ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 21, 2021 , 00:03:26

యంత్రానికి దీటుగా నాట్లు

యంత్రానికి దీటుగా నాట్లు

  • వారెవ్వా..వలస కూలీ
  • వరినాట్లు వేస్తున్న ఉత్తరప్రదేశ్‌ మగ కూలీలు
  • గజ్వేల్‌ నియోజకవర్గంలో పనులు
  • దిగుబడి పెరుగుతుందంటున్న రైతులు, వ్యవసాయ అధికారులు
  • ఆసక్తి చూపుతున్న రైతాంగం

మన వద్ద మామూలుగా వరినాట్లు ఆడవారు వేస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్‌ (యూపీ) నుంచి వచ్చిన మగ కూలీలు నాట్లు వేయడం స్థానికులను ఆలోచింపజేస్తున్నది. 20మంది కలసి రోజుకు 6 ఎకరాల వరకు నాటు వేయడం ఆశ్చర్యాన్ని కల్గిస్తే, చిక్కుగా కాకుండా యంత్రం వేసినట్లు సాళ్లుగా నాటు వేయడం, తొవ్వలు వదలడం స్థానిక నాటు ధర కన్నా తక్కువ ధరకే నాట్లు పూర్తి కావడం రైతులను ఆకర్షిస్తున్నది. శాస్త్రీయంగా సాలు పద్ధ్దతిలో చేతితో యంత్రాలకు దీటుగా నాట్లు వేయడంతో యూపీ కూలీలకు డిమాండ్‌ ఏర్పడింది. వారితో పనులు చేయించేందుకు ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

-గజ్వేల్‌, జనవరి 20 

గజ్వేల్‌, జనవరి 20 : మామూలుగా తెలంగాణలో వరి నాట్లు మహిళలు వేస్తారు. కానీ, యూపీ నుంచి వచ్చిన వ్యవసాయ మగ కూలీలు వరినాట్లు వేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కర్ణాటక, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ తదితర ప్రాంతాలకు సీజన్‌లో వరినాట్లు వేయడానికి కొన్నేండ్లుగా యూపీ నుంచి కూలీలు వలస వస్తున్నారు. 20 మంది వ్యవసాయ కూలీలు ఓ గ్రూపుగా ఏర్పడి వరినాట్లు వేస్తున్నారు. తూప్రాన్‌ మండలం నాగులపల్లి, మాసాయిపేట మండల కేంద్రానికి ఈ కూలీలు ప్రస్తుతం వచ్చారు. నాగులపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు పొలంలో సోమవారం నుంచి 20 మంది కూలీలు నాటు వేస్తున్నారు. వీరంతా మగ వారే. నారు పీకడం, మడ్లలో పంచడం, నాట్లు వేయడం పనులన్నీ వీరే చేస్తున్నారు. ఒక్కొక్కరు ఆరు లేదా ఏడు సాళ్లు నాటు వేస్తున్నారు. ఒకవైపు దారం పెట్టుకుని ఆదే లైనుగా మిగతా ఆరు సాళ్లను యంత్రం నాటువేస్తున్నారు. బాణం వెళ్లినట్లు వరినారు నాటడం వారి నేర్పరితనానికి నిదర్శనంగా కన్పిస్తున్నది. 20మంది కూలీలు ఒకరోజు 6 ఎకరాల్లో నాటు వేయడం గమనార్హం. యంత్రం వేసినట్లు సాళ్లుగా నాట్లు వేస్తున్నారు. వారే నారు పీక్కుని మడ్లలో పంచుకుని నాట్లు వేస్తున్నారు. రైతు కేవలం పొలం సిద్ధ్దం చేసి ఇవ్వడంతో పాటు ఎరువులు చల్లు కుంటే సరిపోతుంది.

తక్కువ ధరకే..

యూపీ వలస కూలీలు తక్కువు ధరకే నాట్లు వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సామాన్యంగా స్థానిక వ్యవసాయ కూలీలు ఎకరాకు రూ.5వేలు తీసుకుంటుండగా, వరి నారును మడ్లలో పంచడం కోసం కూలీ ఖర్చు రైతు భరించాల్సి ఉంటుంది. యూపీ కూలీలు మాత్రం ఎకరా కు రూ.4 వేలు  మాత్రమే తీసుకుంటున్నారని, నారును మడ్లలో వారే పంచుకుంటున్నారని, తద్వారా కూలీల ఖర్చు తగ్గిందని రైతులు చెబుతున్నారు. సకాలంలో వరినాట్లు పూర్తి కావడంతో పాటు సాలు పద్ధ్దతిలో నాటుతో కలుపు యంత్రాలతో తీయవచ్చని, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పైరుకు అందించడం సులభం అవుతుందని రైతులు చెబుతున్నారు. పైగా ఎకరాకు 6నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాటు బాగుంది.. 

