శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 19, 2021 , 00:03:11

సైదాపురం శాసనంపై డాక్యుమెంటరీ

సైదాపురం శాసనంపై డాక్యుమెంటరీ

వెయ్యేండ్ల నాటి శస్త్ర వైద్యుడు అగ్గలయ్య

సైదాపురంలో 11వ శతాబ్దం నాటి శాసనం

జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో లఘుచిత్రం

పాల్గొన్న భారతీయ వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జీపీ ప్రసాద్‌, రీసెర్చ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాకేత్‌ రామ్‌

ఆలేరు, జనవరి 18 : ప్రస్తుత కాలంలో సాధ్యం కాని శస్త్ర చికిత్సలు చాళుక్యుల కాలంలోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందుకు యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో 20 అడుగులు ఎత్తులో ఉన్న ఏకశిలా స్తంభంపై ఉన్న శాసనమే రుజువు చేస్తున్నది. ప్రపంచంలోనే ఇది అత్యంత అరుదైన శాసనమని, ఈ శాసనం ద్వారా 1034 ఏండ్ల కాలంలోనే అప్పటి ఆయుర్వేద వైద్యుడు, శస్త్ర చికిత్స నిపుణుడు అగ్గలయ్య ఎంతో మందికి శస్త్ర చికిత్సలు చేసి రోగాలను నయం చేశాడని భారతీయ వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్రం పరిశోధకులు జీపీ ప్రసాద్‌, రీసెర్చ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాకేత్‌ రామ్‌ చెబుతున్నారు. ఇక్కడి శాసనం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందిస్తున్నామన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో 20 అడుగుల ఎత్తులో ఉన్న ఏకశిలా స్తంభంపై జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీని చిత్రీకరించారు. సైదాపురంలో బయటపడ్డ ఆయుర్వేద వైద్యుడు అగ్గలయ్య శస్త్ర చికిత్స వైద్యుడికి సంబంధించిన శాసనాన్ని క్రీ.శ.1034 కాలంలో వేసినట్లు అంచనా వేస్తున్నామన్నారు. చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి 30 ఏండ్ల క్రితమే ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ తరహా శాసనం ఇటీవల బయటపడటం ఇదే మొదటిసారి అన్నారు. క్రీ.పూ. 500 కాలంలో కూడా శస్త్ర చికిత్సలు జరిగేవని తక్షశిలలో ఉన్న కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. వివిధ రకాల కారణాలతో అగ్గలయ్యకు సంబంధించిన శాసనం కాలక్రమేణా మరుగున పడిపోయింది. చాళుక్యుల కాలంలో జరిగిన యుద్ధాల్లో సైనికులకు దంతాలు, చేతులు, కాళ్లు కోల్పోయి తీవ్ర రక్తస్రావమయ్యేదని, అప్పటి అగ్గలయ్య ఇతర వైద్యులు బాధితులకు ఓ రకమైన మత్తు మందు ఇచ్చే వారని శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. వివిధ శస్త్ర చికిత్సలతో రక్తస్రావాన్ని కట్టడి చేయడంతోపాటు గాయాలు పెద్దవి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు శాసనాల్లో ఆనవాళ్లు ఉన్నాయన్నారు. గాయపడ్డ సైనికులకే కాకుండా రోగాలతో ఇబ్బందులు పడే ప్రజలకూ అగ్గలయ్య వైద్యాన్ని అందించేవారన్నారు. విద్యార్థులకు ఆయుర్వేద విద్యను కూడా బోధించేవాడని తెలుస్తుందన్నారు. శస్త్ర చికిత్సలో వినూత్న విధానాలను పాటించారని, పూర్వీకులు పాటించిన కొన్ని శస్త్ర చికిత్స విధానాలను ఆధునిక సైన్స్‌ కూడా పాటిస్తుందంటే అప్పటి విధానాలు ఎంతో నాణ్యమైనవిగా శాసనాల ద్వారా బోధపడుతుందన్నారు. 

2017లో సైదాపూర్‌ శాసనంపై సెమినార్‌..

రాష్ట్రీయ భారతీయ వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్రం ఆధ్వర్యంలో 2017లో హైదరాబాద్‌లో జరిగిన సెమినార్‌లో సైదాపూర్‌ శాసనం గురించి వివరించినట్లు కేంద్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జీపీ ప్రసాద్‌ తెలిపారు. జయసింహుడి ఆస్థానంలో అగ్రస్థానంలో ఉన్న అగ్గలయ్య పేరును తెలంగాణలో ఓ దవాఖానలో పెట్టాలన్న చర్చ కూడా జరిగిందన్నారు. శస్త్రశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన అగ్గలయ్యకు సముచిత గౌరవం కల్పించి పశ్చిమ చాళుక్య రాజైన జగదేకమల్ల  జయసింహుడు(1015-1042) వేయించిన శాసనమే సైదాపురం శాసనం అని చెప్పారు. క్రీ.శ. 1034లో వేయించిన ఈ శాసనం తెలుగు, కన్నడ భాషల్లో, మూడువైపులా 81 పంక్తుల్లో చెక్కి ఉందన్నారు. అగ్గలయ్య అనే జైన వైద్యుడి శస్త్ర చికిత్స నైపుణ్యాన్ని గుర్తించి వైద్యరత్నాకర అనే బిరుదును  అందజేస్తూ, చుట్టుపక్కల గ్రామాల వారికి స్వాధీనం చేసి 20 అడుగుల స్తంభంపై శాసనాన్ని చెక్కించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. ప్రపంచంలో ఉండే వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, వైద్య విద్యార్థులకు అగ్గలయ్య శస్త్ర వైద్యుడి గురించి తెలియజేయాలన్న సంకల్పంతో డాక్యుమెంటరీని తీస్తున్నామన్నారు. అగ్గలయ్య శాసనాన్ని పరిరక్షించి, మంచి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని స్థానిక సర్పంచ్‌ బీర్ల శంకరయ్య తెలుపడం అభినందనీయమన్నారు. 

VIDEOS

logo