శనివారం 06 మార్చి 2021
Yadadri - Feb 21, 2021 , 00:29:46

అంతులేని అలసత్వం

అంతులేని అలసత్వం

  • నత్తనడకన వైకుంఠధామం పనులు
  • హరితహారం మొక్కలకు రక్షణ కరువు
  • ‘పల్లె ప్రకృతి వనం’లో కానరాని మొక్కలు

పల్లెల బాగు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘పల్లె ప్రగతి’ చేపడుతున్నా అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కడిపనులు అక్కడే ఆగిపోతున్నాయి. మోత్కూరు మండలంలోని పాలడుగు ఇంకా అభివృద్ధిలో అట్టడుగులోనే ఆగిపోయింది. పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు కనిపించడం లేదు. హరితహారంలో నాటిన మొక్కలకు రక్షణ లేదు. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు  పనులు అసంపూర్తిగానే మిగిలాయి.

మూడేండ్లయింది... ఇంకా ఎక్కడిదక్కడే..

మా ఊర్లో వైకుంఠధామం పనులు మూడేండ్ల నుంచి నడుస్తూనే ఉన్నాయి. దహనవాటికలు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. స్నానపు గదులు ఉన్నా.. అందులో నీళ్లులేవు. ఎవరు చనిపోయినా బాయిలకాడే స్నానాలు   చేస్తు న్నాం. చావుకు పోతే స్నానానికే అరిగోస పడుతున్నాం.

అట్టడుగులో పాలడుగు అభివృద్ధి 

మోత్కూరు, ఫిబ్రవరి 20: మండలంలోని పాలడుగు గ్రామ అభివృద్ధిలో అంతులేని అలసత్వం నెలకొంది. ప్ర భుత్వం రూ.11.89లక్షలతో చేపట్టిన వైకుంఠధామం పనులు మూడేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దహన వాటికలు పిల్లర్‌ గుంతలతోనే ఆగిపోయాయి. స్నానాల గదులు పూర్తయినా నీటి వసతి కల్పించలేదు. రూ.2.50లక్షలతో చేపట్టిన డంపింగ్‌ యార్డు పనులను నాణ్యతగా చేపట్టడంలేదని, నీళ్లు పోసి క్యూరింగ్‌ సక్రమంగా చేయడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. హరితహారంలో గతేడాది గ్రామంలో 600 మొక్కలు, ఈ ఏడాది నాటిన 200 మొక్కల సంరక్షణను అధికారులు విస్మరించారు. గ్రామం లో మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో 855 మొక్కలను నాటితే అందులో 50 మొక్కలు కూడా కన్పించడంలేదు. కాగా, అక్కడి నుంచి ప్రకృతివనం స్థలాన్ని మార్చి పాత గ్రామంలో గతంలో దళితులకు నివాసాల కోసం ఇచ్చిన స్థలంలో ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ యాదయ్య పంచాయతీ పాలకవర్గం, గ్రామఅఖిలపక్షంతో ఏకపక్షంగా తీర్మానం చేశారు. దీంతో ఆ స్థలం వివాదాస్పదమైంది. దీనిపై గ్రామంలోని దళితులంతా ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా అక్క డ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయొద్దంటూ కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. గ్రామంలోని వీధులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. మురికి కాల్వల్లో చెత్త, మట్టి పేరుకుపోవడంతో మురుగు వీధుల్లో ప్రవహించడంతో దుర్గం ధం వెదజల్లుతున్నదని గ్రామస్థులు వాపోతున్నా రు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో ఏ ర్పాటు చేసిన సీసీ రోడ్లపై మట్టి పేరుకుపోయి మట్టి రోడ్లనే తలపిస్తున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామ అభివృద్ధికి కేటాయించిన నిధులను అధికారులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హరితహారం మొక్కలకు రక్షణ కరువు

ప్రభుత్వం హరితహారం, పల్లె ప్రకృతి వనం కింద నాటిన మొక్కలకు పంచాయతీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సం రక్షణ కరువైంది. గ్రామంలో  ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో నాటిన మొ క్కలన్నీ ఎండిపోయాయి. ఇప్పుడు దళితులకు నివాసాలకోసం ఇచ్చిన స్థలంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేయడం ఏమిటీ? . గ్రామంలో చాలా చోట్ల ప్రభు త్వ భూమి ఉంది. విశాలమైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలి.

 -గంటేపాక రవి తేజ గ్రామస్థుడు ,పాలడుగు 

త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం

పాలడుగు పంచాయతీలో చేపడుతున్న పల్లెప్రగతి వనం పనులు త్వరలోనే పూ ర్తి చేయిస్తాం. గతంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పనులను పూర్తి చేయలేదు. ఇప్పుడు పంచాయతీ నిర్వహణలో పనులను చేయిస్తున్నాం. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోయిన విషయం వాస్తవమే. కొ త్తవి నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై సర్పంచ్‌కు ఇప్పటికే మెమో జారీ చేశాం. పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యల తీసుకుంటున్నాం.

పొరెడ్డి మనోహర్‌రెడ్డి, ఎంపీడీవో మోత్కూరు 

VIDEOS

logo