భక్తజన సంద్రం

యాదాద్రిలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఉత్సవమూర్తులకు అభిషేకం
వైభవంగా శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజలు
శ్రీవారి ఖజానాకు రూ.19,47,666 ఆదాయం
ఆలేరు, జనవరి 10 : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆండాళ్ అమ్మ వారికి నిరటోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి శ్రీరంగనాథుడిని ప్రసన్నం చేసుకునే వేడుకలు చేపట్టారు. గోదాదేవికి మహిళా భక్తులు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. అమ్మవారు స్వామివారు కలిసి మంగళస్నానాన్ని ఆచరిస్తారని, అనంతరం కల్యాణం జరుగబోతున్న నేపథ్యంలో ఈ నిరటోత్సవాలు జరుపనున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి ఐదురోజుల పాటు నిరటోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవం 26వ రోజులో భాగంగా బాలాలయంలో వేకువజామునే ఆలయ అర్చకులు వేద మంత్రాలను పఠిస్తూ తిరుప్పావై పూజలు వైభవంగా చేపట్టారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించి భక్తులకు వినిపించారు.
తిరువీధుల్లో భక్తుల సందడి..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబసభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము 3గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన నారసింహహోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు
పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానాకు రూ.19,47,666 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.19,47,666 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.3,21,144, రూ.150 దర్శనంతో రూ.1,83,000, రూ.100 దర్శనంతో రూ.4,300, ప్రచారశాఖ ద్వారా రూ.9,625, క్యారి బ్యాగులతో రూ.36,830, వ్రతాల ద్వారా రూ. 1,03,500, కల్యాణకట్టతో రూ.38,720, శాశ్వత పూజల ద్వారా రూ.16,116, టోల్గేట్ ద్వారా రూ.2,490, అన్నదాన విరాళంతో రూ.22,659, సువర్ణ పుష్పార్చనతో రూ.1,49,912, వాహనపూజల ద్వారా రూ.28,200, యాదరుషి నిలయంతో రూ.74,810, పుష్కరిణి ద్వారా రూ.500, ఇతర విభాగాలతో రూ.55,240తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.19,47,666 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
స్వామి వారికి ప్రముఖుల పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేకస్వాగతం పలికి, స్వామివారి ఆశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ కుటుంబ సమేతంగా, ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిర ఎమ్మెల్యే గుండు తిప్పేస్వామి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి, స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
తాజావార్తలు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం