సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 17, 2021 , 00:31:20

హరిత యజ్ఞం

హరిత యజ్ఞం

 • నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన
 • వేడుకలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు సన్నద్ధం
 • జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం
 • మున్సిపాలిటీలో 2వేలు, పంచాయతీలకు వెయ్యి మొక్కలు 
 • ఒకే సమయంలో 3.10లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
 • కార్యక్రమంలో సబ్బండ వర్ణాల భాగస్వామ్యం
 •  మొక్కలు నాటే వారందరికీ  ‘వనమాలి’ బిరుదు

ఆకుపచ్చని తెలంగాణకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరిత కానుకను ఇచ్చేందుకు ఊరు, వాడ సిద్ధమైంది. సీఎం పుట్టినరోజును పురస్కరించుకొని ‘కోటి వృక్షార్చన’ సంకల్పానికి దన్నుగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటనున్నారు. ఈ హరితయజ్ఞంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా సబ్బండ వర్ణాల ప్రజలు భాగస్వాములవుతున్నారు.  ప్రతిఒక్కరూ మూడు మొక్కలను నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌'లో ‘కోటి వృక్షార్చన’ ఓ కలికితురాయిగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఒకే గంటలో మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటేలా ప్రజాప్రతినిధులు, ప్రజలు సన్నద్ధమయ్యారు.

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒకేరోజు కోటి మొక్కలను నాటి సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలన్న మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపుమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా రంగం సిద్ధం చేసుకున్నది. ప్రతి పంచాయతీని యూనిట్‌గా తీసుకుని సర్పంచ్‌ నేతృత్వంలో గుర్తించిన అన్ని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటనున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీశాఖలు సమన్వయం చేసుకుని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే మొక్కలు సమకూర్చాయి. జిల్లాలోని 419 పంచాయతీల్లో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపడుతుండగా, ప్రతీ పంచాయతీలోనూ 700-800 వరకు మొక్కలను బుధవారం ఒక్కరోజే నాటనున్నారు. నర్సరీల్లో ఉన్న 41వేల మొక్కలను, అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న 1.59 లక్షల మొక్కలను పంచాయతీల్లో నాటేందుకు సమకూర్చారు. మరో 1.10 మొక్కలను పంచాయతీలు నార్కట్‌పల్లి, కడెం నర్సరీల నుంచి కొనుగోలు చేసి సమకూర్చుకున్నాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులో 3.10లక్షల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఈ మహాకార్యంలో పాల్గొంటున్నారు. పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లోనూ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయగా, మహిళా సంఘాలు, విద్యార్థులతోపాటు సామాన్య ప్రజానీకం సైతం ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటోంది.

హరితహారం ద్వారా ఆకుపచ్చని తెలంగాణ రాష్ర్టాన్ని ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘కోటి వృక్షార్చన’ కానుకను ఇచ్చేందుకు ఊరు, వాడ కదులుతున్నది. సీఎం సంకల్పానికి దన్నుగా..బుధవారం జిల్లా వేదికగా ఒకేరోజు మూడు లక్షలకుపైగా మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులతోపాటు సామాన్య ప్రజానీకం సిద్ధమవుతున్నది. గ్రీన్‌ ఇండియా 

 • చాలెంజ్‌లో భాగంగా ప్రతిఒక్కరూ మూడు 
 • మొక్కలను నాటి ఈ మహాయజ్ఞంలో 
 • భాగస్వాములవుతున్నారు. 
 • అపర భగీరథుడికి హరితకానుక ఇవ్వాలి
 • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదాద్రి, ఫిబ్రవరి16: అపర భగీరథుడు, ప్రతి పేదింటి పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బుధవారం కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గం లోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వారి వారి గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు హరిత కానుకను ఇవ్వాలి. మున్సిపాలిటీల్లో వెయ్యి మొక్కలు, గ్రామ పంచాయతీ పరిధిల్లో 500 నుంచి వెయ్యి మొక్కలు నాటాలి.

4వేల మొక్కలు నాటుతున్నాం 

అడ్డగూడూరు, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తరఫున 4వేల మొక్కలు నాటుతున్నాం. హైదరాబాద్‌లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటా.

- మందుల సామేల్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ 

గ్రీన్‌ చాలెంజ్‌కు మొక్కలు సిద్ధం

ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 16 : గ్రీన్‌ చాలెంజ్‌తోపాటు సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీవో ఆవుల రాములు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని వన నర్సరీలో వివిధ రకాల మొక్కలను పలు గ్రామాలకు తరలించినట్లు తెలిపారు. గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా సూచించారు.

గ్రామాలు సిద్ధం 

తుర్కపల్లి, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న నిర్వహించనున్న కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఆయా గ్రామ పంచాయతీ పాలకులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలతో పాటు కాలనీలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు గుంతలు సిద్ధం చేశారు. నర్సరీల్లో మొక్కలను తెచ్చి నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వృక్షార్చనకు ఏర్పాట్లు

రామన్నపేట, ఫిబ్రవరి16: రామన్నపేట మండలంలో సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వృక్షార్చన కార్యక్రమానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. మండలంలో 24 గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామంలో వెయ్యి చొప్పున మొక్క లు నాటేందుకు పాదులు తీయించి మొక్కలను సిద్ధం చేశారు. పొడవైన పూల, పండ్ల మొక్కలను వివిధ నర్సరీల నుంచి కొనుగోలు చేశారు.

