శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jan 20, 2021 , 00:07:21

బైక్‌ స్కీమ్‌ పేరిట కుచ్చుటోపీ

బైక్‌ స్కీమ్‌ పేరిట కుచ్చుటోపీ

  • ధనార్జనే ధ్యేయంగా లక్కీ స్కీమ్‌ సంస్థలు 
  • విలువైన బహుమతులంటూ ప్రచారం
  • వేల సంఖ్యలో సభ్యులు.. కోట్లల్లో దందా
  • మోత్కూరులో బోర్డు తిప్పేసిన కేటుగాళ్లు..
  • ఆందోళనకు దిగిన బాధితులు

మోత్కూరు, జనవరి 19 : సులువైన పద్ధతిలో కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా లక్కీ స్కీం పేరిట సంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కుచ్చుటోపీ పెడుతున్నారు. విజేతలకు విలువైన బహుమతులు , ఇతరులకు గిప్ట్‌లు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక్కోస్కీంలో వేల మందిని సభ్యులుగా చేర్చుకుంటూ, రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో ఈ ఎంటర్‌ప్రైజెస్‌ల మోసాలు వెలుగులోకి వస్తుండగా, తాజాగా మోత్కూరు మండల కేంద్రంలో బోర్డు తిప్పేసిన నిర్వాహకుల మోసాల నుంచి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. మోత్కూరు మండల కేంద్రంలో ఓ బైక్‌ షోరూమ్‌ నిర్వాహకులు బాలు, శ్రీధర్‌లు శ్రీ మహాలక్ష్మి మోటారు పేరిట లక్కీ స్కీంలను నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ఎంటర్‌ప్రైజెస్‌లను ప్రారంభించి గ్రామాల్లో ఏజెంట్ల రాము, ఉపేందర్‌లను నియమించుకున్నారు. ప్రతి నెలా 20 నుంచి 30 బహుమతులు ఉంటాయని వీటి తో పాటు కార్లు, గోల్డ్‌ కాయిన్లు, బైక్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లతో పాటు ఇతర గృహోపకరణాలను పొందవచ్చునంటూ సభ్యులను చేర్పించుకున్నారు. వీరు 2017 లో ప్రారంభించిన ఈ దందా  కోట్లలో సంపాదన ఉండటంతో ఒకటి కాదు రెండు స్కీంలను పెట్టి కొనసాగించారు. ఒక్కొక్క స్కీం వెలువరించిన బ్రోచర్లలో పేర్కొన్న సభ్యుల సంఖ్య కేవలం 499 మాత్రమే. కానీ అనధికారికంగా ఒక్కొక్క స్కీంలో 2వేల  నుంచి 3వేల వరకు సభ్యులను చేర్పించుకున్నారని తెలిసింది. ఒక్కో సభ్యుడి నుంచి నెలకు రూ.1500 చొప్పున 36 నెలల పాటు రూ.54వేలను వసూలు చేశారు. రూ.2వేల బోనస్‌తో కలిపి రూ.56 వేలను చెల్లిస్తామని, లేదా మీకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేసినట్లయితే మిగతా డబ్బు చెల్లిస్తే ఇస్తామని నమ్మబలికించారు. ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో సభ్యుడికి అదృష్టం కలిసి వస్తే బహుమతులు పొందిన తర్వాత మీరు డబ్బు చెల్లించాల్సిన పని లేదని, డ్రాలో అదృష్టం కలిసి రాక పోతే సభ్యులు చెల్లించిన మొత్తానికి బోనస్‌ కలిపి ఇస్తామని  తెల్పడంతో ఎక్కువ మంది స్కీంలలో చేరారు. స్కీం కాలపరిమితి పూర్తయ్యాక లక్కీ డ్రా పొందని సభ్యులు చెల్లించిన డబ్బులకు సరిపడా బహుమతి ఇవ్వకపోవడంతో బాధితులు పలుసార్లు నిర్వాహకులను నిలదీశారు. వాయిదాలు వేసుకుంటూ వచ్చి మంగళవారం బాలు,శ్రీధర్‌లు సభ్యులకు చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తామని చెప్పి రాలేదు. చివరకు ఇక్కడ షోరూమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఇతరులకు అప్పగించి శ్రీ మహాలక్ష్మి మోటారులక్కీ స్కీం బోర్డును తిప్పేశారు. దీంతో  బాధితులు చేసేదేమి లేక నల్లగొండ షోరూమ్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేయడంతో బాలు, శ్రీధర్‌కు మోత్కూరు షోరూమ్‌తో వారు నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి మోటార్‌ లక్కీ స్కీంలకు సంబంధం లేదని తెలిపారు. దీంతో బాధితులు ఆందోళనకు గురై షోరూమ్‌కు లాక్‌ చేసి ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని బుధవారం నిర్వాహకులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింప చేశారు.

తాపీ పని చేసి చెల్లించా

తాను రోజు తాపీ పని చేసి వచ్చిన డబ్బును జమ చేసి చెల్లించాను. 36 నెలల   క్రమం తప్ప కుండా రూ .1500 చొప్పున 54 వేలు చెల్లించిన. లక్కీ డ్రాలో బహుమతి రాక పోతే బోనస్‌తో కలిపి మొత్తం డబ్బు చెల్లిస్తానని నమ్మబలికారు. ఇంత మోసం జరుగుతదని అనుకోలేదు. రెక్కలు ముక్కలు చేసుకొని  సంపాదించిన డబ్బును ఇప్పించి న్యాయం చేయాలి. 

-దేవి నర్సయ్య, బాధితుడు, కొరటికల్‌ గ్రామం, ఆత్మకూరు(ఎం) మండలం

మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

స్కీమ్‌లో కలిసి వస్తోందని ప్రతి నెలా రూ.1500 చెల్లించాను. 36 నెలలు క్రమం తప్ప కుండా ఇచ్చినం. నిర్వాహకులు చెప్పిన మాటలకు మోసపోయినం. ఎన్నోసార్లు వాయిదాలు వేసి చెల్లిస్తామంటే నమ్మినం. చివరకు బోర్డు తిప్పేసి మోసం చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి.

 - బయ్యని గిరి ప్రసాద్‌, బాధితుడు, మోత్కూరు 


VIDEOS

logo