బుధవారం 03 మార్చి 2021
Yadadri - Feb 23, 2021 , 02:52:01

పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

  • స్వస్తివాచనంతో పాతగుట్టలో ఉత్సవాలకు శ్రీకారం
  • తొలి పూజలో పాల్గొన్న ఈవో గీత, అనువంశికధర్మకర్త నర్సింహమూర్తి
  • స్వస్తివాచనంతోఉత్సవాలకు శ్రీకారం
  • తొలిపూజలో పాల్గొన్న ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి

యాదాద్రి, ఫిబ్రవరి 22: ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం.. విశ్వక్సేనారాధన.. జలపూజ.. పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం చేయడంతో యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవ సంబురానికి సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.00  గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. పారాయణికులచే మూలమంత్ర, భాగవత, రామాయణ, వేదప్రబంధ పారాయణాలు గావించారు. 33 కోట్ల దేవతలు, పద్నాలుగులోకాలు, సమస్తప్రాణికోటి, చరాచరజగత్తు అంతా భగవానుడి కటాక్షంతో శుభములు పొందాలని స్వస్తివాచన మంత్రాలతో విశ్వక్సేనారాధనతో ప్రార్థించారు. ఆలయాన్ని విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్ఠించి పూజలు చేశారు. అగ్నిదేవుడికి హోమం నిర్వహించారు. 

రక్షా బంధనం..  పుణ్యాహవాచనం..

శ్రీవారికి, ఉత్సవ నిర్వాహకులకు రక్షాబంధనం గావించి దీక్షపరులను చేయడం కోసం రక్షాబంధనం చేపట్టారు. పారాయణికులు, రుత్వికులకు ఈవో గీత దీక్షావస్ర్తాలు అందజేశారు. జగద్రక్షక్షుడైన పరమాత్రమను మూలవరులకు, ఉత్సవమూర్తులకు ఆగమశాస్ర్తానుసారం రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో కల్యాణ సంబురాలు, స్థల, ద్రవ్య శుధ్యర్థంపూజించిన జలాలతో శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం నిర్వహించారు.  అర్చకులు ఆలయ పరిసరాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచామృత కలశాలకు పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ జరిపారు.   మంత్ర జలాలను మూలవరులకు,ఆలయ పరిసర ప్రాంతాల్లో సంప్రోక్షణ గావించారు.

అంకురారోపణం.. మృత్సంగ్రహణం

పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం 5 గంటలకు శ్రీసామివారి ఆలయంలోఅంకురారోపణం, మృత్సంగ్రహణం, ధ్వజపటాధివాసం వేడుకలు చేపట్టారు. ఉత్సవాలు ముగిసేంత వరకూ నిత్యారాధనలు చేశారు.  ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చకుడు  సంపతాచార్యులు, ఏఈవోలు భాస్కర్‌, శంకర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు నర్సింహ, కె. సింహచారి, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

 యాదాద్రి రింగురోడ్డు  

విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్‌ 

యాదాద్రి, ఫిబ్రవరి 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న రింగురోడ్డు పనులను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సోమవారం పరిశీలించారు. గోశాల వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు.  భువనగిరి ఇన్‌చార్జి ఆర్డీవో సూరజ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ, డీఈలు పాల్గొన్నారు. 


VIDEOS

logo