ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Feb 23, 2021 , 02:52:05

ప్రగతి వికాసం

 ప్రగతి వికాసం

  • సకల సదుపాయాలతో మారుతున్న పల్లెల రూపురేఖలు
  • అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకుంటున్న జిల్లా
  • 92 రైతువేదికలు.. 650 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు
  • పచ్చదనం పెంపునకు 468 ఆవాసాల్లో వన నర్సరీలు
  • 421 పంచాయతీల్లో వైకుంఠధామాలు, వర్మీకంపోస్టు యార్డులు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కుతున్నది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో పక్కాగా చేపడుతున్న అభివృద్ధి పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అధికారుల చొరవ, ప్రజాప్రతినిధుల కృషితోపాటు ప్రజల సహకారంతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. అన్నదాతలకు రైతు వేదికలు, పల్లె ప్రజలకు ప్రకృతి వనాలు.. చివరి మజిలీ కష్టాలు తీర్చేందుకు వైకుంఠధామాలు.. పరిశుభ్రత, సేంద్రియ ఎరువుల తయారీకి వర్మీకంపోస్టు యార్డులను ప్రభుత్వం ప్రతి పంచాయతీలోనూ ఏర్పాటు చేస్తుండటంతో పల్లెల్లో స్పష్టమైన మార్పుతోపాటు పాలనలో సర్కారు మార్కు కనిపిస్తున్నది.

“పల్లె పాలనలో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ‘పల్లె ప్రగతి’లో పెద్దపీట వేసింది. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చి నిధులను అందించి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపట్టింది. జిల్లాలోని 421 పంచాయతీల్లో ఏర్పాటవుతున్న వన నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వర్మీకంపోస్టు యార్డులు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ఎంతో దోహదపడుతున్నాయి. రైతు వేదికలు, వైకుంఠధామాలు గత సమస్యలకు చరమగీతం పాడనున్నాయి. పల్లెలకు మణిహారం లాంటి ఎన్నో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతుండటంతో వాటి రూపు రేఖలే మారిపోతున్నాయి. 

- యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

సిద్ధంగా రైతువేదికలు 

ఆధునిక వ్యవసాయ పద్ధతులతోపాటు పంటల సాగు సమస్యలపై రైతులంతా ఒకేచోట చేరి చర్చించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మిస్తున్న రైతువేదికలు సిద్ధమవుతున్నాయి. రూ.19.80 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 90 నిర్మాణాలకు ఇప్పటి వరకు 16.48కోట్లను ఖర్చు చేయగా, పనులు పూర్తి చేసుకున్న రైతువేదికలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. జిల్లా ఖనిజ అభివృద్ధి నిధుల నుంచి రూ.44లక్షల వ్యయంతో భువనగిరి, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లోనూ నిర్మిస్తున్న వేదికలు పూర్తికావొస్తున్నాయి. రైతువేదికల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండటంతో రైతులకు ఎప్పటికప్పుడు మెలకువలు అంది త్వరలోనే సాగు సమస్యలు తీరనున్నాయి.

పల్లెల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ప్రభుత్వం పంచాయతీకి ఒక్కటి చొప్పున జిల్లాలోని 421 పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులతోపాటు, వాటి పక్కనే వర్మీకంపోస్టు యార్డులను నిర్మిస్తోంది. ప్రస్తుతం 397 వర్మీకంపోస్టు యార్డులు పూర్తయ్యాయి. మరో 8 పంచాయతీల్లో నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఒక ఆవాసంతోపాటు స్థలం కొరత ఉన్న 13 పంచాయతీల్లో పనులు మొదలవ్వలేదు. గడపగడపకూ చెత్తను సేకరించి ఎప్పటికప్పుడు డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. ఆ చెత్తను వర్మీకంపోస్టుగా మార్చి హరితహారం మొక్కలకు, పొలాల్లో ఎరువులుగా రైతులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ఏర్పాటుతో పల్లెలు పరిశుభ్రంగా మారుతున్నాయి.

తీరనున్న అంత్యక్రియల సమస్యలు

అంతిమ సంస్కారాల సందర్భంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం గ్రామపంచాయతీకి ఒక్కటి చొప్పున జిల్లాలోని 421 పంచాయతీల్లో వైకుంఠధామాలను నిర్మిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో వీటి నిర్మాణ పనులు చేపడుతుండగా, ఇప్పటి వరకు 202 పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 204 నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. స్థలాల కొరతతో 12 నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఒక ఆవాసం, ముంపునకు గురవుతున్న రెండు పంచాయతీల్లో పనులను చేపట్టే పరిస్థితి లేదు. 202 నిర్మాణాలు పూర్తిగా వినియోగ దశలోకి వచ్చాయి. అన్ని నిర్మాణాలు అందుబాటులోకి వస్తే పల్లెల్లో దహన సంస్కారాల సమస్య త్వరలోనే తీరనున్నది. 

ఏ గ్రామంలో నాటాల్సిన మొక్కలు అదే గ్రామంలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ, అటవీశాఖల ఆధ్వర్యంలో విస్తారంగా మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 419 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి 54.65లక్షల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. గతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 18 నర్సరీలను ఏర్పాటు చేయగా, ఈసారి 25 నర్సరీలను ఏర్పాటు చేసి 19.24లక్షల మొక్కలను చేపడుతున్నారు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 24 నర్సరీలను ఏర్పాటు చేసి 16.05లక్షల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీ మొక్కలను హరితహారంలో వినియోగిస్తుండటంతో పల్లెలు హరిత పల్లెలుగా మారుతున్నాయి.

జీవ వైవిధ్యానికి నెలవులుగా ప్రకృతి వనాలు..

గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్కులను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలోని 421 పంచాయతీలతోపాటు 229 ఆవాస గ్రామాలు కలుపుకుని 650 చోట్ల ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోంది. రకరకాల మొక్కలను నాటడంతోపాటు వాకింగ్‌ ట్రాక్‌ను ప్రతి వనంలోనూ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 546 ఆవాసాల్లో ప్రకృతి వనాలు పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యాయి. ముంపునకు గురవుతున్న రెండు ఆవాసాలతోపాటు స్థలాలు అందుబాటులో లేని 33 ఆవాసాల్లో నేటికీ వనాల ఏర్పాటుకు అంకురార్పణ జరుగలేదు. జీవ వైవిధ్యానికి నెలవుగా ఉండనున్న ప్రకృతి వనాలు పల్లె ప్రజానీకాన్ని ఆహ్లాదంలో ముంచెత్తనున్నాయి.


VIDEOS

logo