బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 16, 2021 , 02:22:44

వ్యాక్సిన్‌కు వేళాయే..

వ్యాక్సిన్‌కు వేళాయే..

  • తొలి ఫలితం 90 మందికి
  • మొదటిరోజు మూడు సర్కారు దవాఖానల్లో టీకా వేసేందుకు ఏర్పాట్లు
  • జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కరోనా వారియర్స్‌ 5,780 మంది
  • జిల్లాకు చేరిన 116 వాయిల్స్‌
  • నేటి నుంచి ప్రారంభంకానున్న టీకా పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
  • భువనగిరి ఏరియా దవాఖాన కోల్డ్‌చైన్‌ పాయింట్‌ నుంచి టీకా కేంద్రాలకు శుక్రవారమే వ్యాక్సిన్‌ తరలింపు
  • జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

యాదాద్రి భువనగిరి, జనవరి 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో  నేటి నుంచి ప్రారంభమయ్యే కరోనా వ్యాక్సిన్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కాలంలో ఫ్రంట్‌ వారియర్స్‌గా సేవలందించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 5,780 మంది టీకా కోసం తమపేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. శనివారం వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే  జిల్లాలోని మూడు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భువనగిరికి చెందిన రాధాకృష్ణ ప్రైవేట్‌ దవాఖాన కూడా ఉంది. అయితే టీకా వేశాక ఏదైనా సమస్య ఉత్పన్నమైతే పర్యవేక్షించేందుకు ప్రైవేట్‌ దవాఖానలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్వల్పమార్పు చేసింది. తాజాగా ఎంపిక చేసిన కేంద్రాల ప్రకారం.. భువనగిరి ఏరియా దవాఖాన, బీబీనగర్‌ మండలంలోని కొండమడుగు పీహెచ్‌సీ, చౌటుప్పల్‌ మండలంలోని తంగేడువనం సీహెచ్‌సీ కేంద్రాల్లో తొలిరోజు కరోనా టీకా వేయనున్నారు. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున 90 మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 18 తర్వాత జిల్లాలో ఎంపిక చేసిన 24 కేంద్రాల్లోనూ టీకా వేయనున్నారు. మొదటి డోసు టీకా వేసుకున్నవారికి 45 రోజుల తర్వాత రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.


విడుతల వారీగా మిగతావారికి..

జిల్లాలో ఏరియా దవాఖానతోపాటు మూడు కమ్యూనిటీ సెంటర్లు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది 2,087 మంది ఉన్నారు. అలాగే అంగన్‌వాడీల్లో 1,749 మంది, ప్రైవేట్‌ దవాఖానల వైద్యులు, సిబ్బంది 1,944 మంది ఉన్నారు. వీరందరికీ దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో టీకా వేయనున్నారు. మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ వైద్య సిబ్బందికే టీకా వేస్తుండగా.. టీకా వేసిన తర్వాత ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు అవసరమైన కిట్లు, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు.

టీకా డోసుల నిల్వకు పటిష్ట ఏర్పాట్లు

టీకా డోసులు నిల్వ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. భువనగిరి ఏరియా దవాఖానలో కోల్డ్‌ చైన్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ నిల్వ కోసం 3 డీప్‌ ఫ్రీజర్లు, 7 కోల్డ్‌ బాక్స్‌లు, 150 వరకు వ్యాక్సిన్‌ క్యారియర్స్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లా, మున్సిపల్‌, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఎప్పటికప్పుడు టీకా ప్రక్రియను పర్యవేక్షించనుండగా.. ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు టీకా కేంద్రం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి కేంద్రంలో ఒక డాక్టర్‌, ఒక సూపర్‌వైజర్‌తోపాటు నలుగురు వ్యాక్సినేషన్‌ అధికారులు ఉంటారు. తొలిరోజు టీకా వేయించుకునే వారికి ఇప్పటికే వారి మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని పంపించారు. వ్యాక్సిన్‌ పొందేవారు ఖచ్చితంగా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కోసం ప్రత్యేకంగా మూడు గదులు ఏర్పాటు చేయగా టీకా వేసుకున్న వారిని అరగంట పాటు పర్యవేక్షించి తర్వాత ఇంటికి పంపిస్తారు. 

సర్వం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీకాను లాంఛనంగా ప్రారంభించిన వెంటనే శనివారం జిల్లాలో టీకా వేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సర్వం సిద్ధంగా ఉన్నాం. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఇంతకుముందే డ్రైరన్‌ నిర్వహించగా విజయవంతమైంది. అదే స్ఫూర్తితో టీకా ప్రక్రియను కూడా విజయవంతం చేస్తాం. టీకా వేసిన తర్వాత ఏమైనా సమస్యలు తలెత్తితే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

-అనితారామచంద్రన్‌,  కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా 


VIDEOS

logo