యూపీ కూలీల వరి నాటు వేయడం బాగుంది. శాస్త్రీయంగా సాలు పద్ధ్దతిలో నాట్లు ఉండటంతో పాటు రైతుకు సకాలంలో పనులు పూర్తి కావడంతో తక్కువ ఖర్చు వస్తుంది. మగ వారు నాటు ఎలా వేస్తారని అనుకున్నాం. నాటు వేసిన తర్వాత చాలామంది వచ్చి చూసి మేము కూడా నాటు వేయించుకుంటామని చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన పలు గ్రామాల నుంచి రైతుల వచ్చి చూసి వారి గ్రామాలకు యూపీ కూలీలను తీసుకుపోతామని చెబుతున్నారు.

-భగవాన్‌రెడ్డి , సర్పంచ్‌, నాగులపల్లి   

25 ఎకరాలు నాటేయిస్తా.. 

 ఏటా నేను 30ఎకరాల్లో వరి సాగు చేస్తా. వరినాట్లకు కూలీల కొరతతో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్నది. సోమవారం యూపీ మగ కూలీలు 20 మంది వచ్చి నాపొలంలో నాటు వేశారు. ఎకరాను రూ.4 వేలు తీసుకుంటున్నారు. నారు పీక్కుని మడ్లలో వారే పంచుకుని నాటు సాలు పద్ధ్దతిలో వేస్తున్నారు. వ్యవసాయ అధికారుల వచ్చి చూసి నాటు శాస్త్రీయ పద్ధ్దతిలో నాట్లు ఉన్నాయని, పెట్టుబడి ఖర్చు కలిసి వస్తుందని, దిగుబడి పెరుగుతుందని చెప్పారు.

-శ్రీనివాస్‌రెడ్డి , రైతు, నాగులపల్లి  

యంత్రంతో.. ఎంచక్కా నాటు


వానకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో యాసంగిలో పంటల సాగుకు ముమ్మరంగా కొనసాగుతున్నది. రైతులు జోరుగా వరినాట్లు వేస్తున్నారు. వరినాట్లు వేసేందుకు గ్రామాల్లో కూలీల కొరత వేధిస్తున్నది. రైతులు ఒక్కో కూలీకి రూ.400 నుంచి 500 వరకు చెల్లిస్తున్నారు. కూలీలతో నాటు వేయడానికి ఎకరానికి రూ.6 వేల వరకు ఖర్చవుతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కూలీల సమస్యను అధిగమించడానికి ఇబ్రహీంనగర్‌ గ్రామానికి చెందిన రైతు కాసర్ల యాదయ్య యంత్రంతో వరినాటు వేయిస్తున్నాడు. యంత్రంతో నాటు వేయడానికి ఎకరానికి రూ.3600 ఖర్చు అవుతుందని అతను తెలిపారు. యంత్రంతో నాటు వేయడం ద్వారా కూలీల అవసరం ఉండదని, దిగుబడి కూడా బాగా వస్తుందని రైతు తెలిపాడు. 

-చిన్నకోడూరు, జనవరి 20 

ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి..


  • పంటకు దిష్టి తగలకుండా హీరోయిన్ల ఫ్లెక్సీలు
  • వినూత్నంగా మిర్చి రైతు ఆలోచన

చిన్నకోడూరు, జనవరి 20 : సాధారణంగా హీరోయిన్ల ఫొటోలు సినిమా థియేటర్లలో, అభిమానం ఉంటే ఇండ్లలో.. లేదంటే గోడలపై చూస్తాం.. కానీ చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామానికి చెందిన రైతు చంద్రమౌళి తన మిర్చి పొలంలో తమన్నా, కాజల్‌ ఫొటోలు పెట్టాడు. పొలాలకు నరదిష్టి తగలకుండా, జంతువులు పంటను నాశనం చేయకుండా రైతులు దిష్టిబొమ్మలు పెడతారు. ఈ రైతు మాత్రం నరదిష్టి తగలకుండా ఏకంగా కాజల్‌, తమన్నా హీరోయిన్ల ఫొటోలతో పెద్ద ఫ్లెక్సీలు పెట్టాడు. విషయమేమిటంటే.. చంద్రమౌళికి రోడ్డు పక్కనే ఉన్న రెండు ఎకరాల భూమిలో ఏటా పంట వేస్తున్నా, ఆశించిన ఫలితం రావడం లేదు. ఒక్కో సారి బాగా పెరిగి పూత, కాత బాగా వచ్చినా, చివర్లో వివిధ రకాల తెగులు సోకి నష్టపోయేవాడు. రోడ్డు పక్కనే ఉండడంతో నరదిష్టి తగులుతుందని భావించి, హీరోయిన్ల ఫ్లెక్సీ గురించి ఆలోచించాడు. ఈ సారి మిర్చి పంట కాత, పూత బాగా రాగా, దిగుబడి కూడా బాగా వస్తుందని రైతు సంబురపడుతున్నాడు.


VIDEOS

logo