శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 25, 2021 , 02:04:59

ఓటే వజ్రాయుధేం

ఓటే వజ్రాయుధేం

  •  చైతన్యంతోనే సుపరిపాలన   
  • మన భవిష్యత్‌ మన చేతుల్లోనే..   
  • నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం  
  • జిల్లా ఓటర్లు 4,16,881

1950 జనవరి 25వ తేదీ ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఓటు ప్రాముఖ్యత, కొత్త ఓటు నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఓటు హక్కు, ఓటును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిస్తుంది. 

భువనగిరి కలెక్టరేట్‌/ ఆలేరు టౌన్‌/ ఆలేరు రూరల్‌, జనవరి 24 : దేశ సమగ్రత, అభివృద్ధి కోసం పాలకులను ఎన్నుకోవటానికి ఓటే కీలకం. అది ఒక వజ్రాయుధం. భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. పాలకులను ఎన్నుకోవడమే ఓటు ముఖ్య ఉద్దేశం. దేశాన్ని.. రాష్ర్టాన్ని.. చివరికి చిన్న గ్రామాన్ని నడిపించేది పాలకులే. పాలకులను నిర్ణయించగల సత్తా ఓటు ద్వారానే సొంతం. ఓటు వేసేందుకు కొంత మంది ఆసక్తి చూపకపోగా, మరికొంత మంది ఓటు నమోదుకు ముందుకు రావడం లేదు. అయితే ఓటరు జాబితాలో పేరు నమోదు ఎంత ముఖ్యమో.. ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అంతకంటే ముఖ్యం. ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,16,881 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 ఏండ్ల నుంచి 29 ఏండ్ల వయస్సులోపు 89,987 వారికి ఓటు హక్కు ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల సవరణ -2021 ప్రకారం ఆలేరు, భూదాన్‌ పోచంపల్లి మండలాల్లో మినహా మిగతా మండలాల్లో ఓటర్ల శాతం తగ్గింది. జిల్లాలో మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 1.05శాతం, భువనగిరిలో 1.06శాతం ఓటర్లు తగ్గారు. ఇందుకు తొలగింపులే కారణం. లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 989 మంది స్త్రీలు ఉన్నారు. ఓటర్ల జాబితాలో యువత భాగస్వామ్యం క్రమంగా పెరుగుతుంది. 

దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది...

ప్రజాస్వామ్య పటిష్ఠత ఎన్నికలపైన ఆధారపడి ఉంటుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటర్లే.. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్రే పోషిస్తున్నది. ఏ రాజకీయ పార్టీకి తలవంచక స్వతంత్య్రంగా తన విధులను నిర్వర్తిస్తుంది. కేంద్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు విధులను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ప్రజాస్వామ్యం మనుగడ ఓటరుపై ఆధారపడి ఉన్నందున ఈ రెండు ఓటర్లను చైతన్యం చేస్తున్నాయి. 

ఓటరుగా నమోదు ఇలా...

18 ఏండ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. కొత్తగా ఓటు హక్కు పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. ఓటు నమోదుకు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, తల్లిదండ్రుల ఆధారంగా జనన ధ్రువీకరణ, అఫిడవిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా పొందిన సంబంధిత దరఖాస్తును 15 రోజుల్లోగా పొందుపర్చిన వివరాల ఆధారంగా పరిశీలించిన తరువాత రెవెన్యూ అధికారులు ఓటరు కార్డును లబ్ధిదారులకు పోస్ట్‌ ద్వారా పంపిస్తారు. మీ సేవా కేంద్రాల నుంచి కూడా డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు. 

జిల్లా ఓటర్లు 4,16,881..

జిల్లాలో మొత్తం 4,16,881 ఓటర్లు ఉన్నారు. గతంలో 4,21,271 ఓటర్లు ఉండగా, కొత్తగా 2608 మందిని చేర్చగా, 6998 మందిని తొలగించారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 4,16,881 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 2,09,152 ఉండగా, స్త్రీలు 2,07,727, ట్రాన్స్‌జెండర్లు ఇద్దరున్నారు. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో పురుషులు 1,00,952, స్త్రీలు 1,00,355 ఉండగా, ఆలేరు నియోజకవర్గంలో పురుషులు 1,08,200, స్త్రీలు 1,07,372, ట్రాన్స్‌జెండర్లు ఇద్దరు ఉన్నారు. 

చాలా సంతోషంగా ఉంది 

నేను బీకాం సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. ఈ ఏడాది నాకు ఓటు హక్కు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలపై ఉన్న ఆసక్తితో ఓటరుగా నమోదు చేయించుకున్నాను. మంచి పాలకులను ఎన్నుకోవాలంటే చదువుకున్న యువతకు ఓటు ఉండాలి. ఓటు వేయడం మరువను. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. 

- మంత్రి వెంకటసాయికిరణ్‌, ఆలేరు  

నేర చరితుడిని తిరస్కరించాలి 

ఎన్నికల్లో నేర చరిత్ర గల వారిని తిరస్కరించాలి. ఓటు వేసే ముందు ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిలబడే వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. అభ్యర్థి నచ్చకపోతే నోటాకు వేయాలి. డబ్బులకు ఆశపడి ఓట్లు వేయవద్దు. ప్రజల కోసం పని చేసే వారికే ఓటు వేయాలి. 

- నిషిత, విద్యార్థిని, సంస్థాన్‌నారాయణపురంఓటు బ్రహ్మాస్త్రం 

ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఓటు బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క ఓటు ఫలితాన్నే మార్చేస్తుంది. ప్రజల భవిష్యత్‌ను మారుస్తుంది. తప్పనిసరిగా ఓటు వేయాలి. విద్యావంతులను ఎన్నుకోవాలి. నేరచరిత్ర గల వారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. 

- దూడల లత, 

  • బీటెక్‌ తృతీయ సంవత్సరం 
  • విద్యార్థిని, కొలనుపాక ఓటు వినియోగించాలి..

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 18 ఏండ్లు నిండిన యువతకు కొత్త ఓటు హక్కు కల్పించడానికి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తాం. ఓటు విలువ, ప్రాముఖ్యతను వివరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామ్య పటిష్ఠత ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. దేశంలో యువత బలం ఎక్కువగా ఉన్నది. కాబట్టి దేశ భవిష్యత్‌ దృష్ట్యా యువతకు ఓటు నమోదు చేసుకొని ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించాలి.

- అనితారామచంద్రన్‌, కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా

VIDEOS

logo