'లెక్క' తప్పింది పదవి ఊడింది

ఎన్నికల ఖర్చు చూపని అభ్యర్థులపై అనర్హత వేటు
జిల్లాలో 1150 మందిపై ఎన్నికల కమిషన్ కొరడా
వేటు పడిన వారిలో ఐదుగురు ఉపసర్పంచ్లు, 62మంది వార్డు సభ్యులు
ఓడిన సర్పంచ్ అభ్యర్థులు 117, ఓడిన వార్డు మెంబర్ అభ్యర్థులు 1033
మరో మూడేండ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఉత్తర్వులు
భువనగిరి అర్బన్ , జనవరి 9 : ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని వారిపై వేటు పడింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టిన ఖర్చును ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల లెక్కలు చూపించడంలో అలసత్వం ప్రదర్శించారు. దీంతో జిల్లాలో గెలిచిన 67 మంది వార్డు సభ్యులు, ఓడిపోయిన 117 మంది సర్పం చ్ అభ్యర్థులు, 1033 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు మూడేండ్లు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హత కోల్పోయారు. గెలిచిన వారి లో ఐదుగురు ఉపసర్పంచ్ హోదా కోల్పోగా..తాత్కాలిక ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు.
ఇదీలెక్కా....
2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఐదు వేల జనాభాకు ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50వేలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాలని ఎన్నిక సంఘం నిబంధనలు విధించింది. ఐదువేలలోపు ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.30వేలు దాటకుండా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీ చేసిన అభ్యర్థులు గెలిచినా లేదా ఓడినా ఎన్నికల్లో చేసిన ఖర్చు లెక్కలను పక్కాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
జిల్లాలో 1150 మందిపై అనర్హత
2019 జనవరిలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలుపొందారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చును ఎన్నికల అధికారికి చూపకపోవడంతో 1150 మంది వార్డు మెంబర్ అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వారు 117 మంది, వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిన అభ్యర్థులు 1033 మంది ఖర్చు వివరాలు సమర్పించలేదు. ఇందులో ఎన్నికల ఖర్చు చూపకుండా ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న ఐదుగురు ఉప సర్పంచ్‌లు, 62 మంది వార్డు సభ్యులు పదవులు కోల్పోయారు. ఇందులో భాగంగా ఎన్నికల ఖర్చు చూపని వార్డు మెంబర్లు బీబీనగర్ మండలంలోని రావిపహాడ్‌తండా ఉప సర్పంచ్ బానోతు గమ్లిపై అనర్హత వేటు వేయడంతో జాయింట్ చెక్ పవర్‌ను 4వ వార్డు సభ్యుడు శంకర్‌నాయక్‌కు ఇచ్చారు. అదే మండలంలోని యెర్రబేటితండా ఉప సర్పంచ్ నరేందర్ ఎన్నికల ఖర్చు చూపకపోవడంతో అనర్హత వేటుకు గురికాగా ఆయన స్థానంలో 4వ వార్డు సభ్యుడు రవీందర్‌నాయక్‌ను తాత్కాలిక ఉపసర్పంచ్‌గా నియమించారు. జియాపల్లెలో 8 మంది, జియాపల్లెతండాలో ఆరుగురు వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చు చూపకపోవడంతో పదవులు కోల్పోయారు. గెలిచిన మొత్తం వార్డు సభ్యులు ఖర్చు చూపని వారిలో బీబీనగర్ మండలంలో 43 మంది, అడ్డగూడూరు మండలంలో14 మంది, మోత్కూరు మండలంలో ఆరుగురు, సంస్థాన్‌నారాయణపురం మండలంలో నలుగురు పదవులు కోల్పోయారు. ఖాళీ అయిన వార్డు సభ్యుల స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.
బీబీనగర్‌లో 241 మంది ..
బీబీనగర్, జనవరి 9 : 2019 జనవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అవగాహన రాహిత్యమో.. లేక పోటీలో ఓడిపోయాము మాకెందుకులే అనే నిర్లక్ష్యమో.. గెలిచామన్న ధీమానో.. మొత్తానికి ఎన్నికల ఖర్చు చూపని 241 మందిపై ఈసీ అనర్హత వేటు వేసింది. దీంతో పాటు వారిని మూడేండ్ల పాటు పోటీకి అనర్హులుగా ప్రకటించింది. ఇందులో పోటీ చేసి వార్డు సభ్యులుగా గెలిచిన వారు 43 మంది ఉండగా, ఓడిపోయిన వారు ఏకంగా 198 మంది ఉన్నారు. జియాపల్లితండా, జియాపల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు మినహా మిగిలిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మొత్తం అనర్హతకు గురయ్యారు. త్వరలోనే ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో చేసేదేమి లేక గెలిచిన వార్డు సభ్యులు కోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల అధికారికి పూర్తి నివేదిక అందజేశాం
జిల్లాలో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన లెక్కలు చూపని గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులకు సంబంధించి పూర్తి నివేదికను ఎన్నికల అధికారికి అందజేశాం. అనర్హత వేటు పడిన వారిలో ఉపసర్పంచ్ హోదాలో ఉండగా వారి స్థానంలో తాత్కాలిక వార్డు సభ్యులను ఎన్నికచేశాం. అనర్హత వేటు పడటంతో పదవులు కోల్పోయిన వారి స్థానంలో నూతన అభ్యర్థుల ఎన్నికను ఈసీ ఇచ్చిన సమయానికి ఎన్నికలు నిర్వహిస్తాం.
-సాయిబాబా, డీపీవో యాదాద్రి భువనగిరి
ఎన్నికల ఖర్చు చూపనందుకే అనర్హత వేటు
2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు చూపని కారణంగానే మండలంలో 241 మంది అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు వేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముందుగానే అవగాహన కల్పించడం జరిగింది. కానీ వారు ఖర్చు వివరాలు సమర్పించకపోవడంతో అనర్హతకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు వారు మరో మూడేండ్లు ఎన్నికల్లో పోటీ చేయటానికి ఈసీ అనర్హులుగా ప్రకటించింది.
-శ్రీవాణి, ఎంపీడీవో, బీబీనగర్ మండలం
అభివృద్ధికి ఆటంకం కలుగకుండా చూడాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చు చూపని కారణంగా మా గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్‌తో సహా మిగిలిన వార్డు సభ్యులందరూ అనర్హతకు గురయ్యారు. ప్రస్తుతం నేనొక్కడినే ఉన్నా. పాలకవర్గం సభ్యులకు తగు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పటి వరకు అభివృద్ధికి ఆటంకం కలుగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
-వరిగంటి కుమార్, జియాపల్లి సర్పంచ్
తాజావార్తలు
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్‌జెండర్స్ కానిస్టేబుల్స్‌గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు