గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 18, 2021 , 00:49:18

పాలనాదక్షకుడికి పచ్చని కానుక

పాలనాదక్షకుడికి పచ్చని కానుక

  • పల్లెపల్లెనా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో సబ్బండ వర్ణాలు
  • పల్లెపల్లెనా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు 
  • మొక్కలు నాటి హరితస్ఫూర్తిని చాటిన ప్రజలు
  • కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, 
  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు 
  • జిల్లాలో ఒకేరోజు 3లక్షలకు పైగా మొక్కలు నాటి రికార్డు 
  • సీఎం కేసీఆర్‌ గోత్రనామాల పేరిట యాదాద్రి ఆలయంలో సుదర్శన హోమం

జననేతకు వన కానుక ఇచ్చేందుకు సబ్బండ వర్ణాలు కదం తొక్కాయి. పాలనాదక్షకుడి జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనతో యావత్‌ జిల్లా మురిసిపోయింది. ఒకే రోజు మూడు లక్షలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. భూమి పుత్రుని సంకల్పానికి దన్నుగా కదిలిన అశేష జనవాహిని చూసి పుడమితల్లి పులకించింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు కానుకగా జిల్లాలో బుధవారం చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌' నేపథ్యంలో ఊరూవాడా హరితవర్ణంతో మురిసిపోయింది. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు పాల్గొని ఉద్యమంలా మొక్కలు నాటారు. ఉదయం 10గంటలకే ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ సీఎం కేసీఆర్‌ గోత్రనామాల పేరిట యాదాద్రి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు.   

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లాలో నిర్వహించిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌' విజయవంతమైంది. పచ్చని తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి దన్నుగా ఒకేరోజు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటి జిల్లా ప్రజానీకం పుట్టిన రోజు కానుకను అందించింది. ప్రతి మున్సిపాలిటీలో రెండు వేల మొక్కలు, పంచాయతీలో 800 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు సన్నద్ధమైన ప్రజాప్రతినిధులు, అధికారులు అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలను నాటారు. అవసరానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖలు మొక్కలను సమకూర్చగా, ఆరు మున్సిపాలిటీలు, 419 గ్రామ పంచాయతీల్లో పక్కాగా ప్రణాళికను అమలు చేశారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్విఘ్నంగా ముగిసింది. ప్రతిఒక్కరూ మూడు మొక్కలు నాటి సెల్ఫీ దిగి ‘వనమాలి బిరుదు’ కోసం ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేశారు.

ఆకుపచ్చని ఆకాంక్షకు తోడుగా..

చిన్నా, పెద్ద తేడాలేకుండా సబ్బండ వర్ణాల ప్రజానీకం కోటి వృక్షార్చనలో పాల్గొన్నది. మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కేక్‌కట్‌ చేసిన అనంతరం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి ఆకుపచ్చని సంకల్పానికి హారతులు పట్టారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా, పండుగ వాతావరణంలో సాగింది. జిల్లా నలుమూలలా ఎక్కడ చూసినా మొక్కలు నాటే హడావుడే కనిపించింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని నేతలు సైతం హరిత స్ఫూర్తిని చాటారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గుండాల మండలం సీతారాంపురంలో మొక్కలు నాటారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని రాయగిరి వద్ద మొక్కలు నాటారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ కొలుకుల అమరేందర్‌ పాల్గొన్నారు. మోత్కూరు మండలంలోని అనాజీపురంలో రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి మొక్కలు నాటారు. యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్‌ గోత్రనామాల పేరిట సుదర్శన హోమం నిర్వహించారు. కొండ కింద ఘాట్‌ రోడ్డు సమీపంలో మొక్కలు నాటి ఆ ప్రాంగణానికి నక్షత్ర పార్కుగా ఆలయ ఈవో గీత నామకరణం చేశారు. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో.. వాటి సంరక్షణ కూడా ప్రతిఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు.

VIDEOS

logo