గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 03, 2021 , 00:05:12

చేతబడి నెపంతోనే మహిళ దారుణ హత్య

చేతబడి నెపంతోనే మహిళ దారుణ హత్య

బుజ్జి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఏడుగురు అదుపులో... పరారీలో మరో ఇద్దరు..

వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి

భువనగిరి కలెక్టరేట్‌, ఫిబ్రవరి2 : గత నెల 31న దారుణ హత్యకు గురైన సంస్థాన్‌ నారాయణపురం మండలం గాం ధీనగర్‌ తండాకు చెందిన నేనావత్‌ బుజ్జి(45) హత్య కేసు ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నట్లు యాదాద్రి భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి మంగళవారం భువనగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌ 30న గాంధీనగర్‌ తండాకు చెందిన మెగావత్‌ రాజేశ్‌ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తర్వాత మృతుడి అన్న నర్సింహ కోళ్లఫారంలో సుమారు 200 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అనంతరం నర్సింహ భార్య అస్వస్థతకు గురైంది. ఇలా వరుస సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం తమ ఇంటి పక్క న ఉన్న మెగావత్‌ బుజ్జి చేతబడి చేయడంతోనేనని నర్సింహ భావించాడు. బుజ్జిని హతమార్చాలని నిర్ణయించుకున్న నర్సింహ ఈ విషయాన్ని తన తమ్ముడు నగేశ్‌, తండ్రి బద్దు, తల్లి బంగారి, సమీప బంధువులు అమోగోతు సీతారామ్‌, కొర్ర శంకర్‌, స్నేహితులు కారంత్రోత్‌ నాగేశ్‌, రాజశేఖర్‌రెడ్డి, వీరమల్ల స్వామిలతో చర్చించాడు. వారి సహకారంతో జనవరి 31న బుజ్జిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు నర్సింహ. (గతనెల 31న)ఆదివారం బుజ్జి ఆమె తల్లి  నాజ మ్మ, భర్త గణేశ్‌లతో కలిసి బైక్‌పై మంచాల మండలం బండ్లలేమురు గ్రామానికి వెళ్లేందుకు బయల్దేరింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యెడ్ల నర్సింహ అనే వ్యక్తి ఒక్కడే బైక్‌పై అదే దారిలో వెళ్తుండటంతో ఆ బండిని ఆపి దానిపై బుజ్జి ఎక్కింది. ఈ విషయాన్ని నర్సింహ తన తమ్ముడు నగేశ్‌కు చెప్పడంతో నగేశ్‌ బుజ్జి వెళ్తున్న బైక్‌ను వెంబడించి కారుతో ఢీకొట్టాడు. బైక్‌పై నుంచి నర్సింహ, బుజ్జిలు కిందపడ్డారు. కారులో ఉన్న వ్యక్తులు దిగి కిందపడిన బుజ్జిని కారులో ఎక్కించుకొని రాచకొండ గుట్టలపైకి తీసుకెళ్లారు. తర్వాత నర్సింహ, సీతారామ్‌లు బుజ్జిని రాచకొండ గుట్టలపైకి తీసుకెళ్లారు. అక్కడ తమ్ముడిని చేతబడి చేసి చంపింది నువ్వే కదా అంటూ నర్సింహ ప్రశ్నిస్తూనే అక్కడే ఉన్న ఒక రాయితో బుజ్జి తల వెనుకభాగంలో కొట్టాడు. వెంటనే సీతారామ్‌ బుజ్జి చీరతోనే ఆమె మెడకు కట్టి ఊపిరి ఆడకుండా బిగించి హత్య చేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. మంగళవారం నర్సింహకు సంబంధించిన కోళ్లఫారంలో ఉన్న నర్సింహను, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించగా తమ కుటుంబానికి చేతబడి చేసిందని భావించి బుజ్జిని హత్య చేసినట్లు వారు అంగీకరించా రు. నర్సింహతోపాటు బద్దు, బంగారి, సీతారామ్‌, శంకర్‌, నరేశ్‌, నాగేశ్‌లను అదుపులోకి తీసుకోగా రాజశేఖర్‌రెడ్డి, వీరమల్ల స్వామిలు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. వారి నుంచి కారు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బందోబస్తు నడుమ బుజ్జి అంత్యక్రియలు

సంస్థాన్‌ నారాయణపురం, ఫిబ్రవరి2 : దారుణ హత్యకు గురైన బుజ్జి అంత్యక్రియలు మంగళవారం గాంధీనగర్‌తండాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ముగిశాయి. బుజ్జి ఆదివారం హత్యకు గురైనప్పటి నుంచి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఆందోళన చేపట్టారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

VIDEOS

logo