శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 17, 2021 , 01:02:47

టీకాస్త్రం

టీకాస్త్రం

 • తొలిరోజు 90 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి...
 • జిల్లాలో మూడు కేంద్రాలలో ప్రారంభం 
 • వ్యాక్సినేషన్‌లో పకడ్బందీగా ఏర్పాట్లు 
 • ఒక్కో కేంద్రంలో 30 మందికి  విజయవంతంగా పూర్తి 
 • ఎవరికీ సైడ్‌ఎఫెక్ట్స్‌ లేవు 
 • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
 • రేపటి నుంచి మరో 21 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌..

జిల్లాలో కరోనాపై తొలిసారిగా ప్రయోగించిన టీకాస్త్రం విజయవంతమైంది. వైద్య సిబ్బందికే తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో తొలిరోజు శనివారం 90 మంది టీకా తొలి ఫలితాన్ని అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌ విధానం ద్వారా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన వెంటనే జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. భువనగిరి ఏరియా దవాఖానలో, బీబీనగర్‌ మండలం కొండమడుగు పీహెచ్‌సీలో, చౌటుప్పల్‌ సివిల్‌ దవాఖానలో టీకా ప్రక్రియను చేపట్టగా.. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి టీకా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశీయ వ్యాక్సిన్‌తో భారత్‌ సత్తా ప్రపంచానికి తెలిసిందని, రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంలో శాస్త్రవేత్తల కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఈనెల 18 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మిగతా వారియర్స్‌కు మిగిలిన 21 కేంద్రాలలో టీకా వేయనున్నారు.

 • శనివారం మూడు కేంద్రాల్లో ప్రారంభమైన టీకా ప్రక్రియ
 • ఎవరికీ ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌  లేవు : కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
 • స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి టీకా ప్రారంభ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా అధికారులు
 • రేపటి నుంచి ఎంపిక చేసిన మరో 21 కేంద్రాల్లో మిగతా వారియర్స్‌కు టీకా

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, జనవరి 16(నమస్తే తెలంగాణ) :  జిల్లాలో కరోనాపై తొలిసారిగా ప్రయోగించిన టీకాస్త్రం విజయవంతమైంది. వైద్య సిబ్బందికే తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో తొలిరోజు 90 మంది టీకా తొలి ఫలితాన్ని అందుకున్నారు.  కరోనా మహమ్మారిపై పోరులో నెలలుగా ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన కరోనా టీకా ప్రక్రియ సవ్యంగా జరిగింది. భువనగిరి ఏరియా దవాఖానలో, బీబీనగర్‌ మండలం కొండమడుగు పీహెచ్‌సీలో, చౌటుప్పల్‌ సివిల్‌ దవాఖానలో టీకా ప్రక్రియను చేపట్టగా, ప్రతి కేంద్రంలోనూ టీకా ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వెరిఫికేషన్‌, వ్యాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులను ఏర్పాటు చేశారు. టీకా వికటిస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, వైద్యులు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో తొలిరోజు టీకా ప్రక్రియ సక్సెస్‌ అయ్యిందని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ప్రకటించారు. టీకా వేసుకున్న వారిలో ఎవరికీ ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వంటి సమస్యలు తలెత్తలేదన్నారు. ఈనెల 18 నుంచి మిగతా వారికి టీకాలు వేయనున్నారు. కొవిడ్‌ టీకా ప్రారంభమైన మూడు కేంద్రాల్లో మొదటి రోజు కేంద్రానికి 30 మంది చొప్పున మొత్తం 90 మందికి 0.5 ఎంఎల్‌ చొప్పున టీకా వేశారు. ఈ మూడు కేంద్రాల్లో ఇక నుంచి 50 మంది చొప్పున టీకాను వేయనున్నారు. అలాగే జిల్లాలో ఎంపిక చేసిన 21 కేంద్రాల్లో కేంద్రానికి 20 మంది చొప్పున టీకా వేయనున్నారు.

ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, అధికారులు

ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానం ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. జిల్లాలో ప్రారంభమైన టీకా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. భువనగిరి ఏరియా దవాఖానలో వ్యాక్సినేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సాంబశివరావు పాల్గొన్నారు. కొండమడుగు పీహెచ్‌సీలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, చౌటుప్పల్‌ సివిల్‌ దవాఖానలో అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, ఆర్డీవో సూరజ్‌ కుమార్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర అనితారామచంద్రన్‌ కొండమడుగు పీహెచ్‌సీ, చౌటుప్పల్‌ ఏరియా దవాఖానలను సందర్శించి టీకా ప్రక్రియను పరిశీలించారు. 

టీకా తొలి యోధులు వీరే..

భువనగిరి ఏరియా దవాఖానలో అర్బన్‌ దవాఖాన డాక్టర్‌ మురళి, నర్సు శోభారాణి, కొండమడుగు పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు సుజాత, ఫార్మసిస్ట్‌ వీరారెడ్డి, చౌటుప్పల్‌ సివిల్‌ దవాఖానలో సూపర్‌వైజర్‌ ధనాగౌడ్‌, పబ్లిక్‌ హెల్త్‌ నర్సు శశికళ తొలి టీకాలను వేసుకున్నారు. ఎంతో ఉత్సాహంతో వీరంతా టీకాలు వేసుకోగా, టీకా వేసుకున్న అనంతరం విజయ సంకేతాలను చూపారు.

కరోనా లేదు.. టీకా తీసుకున్నా

నాకు కరోనా సోకలేదు.. కానీ కొవిడ్‌ను జయించడానికే టీకా చేయించుకున్న. ప్రభుత్వం మొదటగా మాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని టీకా వేయించుకోవడానికి ముందుకు వచ్చా. కొవిడ్‌ టీకా రావడంతో ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరంలేదు. కొవిడ్‌ను జయించేందుకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి.

- సైదమ్మ, ఏఎన్‌ఎం, భువనగిరి


VIDEOS

logo