గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 21, 2021 , 00:03:32

అంగన్‌వాడీలకు చేనేత చీరలు

అంగన్‌వాడీలకు చేనేత చీరలు

  • టీచర్లకు క్రీమ్‌ కలర్‌... ఆయాలకు బ్లూ కలర్‌ 
  • గతానికి భిన్నంగా డ్రెస్‌ కోడ్‌ 
  • ఒక్కో ఉద్యోగికి రెండు జతల యూనిఫామ్‌..
  • నూతన ఒరవడి వైపు సర్కారు అడుగులు 

అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతన ఒరవడికి సర్కారు అడుగులు వేస్తున్నది. అంగన్‌వాడీల్లో పని చేసే సిబ్బందికి యూనిఫామ్‌ మారనున్నది. ఇక నుంచి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చేనేత చీరలు రానున్నాయి. ఒక్కో ఉద్యోగికి రెండు జతల చొప్పున ఇవ్వనున్నారు. అంగన్‌వాడీ టీచర్‌కు క్రీమ్‌ కలర్‌ చీర, ఆయాలకు బ్లూకలర్‌ చీరను ఎంపిక చేశారు. జిల్లాలో 844 అంగన్‌వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్‌వాడీలు ఉండగా, మొత్తం 901 కేంద్రాల్లోని టీచర్లు, ఆయాలకు చేనేత చీరలు అందనున్నాయి.

- భువనగిరి జనవరి 20  

భువనగిరి, జనవరి 20 : ప్రతి చిన్నారికి పౌష్టికాహారం, ప్రాథమిక స్థాయిలోనే విద్యను అందించడంతోపాటు బాలింతలు, గర్భిణీలకు సమతుల్య ఆహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు నిర్దిష్టమైన యూనీఫాంను కేటాయించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ఉన్నతంగా ఉంచడంతోపాటు చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగానే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం ఈసారి చేనేత వస్ర్తాలను యూనీఫాం కింద అందించేందుకు చర్యలు చేపడుతుంది. అంగన్‌వాడీ టీచర్లకు క్రీమ్‌ కలర్‌తో కూడిన చేనేత చీరలను, ఆయాలకు బ్లూ కలర్‌ చేనేత చీరలను అందజేయనున్నది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతం చేయడంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలకు జీతాలను పెంచి, వారి సమస్యలను పరిష్కరించింది. ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తూ ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలను సైతం మరో మారు పెంచే ఆలోచనలు చేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర చర్యలతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో సిబ్బందికి ప్రయోజనం

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 844 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను కలుపుకుని మొత్తం 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో పని చేస్తున్న 901 టీచర్లకు, 844 మంది ఆయాలకు రెండు జతల చొప్పున చేనేత చీరలను అందించనున్నారు.

వేతనాలను పెంచే యోచనలో సర్కార్‌

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి గతంలోనే వేతనాలను భారీ స్థాయిలో పెంచి వారి జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపారు. అంగన్‌వాడీ టీచర్లకు గౌరవ వేతనం రూ.10వేలు, ఆయాలకు రూ.7,500 అందిస్తుండగా, ప్రభుత్వం మరో మారు గౌరవ వేతనాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతుంది. 

చేనేత చీరల పంపిణీకి చర్యలు 

అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం గతంలో కన్నా భిన్నంగా ఉండేందుకు చేనేత చీరలను యూనిఫాంగా అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో అంగన్‌వాడీ సిబ్బందికి పంపిణీ చేపడుతాం. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 

- కృష్ణవేణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి

ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం..

ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు చేనేత వస్ర్తాలను యూనిఫాంలుగా అందజేయడం సంతోషంగా ఉన్నది. ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బంది సంక్షేమానికి పాటుపడుతుందనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమీలేదు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బంది శ్రమను గుర్తించి వేతనాలను భారీ స్థాయిలో పెంచింది. ఈక్రమంలో రానున్న రోజుల్లో మరోమారు గౌరవ వేతనం పెంచాలని యోచించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సీఎం కేసీఆర్‌కు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు రుణపడి ఉంటారు.  

- బీరకాయల శైలజ, అంగన్‌వాడీ టీచర్ల సంఘం జిల్లా కార్యదర్శి


VIDEOS

logo