శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 23, 2021 , 00:03:36

రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌కు బ్రేక్‌

రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌కు బ్రేక్‌

  •  కొవిడ్‌ 19 నేపథ్యంలో నిర్ణయం
  • ఓటీపీ ద్వారానే సరుకుల పంపిణీ
  • మొబైల్‌కు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి 
  • జిల్లాలో 481 రేషన్‌ దుకాణాలు

భువనగిరి కలెక్టరేట్‌, జనవరి 22 : ఇకపై  రేషన్‌ దుకాణాల వద్ద సరుకుల కోసం వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. రేషన్‌ కార్డు నంబర్‌ చెప్పి...ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ చెబితే పనిఅయిపోతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటీపీ పద్ధతితో సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రేషన్‌ డీలర్లకు ఆదేశాలు వచ్చాయి. ఇటీవల కొవిడ్‌ 19 నేపథ్యంలో ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి ఇప్పటి దాకా ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటీపీ విధానం ద్వారా రేషన్‌ను యథావిధిగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

జిల్లాలో 481 రేషన్‌ దుకాణాలు...

జిల్లాలో మొత్తం 481 రేషన్‌ దుకాణాలు ఉండగా 2,13,810 మంది లబ్ధిదారులు రేషన్‌ తీసుకుంటున్నారు. అయితే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు తీసుకొని రేషన్‌ ఇస్తున్నారు. దీని వల్ల కరోనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్‌ విధానంలో వైరస్‌   వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం ఈవిధానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఫిబ్రవరి 1 నుంచి....

ఫిబ్రవరి 1, 2021 జిల్లాలోని అన్ని రేషన్‌దుకాణాల్లోకేవలం ఐరిస్‌, ఓటీపీ విధానాల్లో మాత్రమే రేషన్‌ పంపిణీ చేస్తారు. లబ్ధిదారుల ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ లింక్‌ అయిందో లేదో పరిశీలించి...ఒక వేళ కాకుంటే మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలకు వెళ్లి అనుసంధానం చేయించుకోవాలి. రేషన్‌ తీసుకునే సమయంలో డీలర్‌కు లబ్ధిదారులు తమ రేషన్‌ కార్డు నంబర్‌ చెప్పాలి. ఈ-పాస్‌ యంత్రంలో ఆ నంబర్లు ఫీడ్‌ చేస్తే లబ్ధిదారుడి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.  అదే ఓటీపీని రేషన్‌ డీలర్‌కు తెలియజేసినట్లయితే రేషన్‌కార్డుదారులకు సరుకులు అందిస్తారు. కాబట్టి  రేషన్‌ లబ్ధిదారులు ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ లింక్‌ లేనటువంటి వారు తమ దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి లింక్‌ చేయించుకోవాలి.

VIDEOS

logo