గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 07, 2021 , 00:05:09

చేపల పెంపకానికి ప్రోత్సాహం

చేపల పెంపకానికి ప్రోత్సాహం

పీఎం మత్స్య సంపద యోజన కింద దరఖాస్తులకు ఆహ్వానం

12వ తేదీ వరకు గడువు

9 రకాల యూనిట్లకు సబ్సిడీపై రుణాలు 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలా భాను

మత్స్యకారులు, చేపల పెంపకంపై ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) పథకం కింద తొమ్మిది రకాల యూనిట్లకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించింది. 2021లో ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ఔత్సాహిక మత్స్య పెంపకందారులు, మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల సభ్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఈనెల 12వ తేదీలోగా జిల్లా మత్స్యశాఖ అధికారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ పరీవాహక ప్రాంతం, సాగు నీటి కాలువ పరిధిలో చేపల పెంపకానికి అనువుగా ఉన్నట్లు అధికారులు 

గుర్తించారు.                    - భువనగిరి కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6

40 నుంచి 60 శాతం సబ్సిడీ...

ఈ పథకంలో అందించే ఆర్థిక సాయంలో 40శాతం సబ్సిడీ ఉంటుంది. మహిళా, ఎస్సీ, ఎస్టీ మత్స్య పారిశ్రామికులు, ఔత్సాహిక పెంపకందారులకు 60శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ యూనిట్లలో మంచినీటి చేపల హెచరీలు నిర్వహించేవారు, చేపల చెరువులు నిర్మించే వారికి, చిన్న తరహా దాణా మిల్లులు నెలకొల్పే వారికి సొంత భూమి ఉండాల్సి ఉంటుంది. వచ్చే దరఖాస్తులను పరిశీలించిన తరువాత జిల్లాకు యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఒక హెక్టార్‌ చేపల చెరువు నిర్మాణం యూనిట్‌ విలువ రూ.7లక్షలు ఉండగా, ఓసీ, బీసీ వారికి రూ. 2.80లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.4.20 లక్షలు రాయితీ ఉంటుంది. అలాగే చేప పిల్లల హెచరీస్‌ నిర్మాణం, రీ సర్యులెటర్‌ ఆక్వాకల్చర్‌ యూనిట్లకు ఒక్కో దాని విలువ రూ.25లక్షలు ఉండగా, ఓసీ, బీసీ వారికి రూ.10 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.15లక్షలు సబ్సిడీ వస్తుంది. అలాగే కేజీ కల్చర్‌(పంజరపు వలలో చేపల పెంపకం) యూనిట్‌ విలువ రూ.3లక్షలు ఉండగా, ఓసీ, బీసీ వారికి రూ.1.20 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.1.80లక్షల రాయితీ ఉంటుంది. చేపల దాణా మిల్లుల నిర్మాణం యూనిట్‌ విలువ రూ.30లక్షలు ఉండగా, జనరల్‌ వారికి రూ.12లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.18లక్షల రాయితీ వస్తుంది. 

విభాగాలు         యూనిట్‌  విలువ రూ.లక్షల్లో

మంచి నీటి చేపల హెచరీస్‌                                      25 లక్షలు

చేపల పెంపకానికి పౌండ్స్‌ నిర్మాణం                          7 లక్షలు

రీ సర్యులెటర్‌ ఆక్వాకల్చర్‌ సిస్టం                                25 లక్షలు

కేజ్‌ కల్చర్‌                                                                                       3 లక్షలు

ఇన్సులేటేడ్‌ వాహనముల సరఫరా                          20 లక్షలు

మూడు చక్రముల వాహనముల సరఫరా                  3 లక్షలు

చిన్న తరహ చేప దాణా మిల్లుల ఏర్పాటు                30 లక్షలు

మత్స్య విక్రయ కేంద్రముల ఏర్పాటు                            10 లక్షలు

చేపల పెంపకానికి ఇన్పుట్స్‌                                             4 లక్షలు

ముందుగా 

లబ్ధిదారులదే పెట్టుబడి..

ఈ పథకంలో లబ్ధిదారులు మొదటగా మత్స్యశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను పరిశీలించి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. అనంతరం ఎంపికైన వ్యక్తులు కోరుకున్న యూనిట్‌ను సొంత డబ్బులు లేదా బ్యాంక్‌ నుంచి రుణం తీసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. అనంతరం ఎంబీ రికార్డు చేసిన తరువాత సబ్సిడీ అందుతుంది. 

వీరు దరఖాస్తు చేసుకోవచ్చు..

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులు, మత్స్య కృషీవలులు, మత్స్యరంగ కార్మికులు, చేపల విక్రయదారులు, స్వయం సహాయక బృందాలు/మత్స్య రంగంలో సంయుక్తంగా లయబిలిటీ ఉన్నవారు, మత్స్య సహకార సంఘాలు, మత్స్య ఫెడరేషన్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రైవేట్‌ వ్యక్తులు/కంపెనీలు ఉత్పాదక సంస్థలు/కంపెనీలు, షెడ్యూల్డ్‌ కులాల వారికి, షెడ్యూల్డ్‌ తెగల వారికి, మహిళలకు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు www.dof.gov. in, www.nfdb. gov.in వైబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

నియమ నిబంధనలు..

లబ్ధిదారులు తప్పనిసరిగా డీపీఆర్‌(డిటైయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) సమర్పించాలి. ఇందులో ఏ రకము చేపల పెంపకం చేపట్టదలిచారో, నిర్వహణ వ్యయం, సబ్సిడీ కాకుండా లబ్ధిదారులు వెచ్చించాల్సిన వాటా ధనం, ఏ బ్యాంక్‌ నుంచి అప్పుగా తీసుకుంటే ఆ బ్యాంక్‌ నుంచి సమ్మతి పత్రం/లబ్ధిదారుల సొంత నిధులు అయితే వాటికి సంబంధించిన వివరాలు, నిర్వహణ వ్యయం వివరాలను పొందుపరచాలి. లబ్ధిదారులు తప్పకుండా స్థానికంగా ఉండాలి. సంబంధిత భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ను అందించాలి. ఆర్థిక సాయం పొందటానికి చేపపిల్లల పెంపకానికి తవ్విన ఫాండ్స్‌, చెరువులో లోతు కనీసం 1.5 మీటర్లు ఉండాలి. తప్పనిసరిగా ఒక ఎకరం లేదా అంతకు పైగా ఉండాలి. భూమిలేని వారు పదేండ్లకు పైగా లీజుకు తీసుకున్నట్లు ధ్రువపరిచే పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

ఆసక్తి ఉన్న చేపల పెంపకందారులు, మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులు ముందుగా సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ తరువాత సబ్సిడీ మంజూరు అవుతుంది. దరఖాస్తుదారులకు తప్పకుండా భూమి, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఉండాలి. ప్రధానంగా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఈ చేపల చెరువు ఏర్పాటు చేసుకోవాలి.

- షకీలా భాను, జిల్లా మత్స్యశాఖ అధికారి

VIDEOS

logo