ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 31, 2021 , 03:04:00

రా.. రమ్మంటున్న రేపటి ప్రపంచం

రా.. రమ్మంటున్న రేపటి ప్రపంచం

  • రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ పోటీలకు సర్వం సిద్ధం
  • నేటి నుంచి రాయగిరి ఇంక్రిడబుల్‌ ఇండియాలో పోటీలు 
  • ఎనిమిది విభాగాల్లో ఎంపిక ప్రక్రియ
  • ప్రతిభ కనబర్చిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు పురస్కారాలు
  • ఏర్పాట్లు  పూర్తిచేసిన జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌
  • పాల్గొననున్న 1100 మంది క్రీడాకారులు

భువనగిరి, జనవరి 30: రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ పోటీలకు  జిల్లా మొట్టమొదటి సారి వేదిక కానున్నది. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 31న పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలో ఇంక్రిడబుల్‌ ఇండియా(టుమారోవరల్డ్‌)లో ఈ పోటీలు నిర్వహించేందుకు అసోసియేషన్‌ సభ్యు లు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రాస్‌ కంట్రీ పోటీల్లో పాల్గొనేందుకు ఆయా జిల్లాల్లో ఎంపికైన క్రీడాకారులు భారీసంఖ్యలో రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు  లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 1100 మంది క్రీడాకారులు రానున్న తరుణంలో క్రీడాకారుల సర్టిఫికెట్ల పరిశీలన, క్రీడల నిర్వహణ, అతిథులకు ఆహ్వానం, నగదు పురస్కారాలు, సర్టిఫికెట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. పురుషులు, మహిళలు, అండర్‌ 20, 18, 16 విభాగాలకు సంబంధించి ఎనిమిది అంశాల్లో పరుగు పందెం నిర్వహించనున్నారు. పూర్తి స్థాయిలో కొవిడ్‌ నిబంధనలు అనుసరించి పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పాల్గొననున్న 1100 మంది క్రీడాకారులు

రాష్ట్రం నలుమూలల నుంచి 1100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 6 గంటల వరకు  క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.  రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న క్రీడాకారుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం పోటీలు నిర్వహిస్తారు. 

ఎనిమిది విభాగాల్లో ఎంపిక ప్రక్రియ

జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రాస్‌ కంట్రీ పోటీలకు సంబంధించి ఎనిమిది విభాగాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా అండర్‌-16 విభాగంలో బాలురు, బాలికలకు రెండు కిలోమీటర్ల పరుగుపందెం, అండర్‌-18 విభాగంలో బాలికలకు నాలుగు కిలోమీటర్లు, అండర్‌-18 బాలురకు ఆరు కిలోమీటర్ల పరుగుపందెం, అండర్‌-20 బాలికలకు ఆరు కిలోమీటర్లు, అండర్‌-20 బాలురకు 8కిలోమీటర్ల  పరుగుపందెం ఉంటుంది. అదే విధంగా 20 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళల విభాగాలకు 10 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నారు. మొదటగా 20 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళల విభాగానికి పోటీలు నిర్వహించనున్నారు.  

మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్ల పంపిణీ

క్రాస్‌ కంట్రీ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లతోపాటు, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన  ఆరుగురికి మెడల్స్‌ అందజేయనున్నారు. అంతేకాకుండా మొదటి విజేతకు నగదు పురస్కారం కింద రూ.1000, రెండో విజేతకు రూ. 750, మూడో విజేతకు రూ. 500   అందజేయనున్నారు.  క్రాస్‌ కంట్రీ పోటీల్లో చాంపియన్‌షిప్‌ సాధించిన జట్లకు ప్రత్యేక గుర్తింపు కల్పించి మొదటి జట్టుకు రూ.2000, రెండో స్థానానికి రూ.1600. మూడో స్థానానికి రూ.1200 చొప్పున నగదు పురస్కారాలు అందించనున్నారు.

అతిథులకు ఆహ్వానాలు

క్రాస్‌ కంట్రీ రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలకు జిల్లాలోని పలువురు అతిథులకు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆహ్వానాలు అందజేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్యతో పాటు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, డీసీపీ, ఏసీపీ, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైనీ, యువజన సర్వీసులశాఖ అధికారులను ఆహ్వానించారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం

జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రాస్‌ కంట్రీ పరుగు పందెం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలకు లోబడి కార్యక్రమాన్ని చేపడుతాం. అతిథులకు సైతం ఆహ్వానాలు అందజేశాం. పరుగు పందెంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లతో పాటు ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్‌, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు  అందజేయనున్నాం. 

-కోనేటి గోపాల్‌, జిల్లా అథ్లెటిక్స్‌ ప్రధాన కార్యదర్శి

VIDEOS

logo