శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 17, 2021 , 01:02:47

సీఎం కేసీఆర్‌ సంకల్పం గొప్పది

సీఎం కేసీఆర్‌ సంకల్పం గొప్పది

  • ప్రపంచ చరిత్రలో నిలిచేలా యాదాద్రి 
  • ఆలయ పునర్నిర్మాణ పనులు భేష్‌
  • రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుండ చంద్రయ్య 

ఆలేరు, జనవరి 16: యాదాద్రి ఆలయ నిర్మాణం  చరిత్రలో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్‌ తీసుకున్న సంక ల్పం గొప్పదని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుండ చంద్రయ్య అభివర్ణించారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి సువర్ణపుష్పార్చన చేయగా, ఆలయ అర్చకులు, అధికారులు  స్వామివారి ఆశీర్వచనం,ప్రసాదం అందజేశారు. ఆలయ  పురవీధులు, ప్రధానాలయంతోపాటు మాఢవీధులు, ప్రాకారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆలయ స్థపతులు, ఇంజినీర్లను నిర్మాణంలోని పలువిషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌ ఎంతో శ్రద్ధతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేయిస్తున్నారన్నారు. స్థపతులు, వైటీడీఏ అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యుడు, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, ఏఈవోలు రమేశ్‌బాబు, శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

ఆన్‌లైన్‌ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి

ఆన్‌లైన్‌ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర  మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుండ చంద్రయ్య అన్నారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన కొండపై గల హరితహోటల్‌లో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  అందరికీ సమాన హక్కులు సంక్రమిస్తాయని, రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వ సంస్థలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి నడిపల్లి ఆనంద్‌రావు, సోషల్‌ ఆక్టివిస్ట్‌ ఇర్ఫాన్‌ మోహినుద్దీన్‌తో కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆసరా పెన్షన్‌, రేషన్‌ సరఫరా, భూ సంబంధిత సమస్యలు, రైతులకు ఫర్టిలైజర్స్‌, స్లాట్‌ బుకింగ్‌ ద్వారా ధరణి, ధాన్యం కొనుగోలు వంటి పథకాలు జిల్లాలో పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని హెచ్‌ఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లాడు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యలు, కుటుంబ తగాదాలు, అట్రాసిటీ కేసులు, సంఘ బహిష్కరణ, మహిళలు, మైనర్‌ బాలికల మిస్సింగ్‌ కేసులపై సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రెవెన్యూ శాఖ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ ద్వారా వృద్ధులను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని డీఏవో ఉపేందర్‌రెడ్డి తెలిపారు.  మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ పీఏస్‌ శ్రీనివాస్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ రాజేందర్‌, ఎంఈవో కృష్ణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo