగవంతుడి స్వరూపం కనుక శబ్దనాదంతో భగవానుని ఆరాధించుట వేడుక ప్రత్యేకతను సూచిస్తుంది. భేరితాడనం వినటంతో అపమృత్యుదోషం కలుగదని, దేవతాహ్వానంతో సంపదల అభివృద్ధి చెందగలవని ఆగమశాస్త్రం తెలియజేస్తుంది.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్