శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 23, 2021 , 00:03:36

సడక్‌ సురక్షా.. జీవన్‌ రక్ష!

సడక్‌ సురక్షా.. జీవన్‌ రక్ష!

  • రోడ్డు భద్రత.. అందరి బాధ్యత 
  • నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలి 
  • జిల్లాలో 32వ జాతీయ  రోడ్డు భద్రతా మాసోత్సవాలు 
  • బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు 

అతివేగం.. అజాగ్రత్త.. నిర్లక్ష్యం.. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం.. పరిమితికి మించి ప్రయాణించడం.. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతుండడంతో నిత్యం ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాల్లో కొందరు విగతజీవులుగా మారు తుండగా, మరెంతో మంది క్షతగాత్రులవుతున్నారు. దీంతో  ఆ కుటుంబాల్లో తీరని దుఃఖం మిగులుతున్నది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు, వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఏటా రవాణా శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు  ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహిస్తున్నారు. 

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, జనవరి 22 ( నమస్తే తెలంగాణ): “రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం.. జిల్లా మీదుగానే ఇతర జిల్లాలకు, రాష్ర్టాలకు ప్రధాన రహదారుల సౌకర్యం ఉండటంతో హైదరాబాద్‌- విజయవాడ, హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారులు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటాయి. ఇదే క్రమంలో ప్రమాదాలు సైతం చోటుచేసుకుని రహదారులు రక్తం చిమ్ముతున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు పోలీస్‌, రవాణాశాఖలు బారికేడ్లు, స్పీడ్‌ లేజర్‌గన్‌, సీసీ కెమెరాలు, స్టాపర్స్‌ ఇలా అన్ని రకాల ప్రతిష్ఠ చర్యలు చేపట్టడంతో గతంలో కంటే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోడ్డు భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌ నియమ నిబంధనలపై వాహనదారుల్లో కల్పిస్తున్న అవగాహన  సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు జిల్లాలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.”

తగ్గుముఖం పట్టిన  ప్రమాదాలు

జిల్లాలోని  హైదరాబాద్‌- విజయవాడ(65), హైదరాబాద్‌- వరంగల్‌ (163) జాతీయ రహదారులపై నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌లో కాస్తంత తగ్గుముఖం పట్టిన రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో మళ్లీ అధికమవుతున్నాయి. జాతీయ రహదారులు విశాలంగా ఉండటంతో వాహనాల స్పీడు 100కిలోమీటర్ల నుంచి 140కిలోమీటర్ల వేగంతో రయ్‌ రయ్‌ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో బాధిత కుటుంబాలు సైతం రోడ్డున పడుతున్నాయి. ఎంతో భవిష్యత్‌ ఉన్న యువత సైతం ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లేని వారు.. మద్యం తాగి వాహనాలను నడపడం.. సరిగ్గా  నడపడం రాని మైనర్లు వాహనాలను నడుపుతుండటం వంటి కారణాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నివారణ చర్యలతో పాటు కేసుల నమోదు

ట్రాఫిక్‌ నిబంధనలపై చాలా మందికి అవగాహన  లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి డ్రైవ్‌ చేయడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడం, ఓవర్‌ లోడింగ్‌ వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 65, 163 జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలను తరచూ  చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయడంతోపాటు స్టిక్కర్లు, రేడియం కోన్స్‌ను వేయటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో పోలీస్‌, రవాణాశాఖలు నిత్యం ఎక్కడో ఓ చోట తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. గత యేడాదిలో రవాణా శాఖ జిల్లాలో 453 కేసులను నమోదు చేసి 94 లక్షలకు పైగా ఫైన్‌ రూపంలో రాబట్టింది.

ప్రతి యేటా అవగాహన  

 జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా జిల్లాలో ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు ‘సడక్‌ సురక్షా.. జీవన్‌ రక్ష’ నినాదంతో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తోంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గతంలో మాదిరిగా కాకుండా.. ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రత్యేకంగా కరపత్రాలు, స్టిక్కర్లు రూపొందించి ఆటో, లారీ, డీడీఎం, కారు డ్రైవర్లకు, యువతకు, మైనర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

పాటించాల్సిన నిబంధనలు

  • ద్విచక్ర వాహనదారులు విధిగా  హెల్మెట్‌ ధరించాలి
  • కార్లు, ఇతర పెద్ద వాహనాలు  నడిపేవారు సీటు బెల్ట్‌ ధరించాలి
  • మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడుపరాదు
  • రాంగ్‌ రూట్‌ ప్రయాణం ప్రమాదకరం
  • ప్రతి వాహనదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌  తప్పకుండా కలిగిఉండాలి.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం 

ప్రతి సంవత్సరం నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో వాహనాల కండీషన్‌తోపాటు ప్రమాదాల నివారణకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. మానవ తప్పిదం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడుపడం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.

-సురేందర్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి

VIDEOS

logo