బుధవారం 27 జనవరి 2021
Yadadri - Jan 14, 2021 , 00:03:14

యాదాద్రిలో వైభవంగా గోదాదేవి కల్యాణం

యాదాద్రిలో వైభవంగా గోదాదేవి కల్యాణం

ఆలేరు, జనవరి 13 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం రాత్రి గోదాదేవి - శ్రీరంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. కల్యాణతంతును వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కమనీయంగా నిర్వహించారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి 30 రోజులపాటు తిరుప్పావై(స్త్రీవ్రతం) ఆచరించి చివరిరోజున అవతారమూర్తి శ్రీరంగనాథుడిని పరిణయమాడిన పర్వాలు పాంచారాత్రగమ శాస్త్రరీతిలో అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. గోదారంగనాయక స్వాములు సేవోత్సవాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ బాలాలయంలో ఊరేగింపు నిర్వహించారు. విశేషపూజ పర్వాలను ప్రధానార్చకులు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకబృందం నిర్వహించారు. ముందుగా ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహామూర్తి, రంగనాథుడు- గోదాదేవికి పట్టువస్ర్తాలను సమర్పించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నెలరోజులుగా గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని అర్చకులు నిర్వహించారు. నాలుగు రోజులుగా అమ్మవారికి నిరటోత్సవం చేపట్టిన అర్చకులు బుధవారం రాత్రి గోదాదేవిని, శ్రీరంగనాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సేవపై ఊరేగించారు. కల్యాణమూర్తులుగా తీర్చిదిద్ది శ్రీరంగనాథుడిని గోదాదేవితో కల్యాణ వేడుక జరిపించారు. ఈ కల్యాణ తంతును వీక్షించేందు కు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తరలివచ్చారు.  

నేడు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ..

కల్యాణ గోదాశ్రీరంగనాథస్వామి కల్యాణోత్స వం జరిగిన మరుసటి రోజు ఒడిబియ్యం సమర్పించడంతో 30 రోజులుగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు, దీంతో పాటు ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఐదు రోజులుగా చేపట్టిన నిరటోత్సవ వేడుకలు పరిసమాప్తమవుతాయి. గురువా రం మధ్యాహ్నం బాలాలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

హనుమదీశ్వర ఆలయంలో ..

భువనగిరి, జనవరి 13 : కంచి కామకోటి సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో గోదారంగనాథస్వామి కల్యాణాన్ని ఆలయ చైర్మన్‌ కుదా ప్రతిభ ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. 

శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంలో.. 

గుండాల, జనవరి 13: మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీగోదాదేవి రంగనాథస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా సర్పంచ్‌ చిందం వరలక్ష్మీప్రకాశ్‌ ఆధ్వర్యంలో పురోహితులు రమేశ్‌శర్మ, అనిల్‌శర్మ నిర్వహించారు. 

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో..

భూదాన్‌పోచంపల్లి, జనవరి 13 : మండలంలోని కనుముక్కుల గ్రామంలోని శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, పోచంపల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో గోదా రంగనాయక స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

వీరనారాయణ స్వామి ఆలయంలో.. 

ఆలేరు రూరల్‌, జనవరి 13 : మండలంలోని కొలనుపాక గ్రామంలోని వీరనారాయణ స్వామి ఆలయంలో శ్రీగోదాదేవి రంఘనాయకస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించి ప్రత్యేకపూజలు చేశారు.

చెన్నకేశవ, శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో..

రామన్నపేట, జనవరి 13 : మండలకేంద్రంలోని శ్రీ చెన్నకేశవ ఆలయం, సిరిపురం శ్రీరామచంద్ర స్వామి దేవాలయాల్లో గోదాదేవి రంగనాయకుల కల్యాణాన్ని ఆలయ చైర్మన్లు ఉపేందర్‌, స్వామి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు గోదాసు శిరీషాపృథ్వీరాజ్‌, అప్పం లక్ష్మినర్సు దంపతులు దేవతామూర్తులకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. 

శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. 

వలిగొండ, జనవరి 13: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి దంపతులు కల్యాణానికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్‌ఆర్‌ఐ బద్దం పుల్లారెడ్డి దంపతుల సౌజన్యంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

కోదండరామస్వామి ఆలయంలో..

అడ్డగూడూరు, జనవరి 13 : మండలకేంద్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గోదాదేవి-శ్రీ రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ఆలయ ధర్మకర్త ప్రవీణ్‌కుమార్‌రెడ్డి-శైలజారెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. కల్యాణంలో ఆలయ చైర్మన్‌ వెంకటేశం, పురోహితులు వెకటాచార్యులు, నర్సింహాచార్యులు, సీతారామ శర్మ పాల్గొన్నారు.


logo