చరమాంకంలో.. చేదోడుగా..

- పాలియేటివ్ కేర్ సెంటర్లో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు భరోసా
- జిల్లాలో ప్రప్రథమంగా చౌటుప్పల్‌లో ఏర్పాటు
- కేర్ సెంటర్లో నాణ్యమైన వైద్యం
- కేంద్రానికి రాలేనివారికి ఇంటి వద్దకే సిబ్బంది
- దేశవ్యాప్తంగా సెంటర్‌కు మంచి గుర్తింపు
చౌటుప్పల్, జనవరి 30: ఒక వైపు వృద్ధాప్యం..మరోవైపు దీర్ఘకాలిక రోగాలతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వృద్ధులకు పాలియేటివ్‌కేర్ సెంటర్ వరంలా మారింది. జీవిత చరమాంకంలో నాణ్యమైన వైద్యం అందిస్తూ..వారిలో మానసిక ైస్థెర్యం నింపుతున్నది. అవసాన దశలో రోగాలతో బాధపడుతున్న తల్లిదండ్రులను చూసుకోవాలని ఉన్నా..తమ దైనందిక జీవన యుద్ధంలోచూసుకోలేక పోతున్న వారిలో కొండంత భరోసానునింపుతున్నది. తమ చివరి దశలో వృద్ధులు ఎంతోగౌరవ ప్రదంగా జీవనం కొనసాగించేందుకు ప్రభుత్వం పాలియేటివ్ కేర్ సెంటర్లకు శ్రీకారం చుట్టింది. కేర్‌సెంటర్‌కు రాలేనివారికి ఇంటి వద్దనే వైద్యం సదుపాయం కల్పిస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో జిల్లాలో ఏకైక సెంటర్‌ను చౌటుప్పల్‌లో 27 జులై 2018న ఏర్పాటు చేశారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించబడ్డ నియోజకవర్గంలో ఈసెంటర్ ఏర్పాటుపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
2500 మందికి వైద్యం..
పాటియేటివ్ కేర్ సెంటర్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వృద్ధులకు నాణ్యమైన వైద్యసదుపాయం అందుతుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని గామాల్లో ఏఎన్ఎంల ద్వారా సర్వే చేయించి దీర్ఘకాలిక రోగుల జాబితాను రూపొందించారు. ప్రధానంగా క్యాన్సర్, మూత్రపిండాలు, కిడ్నీ, గుండె జబ్బులు, షుగర్, పక్షవాతం తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యసేవలు అందుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 2 లక్షల మంది సర్వే నిర్వహించి..వారిలో 2500 మంది వరకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించి వైద్య సేవలు అందించారు. వారంలో రెం డు, మూడు రోజులు సెంటర్‌కు రాలేని వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్‌తో పాటు ఐదుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు, నలుగురు ఆయాలు , డ్రైవర్‌తో కలిపి మొత్తం 14 మంది వైద్య సిబ్బంది వీరికి వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాతో పాటు నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యసదుపాయం పొందుతున్నారు.
సెంటర్‌ను సందర్శించిన శాస్త్రవేత్తలు
చౌటుప్పల్‌లోని పాలియేటివ్ కేర్‌సెంటర్‌ను వివిధ రాష్ర్టాలకు చెందిన శాస్త్రవేత్తలు సందర్శించారు. ఇక్కడ అందిస్తున్న వైద్యసేవలను వారు పరిశీలించారు. ఇప్పటికే సెంటర్‌ను ఢిల్లీలోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సందర్శించి ..సెంటర్లో అందిస్తున్న వైద్యసేవలపై అబ్బురపడ్డారు. ఇంత మంచి వైద్యసదుపాయం కల్పిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సెంటర్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేలా ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలిపారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నిపుణుల బృందాలు ఈ కేర్‌సెంటర్‌ను సందర్శించి ఇక్కడ అందిస్తున్న వైద్యసేవలపై స్టడీ చేశారు.
రోగులకు సూపర్డైట్..
పాలియేటివ్ కేర్సెంటర్లో వైద్యం తీసుకుంటున్న రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తుంది. అంతేకాకుండా సెంటర్లో ఉంటూ చికిత్స పొందుతున్న రోగులకు పక్కాగా న్యూట్రీషియన్ డైట్‌ను అందిస్తున్నారు. రోజూ ఉదయం తొమ్మిది గంటలకు పాలు , బ్రెడ్ అందజేస్తారు. పది గంటలకు రాగి జావ, మధ్యాహ్నం భోజనం, రాత్రి రాగి జావ అందిస్తున్నారు. ఇవి తినలేని రోగులకు ద్రవపదార్థాల రూపంలో ఉన్న ప్రొటీన్ డైట్ అందిస్తున్నారు. వీటికి తోడు ఏమి తినలేని స్థితిలో ఉన్నవారికి పప్పుదినుసులను మొత్తగా చేసి జావ రూపంలో అందిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల కృషితో సాకారం..
జిల్లాలో పాలియేటివ్ కేర్‌సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో .. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసేలా కృషిచేశారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు కలెక్టర్ అనితారామచంద్రన్‌ను చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు. ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతంగా గుర్తించిన నియోజకవర్గంలో కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేయించాడు. వేలాది మంది ఈసెంటర్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
దీర్ఘకాలిక రోగులకు కేర్‌సెంటర్ వరం
గతంలో అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఈప్రాంతంలోని చాలా మంది కిడ్నీ, మూత్రకోశ, గుండె తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా. ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించా.జిల్లాలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకొని చౌటుప్పల్‌లో ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కోరా. పెద్ద మనసుతో అర్థం చేసుకున్న మంత్రి వెంటనే ఇక్కడ కేర్‌సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
-కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే
నాణ్యమైన వైద్యం
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి పాలియేటివ్‌కేర్ సెంటర్ ద్వారా నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. సెంటర్లో అడ్మిట్ కాలేని వారి ఇండ్ల వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్నాం. రోజుకు కనీసం 20 మంది ఇండ్ల వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్నాం. ఇప్పటికే 2500 వేల పైచిలుకు రోగులకు ఈ సెంటర్ ద్వారా వైద్య సదుపాయం కల్పించాం. జిల్లాతో పాటు నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు.
-డాక్టర్ కాటంరాజు, పాలియేటివ్‌కేర్ సెంటర్ ఇన్చార్జి, చౌటుప్పల్
తాజావార్తలు
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..