గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 13, 2021 , 00:23:11

సంబురాల సంక్రాంతి

సంబురాల సంక్రాంతి

నేడు భోగి 

రేపు మకర సంక్రాంతి  

ఎల్లుండి కనుమ 

వేడుకకు ముస్తాబవుతున్న పల్లెలు 

ముంగిళ్లలో కనువిందు చేయనున్న రంగవల్లులు 

ఆలేరు/ఆలేరు టౌన్‌ జనవరి 12 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆనందోత్సాహాల నడుమ మూడు రోజుల పాటు కుటుంబసభ్యులు, బంధువులతో జరుపుకునే ముచ్చటైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం. మకర సంక్రాంతి తెలుగు రాష్ర్టాల సంస్కృతీసంప్రదాయలను ప్రతిబింబింపజేసే పర్వదినం. ఈ పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. 13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పండుగ నేపథ్యంలో తెల్లవారేలోపు ఇంటి ముందర కల్లాపు చల్లి వాకిళ్లలో రంగురంగుల ముగ్గులేసి, అందులో గొబ్బెమ్మలు, భోగి పండ్లు(నేరేడు పండ్లు) పెట్టి ముగ్గులను అలంకరిచడం ఈ పండుగ ప్రత్యేకం. భోగి నాడు చలి వణికిస్తున్నా లెక్క చేయకుండా తలంటు స్నానం చేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. సాయంత్రం వైభవంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది పక్కింటి వారిని పిలిచి ముత్తయిదువులకు కానుకలు ఇచ్చి కాళ్లను నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మహిళలందరూ పొంగలిని సామూహికంగా వండి సూర్య భగవానుడికి సమర్పిస్తారు. సంక్రాంతి పర్వదినాన మకర ధ్వజుడు, పుష్పబాణ సంధాన చతురుడు అయిన మన్మథుడిని మధుర శృంగారభావం చేరకూడదన్న సంకల్పంతో చెరుకు గడల్ని తమ ఇంటి గుమ్మాలకు అలంకరిస్తారు. తమిళ, తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను పొంగల్‌ అని కూడా అంటారు. 

చారిత్రక నేపథ్యం..

సంక్రాంతి పండుగ నాడు సూర్యుడు మకరరాశి అధిపతి. తన కుమారుడు అయిన శనీశ్వరుని ఇంట ప్రవేశిస్తాడు. పురాణా కథానుసారం ఇద్దరూ బద్ధ విరోధులే అయినా మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు. ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు. ఇలా ఈ పర్వదినం తండ్రీకొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. కపిల మహుముని ఆశ్రమంలో అరవై వేల మంది సాగర మహారాజు కుమారులకు సద్గుణాలు కలిగేందుకు భగీరథ మహారాజు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమి మీదకు రప్పించాడు. కపిల ముని ఆశ్రమమే నేటి గంగాసాగరి అని భక్తుల అపార నమ్మకం. సంక్రాంతి పర్వదినం నాడే భగీరథుడు ఆ అరవై వేల మందికి పరమ పవిత్ర గంగాజలంతో తర్పణలు అర్పించి వాళ్లను శాపవిముక్తుల్ని చేశాడని ప్రతీక. భగీరథుని కోరిక మేరకు పూర్వజుల శాపవిముక్తికి గంగాభవాని పాతాళ లోకానికి ప్రవేశించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వదినాన గంగానది బంగాళాఖాతంలో కలిసే సమయంలో లక్షలాది మంది భక్తులు గంగానదిలో తమ పితృదేవతలకు మొక్కులు చెల్లిస్తారు. మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణశక్తిని కలిగిన భీష్మాచార్యుడు యుద్ధ రంగంలో నేలకొరిగి తన భౌతిక శరీరం త్యజించడానిని సంకల్పించి అంపశయ్య మీద పవళించి చివరకు మకర సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేహత్యాగం చేశాడు. అందుకే మకర సంక్రాంతి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం. ఆది శంకరాచార్యుడు ఈరోజునే వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కల్యాణం చేసి వ్రతాన్ని ముగిస్తారు. 

రెండో రోజు మకర సంక్రాంతి.. 

