శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jan 30, 2021 , 02:45:31

లాక్‌డౌన్‌ నేర్పిన సాగు పాఠం

లాక్‌డౌన్‌ నేర్పిన సాగు పాఠం

  • పట్నంలోఉద్యోగం వదిలి..పల్లెలో పుదీన సాగు 
  • ఒక్కసారి నాటితే మూడేండ్ల వరకు దిగుబడి 
  • నెల జీతం కంటే అధిక ఆదాయం 

నా పేరు ఎల్లబోయిన హరిబాబు. మాది బొమ్మలరామారం. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాణ్ణి. 15 వేలు జీతం వచ్చేది. లాక్‌డౌన్‌తో ఉన్న ఉద్యోగం పోయింది. జాబ్‌ పోయినపుడు బాధపడ్డా. కానీ జీవితం అయిపోలేదని ఊరికొచ్చాను. ఎకరం భూమిలో పుదీన, ఆకుకూరలు పెట్టాను. ఇప్పుడు నేను జీతం కంటే ఎక్కువ సంపాదిస్తూ మరో ముగ్గురికి పనికల్పిస్తున్నాను.

బొమ్మలరామారం, జనవరి 29 : వ్యవసాయం చేస్తే తక్కువ ఆదాయం ఉంటుందని పట్నం పోయి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తేనే సమాజంలో విలువ ఉంటుందనేది కరోనాకు ముందున్నమాట. ఖర్చులు ఎక్కువైనా పట్నం ఉద్యోగం కోసం పాకులాడే పరిస్థితి నుంచి  లాక్‌డౌన్‌తో   ఉద్యోగం పోయినా ఆందోళన చెందకుండా వినూత్నంగా ఆలోచించి యువత ఆధునిక వ్యవసాయం, సాగు పద్ధతుల వైపు మొగ్గు చూపడం వల్ల అధిక ఆదాయం పొందడంతోపాటు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. యువత గ్రామాల్లో వ్యవసాయంపై అభిరుచి పెంచుకోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు పాతరోజులు తిరిగి వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  రుచి రావాలంటే వంటల్లో పుదీన వేయాల్సిందే. వేడి తగ్గడానికి పుదీనాను కషాయంగా, ఆరోగ్యం కోసం నిత్యం హెర్బల్‌ టీగా వాడుతారు. సన్మానాలకు గజమాల గాను, కొన్ని మందుల తయారీలోనూ వాడుతారు.  మార్కెట్‌లో కూరగాయల డిమాండ్‌లో హెచ్చుతగ్గులు ఉండటంతో రైతులకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. కానీ ఒక్కసారి నాటితే సంవత్సరమంతా ప్రతిరోజూ  దిగుబడి వచ్చే పుదీన సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండల కేంద్రంతోపాటు రంగాపూర్‌, తిమ్మాపూర్‌ చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో రైతులు పుదీన సాగుతో కాసుల పంట పండిస్తున్నారు. తక్కువ  విస్తీర్ణంలో, తక్కువ నీటి సౌకర్యంతో పండించడానికి అనువైన పంట ఇది. చీడపీడల బాధ కూడా తక్కువ ఉండటంతో ఈ పంట సాగుపై ఆసక్తిని చూపుతున్నారు. వివిధ రకాల ఆకుకూరల సాగుతోపాటు పుదీన పెంపకంతో రైతులు ప్రతిరోజూ ఆదాయం పొందుతున్నారు. ఈ కట్టలు ఎక్కువ సమయం ఎండిపోకుండా ఉండటంతో డిమాండ్‌ను బట్టి వివిధ ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతలు, హైదరాబాద్‌ మార్కెట్‌లో అమ్ముకుంటారు. కొద్దిపాటి పొలం, నీరు అందుబాటులో ఉన్న రైతులు కూడా దీనిని డ్రిప్‌, స్ప్రింకర్లు ఉపయోగించి తక్కువ నీటితో పంటను సాగు చేస్తున్నారు.  

ఆలోచన మార్పుతోనే అధిక ఆదాయం

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా రూ.15వేల జీతానికి పనిచేసేవాన్ని.  కరోనా లాక్‌డౌన్‌తో ఉద్యోగం కాస్త పోయింది. దీంతో ఉపాధి పోయిందని మొదట కొంత ఆవేదన చెందా. ఉద్యోగాలు కోల్పోతే కొందరు సర్వస్వం కోల్పోయామనే భావనతో ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేపర్లలో వార్తలు చూశాను. నాకున్న కొద్ది పాటి భూమిని వినియోగించి నేను ఉపాధి పొందడంతోపాటు ఇతరులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నాను. సొంత గ్రామంలో ఉపాధి పొందాలనే సంకల్పంతో నాకున్న రెండు ఎకరాల్లో 20 గుంటలు పుదీన, 20 గుంటల్లో ఆకుకూరలు పండించడం మొదలుపెట్టాను. స్ప్రింక్లర్లు, పైపులు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు కలిపి రూ.90వేల వరకు ఖర్చు పెట్టాను. నాటిన 45వ రోజు నుంచి పుదీన పంట కోసుకోవచ్చు. రోజు 1500 కట్టలు కట్టడానికి కూలీలకు రూ.600 చెల్లిస్తాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.28వేల పైనే గిట్టుబాటు అవుతుంది. దీనికి తోడు 20 గుంటల భూమిలో పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర పెంచడం వల్ల రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం పొందుతున్నాను. రైతే రాజు కావాలని ఆశించే మన సీఎం కేసీఆర్‌ అందించిన రైతుబంధు, నిరంతర విద్యుత్‌ అందించడం వల్ల పంట సాగు చేయడం సులభతరమైంది. వ్యవసాయానికి సాయం అందించిన సీఎం కేసీఆర్‌ సార్‌కు రుణపడి వుంటా.

- ఎల్లబోయిన హరిబాబు, రైతు, బొమ్మలరామారం

ఏ రోజుకారోజూ సంపాదన

ప్రజలు ప్రతిరోజూ ఏదోరకం కూరగాయలను కొంటూనే ఉంటారు. ఇక ఆకు కూరలకైతే ఏడాది పొడవునా డిమాండే ఉంటది. 25 గుంటల్లో మెంతికూర, తోటకూర పండిస్తున్నం. అర ఎకరంలో మిర్చిని వేశాం. ఇంటిల్లిపాదీ పొలంలో పని చేసుకుని, పండిన ఆకు కూరలను స్వయంగా అమ్ముకుని నెలకు రూ.30వేలు సంపాదించుకోగలుగుతున్నం.

- బండ్ల వరమ్మ, మహిళా రైతు, రంగాపురం, బొమ్మలరామారం మండలం 


VIDEOS

logo