ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 20, 2021 , 00:07:19

ఆందోళన వద్దు..అందరికీ న్యాయం

ఆందోళన వద్దు..అందరికీ న్యాయం

  • ఇచ్చినమాట నిలుపుకొనే వ్యక్తి సీఎం కేసీఆర్‌ 
  • యాదాద్రి ఆలయ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర
  • మున్సిపాలిటీ పరిధిలోనే ఇండ్ల స్థలం
  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆలేరు, జవనరి19: ప్రపంచ చిత్రపటంలో నిలిచిపోయేలా యాదాద్రి అభివృద్ధి జరుగుతున్నది.. అభివృద్ధిలో భాగంగా స్థలం, ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి సీఎం కేసీఆర్‌ న్యాయం చేస్తారు.. ఎవరూ ఆందోళన చెందొద్దు.. అందరికీ పరిహారం ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో యాదాద్రి రింగురోడ్డు నిర్మాణంలో వైకుంఠద్వారం నుంచి పాత గోశాల వరకు ఇండ్లు, స్థలం కోల్పోతున్న 23 మంది నిర్వాసితులకు, వైకుంఠ ద్వారం నుంచి వైష్ణవ సత్రం వరకు స్థలం, ఇండ్లు కోల్పోతున్న ఐదుగురితో కలిపి మొత్తం 28 మంది లబ్ధిదారులకు రూ. 33,387,412 నష్ట పరిహా రం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాగా వారికి మంజూరైన పత్రాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థలాలు, ఇండ్లు కోల్పోయిన వారికి గజానికి రూ. 12,000 చొప్పున నగదు, ఇండ్ల స్థలం మంజూరు చేశారన్నారు. మున్సిపాలిటీ పరిధిలోనే ఇండ్లు కేటాయిస్తామన్నారు. వైటీడీఏ పరిధిలో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూ ములు ఇచ్చేందుకు 70 మంది బాధితులు సంతకాలు పెట్టారని, వారిని ఇబ్బంది పెట్టొద్దని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.  కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మవద్దని, యాదాద్రి ఆలయ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  గతంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్ని ఉద్యోగాలు కల్పించాడో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకుల సుధ, మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజిత, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కాటంరాజు, నాయకుడు మిట్ట వెంకటయ్య పాల్గొన్నారు. 

VIDEOS

logo