పంచాయతీ  వెయ్యి మొక్కలు

యాదాద్రి/యాదగిరిగుట్ట రూరల్‌, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం నిర్వహించే కోటి వృక్షార్చనలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రాంగణమైన యాదగిరిగుట్ట పట్టణంలో 2వేల మొక్కలు నాటుతామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌ తెలిపారు. అదేవిధంగా యాదగిరిగుట్ట మండలంలో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీకో వెయ్యి చొప్పున మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొక్కలు జీపీలకు చేరుకోగా, గుంతలు తవ్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించిన అధికారులు వాటి సంరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని రోడ్డుకు ఇరువైపులా, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెట్టడానికి సిద్ధమయ్యారు.

మండలంలో 21వేలు.. మున్సిపాలిటీలో వెయ్యి మొక్కలు

భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిర్వహించే వృక్షార్చన కార్యక్రమానికి మండల వ్యాప్తంగా 21వేల మొక్కలను నాటడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో బాలశంకర్‌ తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో మొక్కలు నాటడానికి గుంతలు తీసినట్లు తెలిపారు. ఇక మున్సిపాలిటీలో వెయ్యి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ ఎన్నం సుదర్శన్‌ తెలిపారు.

‘వనమాలి’ బిరుదు ప్రదానం..

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ‘వనమాలి’ బిరుదును ఇవ్వాలని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్ణయించింది. మొక్కలు నాటిన తర్వాత ఫొటోలు దిగి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను వాట్సాప్‌ నుంచి 90003 65000 నంబర్‌కు GIC అని మెసేజ్‌ చేస్తే యాప్‌ లింక్‌తో కూడిన మెసేజ్‌ తిరిగి మన మొబైల్‌కు వస్తుంది. అందులో ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే.. ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు మెయిల్‌/ మొబైల్‌కు వారం రోజుల్లోపు వస్తుంది. 

ఎంచుకున్న లక్ష్మాన్ని చేరుకుంటాం..

భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 16 : భువనగిరి మున్సిపాలిటీలో మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంచుకున్న లక్ష్మాన్ని చేరుకుంటాం. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా పట్టణంలో 2వేల మొక్కలను నాటేందుకు ఇప్పటికే పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాం. రాయగిరి నుంచి యూనిటీ కళాశాలకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా, సింగన్నగూడెం రోడ్డుకు, అర్బన్‌కాలనీ రోడ్డుకు మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా చేపట్టనున్నాం.

- ఎన్నబోయిన ఆంజనేయులు, మున్సిపల్‌ చైర్మన్‌ భువనగిరి

పండుగలా మొక్కలు నాటుతాం 

యాదగిరిగుట్ట రూరల్‌, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికే గ్రామంలో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొక్కలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడెం ప్రాంతం నుంచి ప్రత్యేకమైన మొక్కలు తెప్పించాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మాసాయిపేట గ్రామంలో సంబురంగా చేపడుతాం.

- వంటేరు సువర్ణరెడ్డి

సీఎం కేసీఆర్‌ మెచ్చిన చిట్టడవి

చౌటుప్పల్‌, ఫిబ్రవరి 16 : చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం తంగేడువనంలో పెంచిన చిట్టడవి సీఎం కేసీఆర్‌ మన్ననలు పొందింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ చిట్టడవి పెంపకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా అటవీశాఖ అధికారులు ఎంచుకున్నారు. కేవలం రెండేండ్ల వ్యవధిలోనే చిట్టడవిని పెంచి అబ్బురపరిచారు. దీంతో ఆ శాఖ అధికారులను ప్రశంసించిన సీఎం.. తానే స్వయంగా ఈ చిట్టడవికి యాదాద్రి నేచురల్‌ మోడల్‌ ఫారెస్ట్‌గా నామకరణం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చిట్టడవుల పెంపకం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తంగేడువనంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ చిట్టడవిని అటవీశాఖ అధికారులు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంచుకొని పెంచారు. మియావాకి పద్ధతిలో రూపాంతరం చెందిన ఈ చిట్టడవి రాష్ర్టానికే మణిహారంగా మారింది. ఈ అటవీ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చిట్టడవుల పెంపకం యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.  అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్ల్లో ఈ చిట్టడవుల పెంపకానికి ఇప్పటికే అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం పరుచుకుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచుతుండటంతో అన్ని గ్రామాల్లో చిరు అడవులు సాక్షాత్కరిస్తున్నాయి. పక్క రాష్ర్టాల అధికారుల బృందం యాదాద్రి నేచురల్‌ మోడల్‌ ఫారెస్ట్‌ను సందర్శించి అబ్బురపడ్డారు. ఇలాంటి అడవులను తమ రాష్ర్టాల్లో సైతం పెంచుతామన్నారు. 

అందరూ భాగస్వాములు కండీ

టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదాద్రి, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, చేనేత సహకార సంఘాల కార్యాలయాల ప్రాంగణంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పీఏసీఎస్‌ చైర్మన్లు, చేనేత సహకార సంఘం చైర్మన్లు, సీఈవోలు బాధ్యతగా స్వీకరించి విజయవంతం చేయాలని కోరారు.

కోటి వృక్షార్చనకు తరలిరండి..

చౌటుప్పల్‌, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. అన్ని మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. రాష్ర్టాన్ని పచ్చని తోరణంగా మార్చేందుకు సీఎం కంకణం కట్టుకున్నారు. అందుకే పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటించే కార్యక్రమమైన కోటి వృక్షార్చన నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడైన సీఎంకు కానుకనందించాలి. - కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 

ఊరికి వెయ్యి మొక్కలు లక్ష్యం

మోత్కూరు, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఊరికో వెయ్యి మొక్కలను లక్ష్యంగా నిర్ణయించి ముందుకు సాగుతున్నాం.  మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో 30 వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రజలందరూ కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.

- కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మోత్కూరు


VIDEOS

logo