నక్షత్రాలు ఇరవై ఏడు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుండగా మొత్తం 108 పాదాలుగా విభజింపబడ్డాయి. తిరిగి 108 పాదాల్ని 13 రాశులుగా విభజించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ కాలాన్ని ఆ రాశి పేరుతో వ్యవహరిస్తారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. హిందువులంతా పెద్దల నుంచి పిల్లల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆదరించే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పుణ్యదినం. ఈ సంక్రాంతిలో ‘సం’ అంటే మిక్కిలి అని, ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని, మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుకనే సంక్రాంతిగా పెద్దలు చెబుతుంటారు. ఈ పండుగ నాటికి ఇంటికి ధన, ధాన్య రాశులు వచ్చి చేరి ఉంటాయి. మకర సంక్రాంతి రోజు ఉదయం ప్రతి ఇంటి ముందు పిడకలతో పేర్చిన మంటల్లో కొత్త పాత్రలో పాలుపోసి పొంగించడం అనవాయితీ. ఆ పాటు ఎటువైపు పొంగితే ఆ వైపు నుంచి మంచి జరుగుతుందని అపార నమ్మకం. పుష్యలక్ష్మీతో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇళ్లు, వాకిళ్లు కొత్తశోభతో వెలుగుతుంటాయి. ఈ పండుగ వస్తుందంటే పిండి వంటకాలతో అందరి ఇండ్లూ ఘుమఘుమలాడుతుంటాయి.

మూడోరోజు కనుమ..

మకర సంక్రాంతి  మరుసటి రోజు అంటే ముచ్చటగా మూడో రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. దీనినే పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పల్లెల్లో పేద ప్రజలకు పశువులే గొప్ప సంపద. అవి ఆరోగ్యంగా ఉంటే పాడిరైతుకు ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా ఈ పండుగను భావిస్తారు. అందుకే కనుమ రోజు పల్లెల్లో రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుళ్లకు నైవేద్యం సమర్పించి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీనినే పాలి చల్లడం అంటారు. అంటే ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడపీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థించడం అని అర్థం. తమ చేతికి వచ్చిన పంటలను తామే కాకుండా పశువులు, పక్షులు పాలుపంచుకోవాలని దీని అంతరార్థం. ధాన్యంకంకులు ఇంటి గుమ్మాలకు కడుతారు. కనుమ రోజు గొబ్బెమ్మలపూజ, గంగిరెద్దుల హడావిడి, హరిదాసుల రాకడ, ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.

ప్రత్యేక వంటకాలు..

సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకు వచ్చేది వివిధ రకాల పిండివంటలు. ఈ పండుగకు చేసే సంప్రదాయ పిండివంటకాలు నోరూరిస్తాయి. ఇవి సంప్రదాయ వంటకాలే అయినప్పటికీ వీటిలో అనేక పోషక విలువలు ఉంటాయి. సంక్రాంతి పండుగ శీతాకాలంలో వచ్చే అతిపెద్ద పండుగ. శీతాకాలంలో తీసుకునే ఆహారం శరీరానికి అత్యధిక శక్తిని ఇస్తుందని, ఇది ఏడాది పాటు శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుందని ప్రజల అపార నమ్మకం. అందుకే కొత్త బియ్యం పిండితో చేసిన వివిధ రకాల పిండివంటలు ఈ పండుగలో కనిపిస్తాయి. సంక్రాంతి పండుగకు ముఖ్యంగా చేసే పిండి వంటల్లో సకినాలు, అరిసెలు, కొబ్బరిబూరెలు, గారెలు, నువ్వుల ఉండలు, జంతికలు, సున్నుండలు, చేగోడీలు తదితర పిండి వంటలు నెల రోజులకు సరిపడేలా ఇష్టంగా చేసుకుంటారు.

మొదటి రోజు భోగి..


భోగి పండుగ నాడు చిన్నపిల్లలు ఎక్కువగా సంబురాలు చేసుకుంటారు. తెల్లవారు జామునే లేచి భోగి మంటలు వేయడం ఈ రోజు ప్రత్యేకత. ‘భగ’ అనే పదం నుంచి ‘భోగి’ అనే మాట పుట్టిందని పెద్దలు చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం. దక్షణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు. కుప్పలు మార్పిడి అవగానే మిగిలిన పదార్థాలు, పాత వస్తువులను మంటగా వేయడంతో పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు అని భావిస్తారు.

సంస్కృతి వారధులు.. హరిదాసులు..

ధనుర్మాసం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో సందడి కనిపిస్తుంది. సంస్కృతీసంప్రదాయాలను నిలిపే హరిదాసులు ఇంటి ముందుకు వస్తారు. వారి తలపై ఉన్న అక్షయ పాత్రలో ధాన్యం, వస్త్రం, ధనం వేసి గ్రామీణులు వారిని గౌరవిస్తారు. కానీ నాటికాలంలో హరిదాసులకు ఆదరణ తగ్గింది. ధనుర్మాసంలో కీడు తొలగి, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ హరినామ సంకీర్తనలతో గ్రామాల్లో తిరిగేవారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేకత సంతరించుకుంటాయి. డూడూ బసవన్నలతో గంగిరెద్దుల ఆటగాళ్లు గ్రామ కూడల్లలో చేసే విన్యాసాలు పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటాయి.

VIDEOS

logo