సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jan 20, 2021 , 00:07:21

భూ సమస్యలకు బంధ విముక్తి

భూ సమస్యలకు బంధ విముక్తి

  • అందుబాటులోకి జిల్లాస్థాయి ట్రిబ్యునల్‌
  • నేటి నుంచే పెండింగ్‌ కేసుల విచారణ
  • మొదటి రోజు 20 భూ సంబంధిత కేసులపై విచారణ
  • కేసుల పరిశీలన, నోటీసుల జారీకి నాలుగు ప్రత్యేక బృందాలు 

భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జిల్లా స్థాయి ట్రిబ్యునల్‌ అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి కలెక్టరేట్‌లో ట్రిబ్యునల్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. జిల్లా స్థాయి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెండు ఆర్డీవో కార్యాలయాలు, 17 తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన దస్ర్తాలను కలెక్టరేట్‌కు తెప్పించుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ట్రిబ్యునల్‌లో మొత్తం 1,455 కేసులను విచారించాల్సి ఉంది. అయితే మొదటి రోజు 20 కేసులను విచారించాలని నిర్ణయించి సంబంధీకులకు నోటీసులు కూడా జారీ చేశారు. కేసుల విచారణ వేగవంతం కోసం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన సూపరింటెండెండ్లతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

- యాదాద్రి భువనగిరి ప్రతినిధి, జనవరి 19 (నమస్తే తెలంగాణ) 

తెలంగాణ భూమి హక్కులు-పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020లోని సెక్షన్‌ 16, 17 ప్రకారం ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ఇటీవలనే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ట్రిబ్యునల్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సభ్యులుగా కొనసాగనున్నారు. ఇక నుంచి తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు, జాయింట్‌ కలెక్టర్ల చుట్టూ తిరిగే పని లేకుండా జిల్లాస్థాయిలోనే భూ సంబంధిత కేసులన్నీ ట్రిబ్యునల్‌లో పరిష్కారం కానున్నాయి. ప్రతి ఆర్డర్‌కూ సిస్టం జనరేటెడ్‌ నంబర్‌ ఇచ్చి ప్రతి కేసుకు సంబంధించిన వ్యవహారాలను కంప్యూటర్‌ రికార్డులో భద్రపర్చనున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 సెక్షన్‌ 13 ప్రకారం తమ వద్దకు వచ్చిన కేసులపై దర్యాప్తు చేపట్టే అధికారం స్పెషల్‌ ట్రిబ్యునల్‌కు ఉంటుంది. గరిష్ఠంగా నెల రోజుల్లో కేసులను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రత్యేక ట్రిబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలే అంతిమం కానున్నాయి. పరిష్కారం అయిన కేసుల రికార్డులను కలెక్టరేట్‌లో మాన్యువల్‌ ప్రకారం భద్రపరుస్తారు.

నేటి నుంచే ట్రిబ్యునల్‌లో కేసుల విచారణ..

కొత్తగా ఏర్పాటైన జిల్లాస్థాయి ట్రిబ్యునల్‌లో బుధవారం నుంచే కేసుల విచారణ ప్రారంభం కానున్నది. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం 1,455 కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో జేసీ కోర్టులో 270 కేసులు, ఆర్డీవో కోర్టులో 1,041, తహసీల్దార్‌ కోర్టులో 144 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ ఇకపై జిల్లాస్థాయి ట్రిబ్యునల్‌లో విచారించనుండటంతో భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయాలు, జిల్లాలోని 17 తహసీల్దార్‌ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన దస్ర్తాలను కలెక్టరేట్‌కు తెప్పించుకున్నారు. తొలి రోజు 20 కేసులను విచారించనుండగా, ఇప్పటికే ఆయా కేసులకు సంబంధించిన ఇరువర్గాలకు నోటీసులను జారీ చేశారు. ఒకటి రెండు వాయిదాల్లోనే కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కేసుల విచారణ వేగవంతంలో భాగంగా కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన సూపరింటెండెంట్లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లోని తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లతో కలిపి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసుల పురోగతితోపాటు నోటీసుల జారీ తదితర ప్రక్రియను ఈ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి.

ట్రిబ్యునల్‌లో విచారణ 

జరగాల్సిన కేసులు మొత్తం              :    1,455

జేసీ కోర్టులో పెండింగ్‌లో ఉన్నవి                   :      270

ఆర్డీవో కోర్టులో పెండింగ్‌లో ఉన్నవి                 :   1,041

తహసీల్దార్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్నవి          :      144

VIDEOS

logo