శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 18, 2021 , 00:17:36

చేనేతకు చేయూత

చేనేతకు చేయూత

  • నూలు కొనుగోలుపై 40శాతం సబ్సిడీ కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా ఆర్థిక భరోసా
  • కార్మికుల ఖాతాల్లో ఇప్పటికే రూ.2.50 కోట్ల సబ్సిడీ జమ
  • జిల్లాలో చేనేత కుటుంబాలు 20వేలకు పైగానే!
  • ఇప్పటి వరకు జియోట్యాగింగ్‌లో ఉన్నవి 6000 వేల మగ్గాలే
  • నేటి నుంచి  ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్న చేనేత, జౌళిశాఖ

నూలు పోగునే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న చేనేత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ‘చేనేత మిత్ర’ పథకంతో ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. నూలు కొనుగోళ్లపై 40శాతం సబ్సిడీని కల్పిస్తూ ప్రతి నెలా చేనేత కార్మికుడు గౌరవ భృతి పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకంలో మగ్గంపై పనిచేసే నేతన్నతోపాటు మరో ఇద్దరు అనుబంధ కార్మికులకు సైతం లబ్ధిచేకూరుతుండగా.. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు జిల్లాలో రూ.2.50కోట్ల వరకు సబ్సిడీని ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో 20వేల వరకు చేనేత కార్మికులు ఉండగా.. ఇప్పటివరకు జియోట్యాగింగ్‌ చేసుకున్న మగ్గాలు జిల్లా వ్యాప్తంగా 6వేల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి కార్మికుడు ‘చేనేత మిత్ర’ పథకంలో లబ్ధిపొందేందుకు జిల్లా చేనేత జౌళిశాఖ సోమవారం నుంచి ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది.

-యాదాద్రి భువనగిరి  ప్రతినిధి, జనవరి 17 (నమస్తే తెలంగాణ)  

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, జనవరి 17(నమస్తే తెలంగాణ) : రంగురంగుల చీరలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకులు కరోనాతో మరింత ఛిద్రమయ్యాయి. మరమగ్గాల నుంచి విపరీతమైన పోటీ.. ముడి సరుకుల ధరలు ఆకాశానికి చేరి..మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. నేటికీ కూడా ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయూత, థ్రిఫ్టు, చేనేత మిత్ర వంటి పథకాలతో ఆదుకుంటోంది. 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం థ్రిఫ్టు పథకాన్ని ప్రారంభించగా, ప్రతి నెలా 8శాతం పొదుపు చేసిన కార్మికుడి ఖాతాలో 16శాతం వాటా ధనంగా ప్రభుత్వం మూడేండ్ల వ్యవధి ముగిశాక అందజేస్తోంది. గత ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘చేనేతకు చేయూత’ పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.29.44 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది. అలాగే పేరుకుపోయిన వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా కొనుగోలు చేసిన నూలుకు సంబంధించి రూ.2.50కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సైతం చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల ఖాతాల్లో జమ చేసింది. 

చేనేత మిత్ర ద్వారా ప్రతినెలా రూ.5వేల వరకు లబ్ధి..

చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40శాతం సబ్సిడీ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇందులో 35శాతం కార్మికులకు చెల్లిస్తుండగా, మిగతా 5శాతం సబ్సిడీని సంఘానికి గానీ, గ్రూపు లీడర్‌కు గానీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌డీసీ) సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పని చేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తోంది. జనగామ, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. 2018 జూన్‌లో ప్రారంభమైన ఈ పథకంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6వేల మంది రూ.2.50కోట్ల వరకు లబ్ధిపొందారు. సిల్క్‌కు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్‌పై 12సార్లు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఈ లెక్కన మగ్గం నేసే నేత నెలకు రూ.4-5వేలను, అనుబంధ కార్మికుడు రూ.1-2వేల వరకు లబ్ధి పొందవచ్చు.

