సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 19, 2021 , 03:23:39

బ్రహ్మోత్సవాలు వేళాయే

బ్రహ్మోత్సవాలు వేళాయే

  • నేటి నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
  • రేపు స్వామివారి కల్యాణం
  • ముస్తాబైన ఆలయం

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 18: చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఆరు రోజుల ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే నూతనంగా మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, చలువ పందిళ్లను సిద్ధం చేశారు. దేవస్థానాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. గుట్టపైకి వెళ్లేదారిలో ఇరువైపులా రెయిలింగ్‌ నిర్మించారు. గట్టు కింద ఆలయాలను విద్యుత్‌ కాంతులతో అలంకరించారు. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారి నుంచి గట్టు వరకు విద్యుల్లతలు, గట్టు కింద శివుడి రూపంలో విద్యుత్‌ లైట్లతో భారీ కటౌట్లు కూడా పెట్టారు. కొబ్బరికాయలు, లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించారు. కరోనా నేపథ్యంలో భక్తుల భద్రతకు పెద్దపీట వేశారు. పోలీస్‌ బందోబస్తుతో పాటు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడుపనున్నారు.

రేపు స్వామివారి కల్యాణం...

గట్టుపై కల్యాణ మండపం విద్యుత్‌ దీపాలతో విరాజిల్లుతుంది. మండపానికి వివిధ రకాల రంగులతో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయడంతో భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఉత్సవాల్లో భాగంగా రేపు (శనివారం తెల్లవారుజామున) స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. స్వామివారి కల్యాణానికి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం తరఫున తలంబ్రాల బియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పిస్తారని ఆలయ చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, ఈవో మహేంద్రకుమార్‌ తెలిపారు. 

ఏర్పాట్లు పూర్తి... : ఉత్సవాల కోసం దేవస్థానంతో పాటు వివిధ శాఖలు కూడా ఏర్పాట్లను పూర్తి చేశాయి. పంచాయతీ సిబ్బంది పారిశుధ్య నిర్వహణలో పాల్పంచుకోనున్నారు. వైద్య శిబిరాలతో పాటు విద్యుత్‌ శాఖ ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది. లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాల మేరకు ప్రస్తుతం 2లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేశారు. 

మహిమాన్విత ఆలయం

మహిమాన్విత చెరువుగట్టు ఆలయానికి పౌరాణిక నేపథ్యం ఉన్నది. లోక కల్యాణార్థం పరశురాముడు ప్రతిష్ఠించిన 108క్షేత్రాల్లో ఆఖరిదే చెరువుగట్టుగా ప్రసిద్ధికెక్కింది. శివలింగం జడల ఆకృతిని పోలి ఉండడంతో పార్వతీజడల రామలింగేశ్వర స్వామిగా పేరొందాడు. పశ్చిమాభి ముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత. గుట్ట కింద పార్వతీదేవి ఆలయం నిర్మితమై ఉన్నది. ఎత్తైన మూడు గుండ్లపై శివలింగాన్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీంతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారికి క్షీరాభిషేకం చేస్తుంటారు. ఇక ప్రతి అమావాస్య రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలతో బాధపడే భక్తులు ఈ క్షేత్రంపై మండల దీక్ష పూర్తిచేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని విశ్వాసం. ముడుపులు చెల్లించి స్వామి వారి పాదుకలను తమ శిరస్సుపై ధరించి ప్రదక్షిణ చేస్తుంటారు. 

 బ్రహ్మోత్సవాలకు సిద్ధం..

కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా ఏర్పాట్లపై దృష్టి సారించాం. వాహనాల పార్కింగ్‌ రుసుము అధికంగా వసూలు చేసినా, లడ్డూ, పులిహోర, కొబ్బరికాయలను అధిక ధరకు విక్రయించినా చర్యలు తప్పవు.

- అరుణారాజిరెడ్డి, ఆలయ చైర్మన్‌

VIDEOS

logo