శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 08, 2021 , 00:01:46

బంగారు సోమారం

బంగారు సోమారం

పల్లెప్రగతితో మారిన గ్రామ స్వరూపం

అన్నిహంగులతో ఆహ్లాదంగా ఊరు

వంద శాతం అభివృద్ధి పనులు పూర్తి

దాతల సహకారాలతో మరింత ముందుకు

ఆదర్శంగా నిలుస్తున్న బండసోమారం

బండ సోమారం బంగారు సోమారంగా మారుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో  గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. చూసేందుకు చిన్న గ్రామ పంచాయతీ అయినా అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. పంచాయతీ పాలకవర్గం అంకితభావానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సహకారం కూడా తోడు కావడంతో పల్లె స్వరూపమే మారిపోయింది. గ్రామంలో సీసీ రోడ్లతో పాటు హరితహారం అందాలు కనువిందు చేస్తున్నాయి. పల్లెప్రకృతి వనం మరిం త అందం తీసుకురాగా, చివరి మజిలీకి వైకుంఠధామం ఏ లోటు లేకుండా చేస్తోంది. ట్రాక్టర్‌తో ఇంటింటికీ చెత్త సేకరణతో పారిశుధ్య పనులు చురుగ్గా సాగుతుండటంతో వీధులన్నీ మెరిసిపోతున్నాయి.  సర్కారు నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ వేదికగా గ్రామంలోని అనేక శుభకార్యాలు పూర్తవుతున్నాయి. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న బండ సోమారం గ్రామంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం...                      

భువనగిరి, ఫిబ్రవరి 7 : ప్రభుత్వం గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’ కార్యాచరణ ప్రణాళికను సమగ్రంగా అమలు చేస్తూ ముందడుగు వేయడంతో పల్లె వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యాచరణ 100 శాతం అమలు జరుగుతుండటంతో అభివృద్ధికి ఆనవాళ్లుగా మారుతున్నాయి గ్రామసీమలు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సాగిపోతున్న మండలంలోని బండసోమారం గ్రామంపై ప్రత్యేక కథనం..

చిన్న గ్రామపంచాయతీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమస్యలను అధిగమించి ఆదర్శంగా మారింది. ఎక్కడ చూసినా అద్దంలా మెరిసిపోయే సీసీ రోడ్లు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటా చెత్త సేకరణ, పల్లెప్రకృతి వనం ఏర్పాటు, చివరి మజిలీకి చింతలేకుండా వైకుంఠధామం, డంపింగ్‌యార్డు ఏర్పాటు, నిరంతర విద్యుత్‌ కోసం సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతోపాటు అనునిత్యం గ్రామ వీధుల్లో పారిశుధ్య పనులు, గ్రామ పంచాయతీ నిధులతో ట్రాక్టర్‌, ట్యాంకర్‌ కొనుగోలుతోపాటు మిగతా గ్రామాలకు సాటిగా, దీటుగా ఉండేందుకు దాతలు, గ్రామపంచాయతీ నిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నిధులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఫంక్షన్‌హాల్‌ గ్రామంలో జరిగే ప్రతీ శుభకార్యానికి బాసటగా నిలుస్తున్నది బండసోమారం గ్రామపంచాయతీ. గ్రామంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా స్థానిక సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తూ ముందుకు సాగుతున్నారు.

గ్రామస్వరూపం...

బండసోమారం గ్రామం 2329 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1313 మంది జనాభాలో 1098 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, పద్మశాలీ, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులతో కలుపుకొని మొత్తం 243 మందికి పింఛన్లు అందుతున్నాయి. 30 సమభావన సంఘాలలో 300 మంది సభ్యులుగా ఉండి రూ.30లక్షలు స్త్రీనిధి రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా సుమారు రూ.కోటి వరకు రుణాలు అందాయి. తాగునీటి సమస్యను అధిగమించేందుకు గ్రామంలో మూడు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉండగా, వాటితో ప్రజలందరికీ తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో 298 జాబ్‌కార్డులకు గాను 646 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ కూలీల కొరతను, ఆర్థిక చేయూతను కల్పించారు.

అభివృద్ధి దిశగా అడుగులు...

బండసోమారం గ్రామసర్పంచ్‌గా పద్మ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వివిధ రూపాల్లో నిధులను ఖర్చు చేస్తూ గ్రామాభివృద్ధేకి బాటలు వేశారు. ఈక్రమంలో రూ.6లక్షలు గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలోని 1వ వార్డు నుంచి 2వ వార్డు వరకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం. రూ.15లక్షలు హెచ్‌ఎండీఏ నిధులతో రామలింగేశ్వరస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డుతోపాటు గ్రామంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు. ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో ఎస్‌సీ కమ్యూనిటీ భవన నిర్మాణం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు రూ.9.50లక్షలతో శ్మశానవాటిక నిర్మాణ పనులు, గ్రామపంచాయతీ నిధులు రూ.10లక్షలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ కొనుగోలుతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, గ్రామపంచాయతీ, గుండేటి విజయదత్తాద్రి ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంతో గ్రామంలో వివాహాది శుభకార్యాల కోసం ఫంక్షన్‌హాల్‌ నిర్మించారు. అదేవిధంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ, గ్రామంలోని దాతల సహకారంతో విభిన్న కార్యక్రమాలను సైతం చేపడుతూ ముందుకు సాగుతున్నారు. 

అందరి సహకారంతోనే గ్రామ అభివృద్ధి

గ్రామంలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తున్నాం. గ్రామంలో దాతల సహకారంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చేపడుతున్నాం. రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. పల్లెప్రగతి స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. గ్రామానికి చెందిన దాత తుమ్మల జానమ్మాజనార్దన్‌రెడ్డి దాతృత్వంతో గ్రామంలోని నిరుపేదలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత బియ్యం నగదును మూడేండ్లపాటు సొంతంగా భరిస్తున్నారు. అదేవిధంగా గుండేటి విజయదత్తాద్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఉచిత ఇన్సూరెన్స్‌ పథకాన్ని చేపట్టి, గుర్తింపు కార్డులను సైతం అందజేశాం. నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు, మరణించిన కుటుంబాలకు సైతం రూ.5వేల చొప్పున ఆర్థిక చేయూత అందించడం సంతోషాన్ని కలిగిస్తుంది.

- సర్పంచ్‌ నానం పద్మాకృష్ణగౌడ్‌, బండసోమారం

గ్రామ అభివృద్ధిలో 

తన వంతు సహకారం 

గ్రామంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుంది. గ్రామాభివృద్ధికి తోచిన సహాయ సహకారాలను అందిస్తున్నా. గ్రామంలో వివాహాది శుభకార్యాలు, తదితర వాటికి అనువుగా ఉండేలా దత్తాద్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి స్థలాన్ని అందజేశాను. నిరుపేదలకు చెందిన అసంఘటిత రంగ కార్మికులకు సొంత నిధులతో లేబర్‌ ఇన్సూరెన్స్‌ కార్డులు అందజేశా. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సర్పంచ్‌ పద్మాకృష్ణగౌడ్‌, పాలకవర్గ సభ్యులు అహర్నిశలు పాటుపడుతున్నారు.- గుండేటి విజయదత్తాద్రి, మాజీ జడ్పీటీసీ 

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాం. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. పల్లెప్రగతి కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాం. గ్రామంలో ఇబ్బందులకు ఆస్కారం లేకుండా అన్ని వర్గాలతో సమష్టిగా కృషి చేస్తున్నాం.

- మంజుల, పంచాయతీ కార్యదర్శి, బండసోమారం

VIDEOS

logo