కార్మికుల పాలిట వరం

చేనేత మిత్ర అనే పథకం దేశంలో ఎక్కడాలేదు. నిజంగా చేనేత కార్మికుల పాలిట ఈ పథకం వరంగా మారిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ కంటే కూడా చేనేత కార్మికులకు తెలంగాణలోనే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. అక్కడ ఏడాదికి రూ.24వేలు ఇస్తే తెలంగాణ సర్కారు చేనేత మిత్ర, థ్రిఫ్టు ద్వారా చేనేత కార్మికులకు రూ.50వేలకు పైగానే అందిస్తుంది. ఈ తరహా ప్రభుత్వం ఎక్కడా ఉండదు. చేనేత మిత్ర యారన్‌ సబ్సిడీ ద్వారా 4 కేజీల యారన్‌ కొంటే మాకు రూ.14వేలు అవుతుంది. మాకు సుమారుగా రూ.5 వేలు మా ఖాతాలో పడుతున్నాయి.

- గుండు ప్రవీణ్‌, చేనేత కార్మికుడు,  భూదాన్‌పోచంపల్లి

జిల్లాలో నేటి నుంచి ప్రత్యేక క్యాంపులు 

జిల్లాలో 20వేల వరకు చేనేత కుటుంబాలు మగ్గాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. చేనేత, జౌళీశాఖ అధికారుల సర్వే ప్రకారం.. జియో ట్యాగింగ్‌లో 5,350 మగ్గాలు ఉండగా, కొత్తగా ఇటీవలనే మరో 575 వరకు మగ్గాలు జియో ట్యాగింగ్‌ పరిధిలోకి రానున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం మందే ‘చేనేత మిత్ర’ పథకంలో లబ్ధి పొందుతున్నారు. వివిధ కారణాల వల్ల ఈ పథకంలో లబ్ధిదారులకు చేరలేకపోయారు. ఫలితంగా ప్రభుత్వం అందించే సాయాన్ని ఎన్నో కుటుంబాలు పొందలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా చేనేత, జౌళీ శాఖ జిల్లా వ్యాప్తంగా ఈనెల 18వ తేదీ నుంచి ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. జియోట్యాగ్‌ కలిగిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు సంబంధించిన ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్స్‌ జిరాక్స్‌ ప్రతులను క్యాంపుల్లో సేకరించి అక్కడికక్కడే ‘చేనేత మిత్ర’ పథకంలో లబ్ధిదారుడిగా నమోదు చేయనున్నారు. ఈనెల 18న భూదాన్‌పోచంపల్లిలో, 20న రామన్నపేటలో, 22న వలిగొండలో, 25న పుట్టపాకలో, 27న చౌటుప్పల్‌లో, 29న భువనగిరిలో, ఫిబ్రవరి 1న ఆలేరులో, 3న గౌరాయిపల్లిలో, 5న మోత్కూరులో క్యాంపులను నిర్వహించనున్నారు. 

చేనేత పథకాలతో ఎంతో మేలు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత పథకాలు కార్మికులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కార్మికులు ఆర్థిక ఇబ్బందులను నుంచి గట్టెక్కించేలా ఉన్న చేనేత మిత్ర ద్వారా మంచి లబ్ధి పొందుతున్నాం. ఒక వార్పు పేరు మీద మాకు యారన్‌ సబ్సిడీపై సుమారు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అందుతున్నాయి. నిజంగా మాకు ఎంతో ఉపయోగపడే పథకం ఇది. ఈ పథకాన్ని తయారు చేసిన సీఎం కేసీఆర్‌ సారుకు, మంత్రి కేటీఆర్‌ సారుకు రుణపడి ఉంటాం. ఇలాంటి పథకం రావడం వల్ల మాకు యారన్‌ కొనుగోలులో ఎంతో వెసులుబాటు కలిగింది. థ్రిఫ్టు పథకం వల్ల కూడా లబ్ధి కలుగుతుంది. అందుకే తెలంగాణ సర్కారు చేసిన మేలు మర్చిపోలేము. 

- మస్నం యాదమ్మ, చేనేత కార్మికురాలు, భూదాన్‌పోచంపల్లి


VIDEOS

logo