బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 08, 2021 , 01:38:04

నేడే డ్రైరన్‌

నేడే డ్రైరన్‌

  • కరోనా నమూనా వ్యాక్సినేషన్‌కు సర్వంసిద్ధం 
  • ఏర్పాట్లను పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
  • 24 కేంద్రాలు.. ప్రతి కేంద్రంలో 25 మందికి.. 
  • మొదటి విడుతలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి..

భువనగిరి, జనవరి 7 : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి  తీసుకురానున్నది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. ఈక్రమంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తిస్థాయిలో చేపట్టారు. డ్రై వ్యాక్సిన్‌ పంపిణీలో ఏమైన లోపాలు, ఎదురయ్యే సమస్యలను ముందస్తుగా గుర్తించేందుకు జిల్లా, మండల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సమావేశమై సమగ్రంగా చర్చించి చర్యలు చేపట్టనున్నారు. వ్యాక్సినేషన్‌ చేపట్టే విషయంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, డీఎంహెచ్‌వో సాంబశివరావు ఎప్పటికప్పుడు సమీక్షలు చేపడుతూ అందుకు అనుగుణంగా సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు... 

జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డ్రై రన్‌ నిర్వహించేందుకు  అధికారులు సమగ్ర చర్యలు చేపట్టారు. జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4563 మందిని మొదటి విడుతలో డ్రైరన్‌ చేపట్టనున్నారు.

ఒక్కో కేంద్రంలో 25 మందికి...

ప్రతి కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగా మొదటి విడుతలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే అన్ని రకాల సిబ్బందికి డ్రైరన్‌లో అవకాశం కల్పించనున్నారు. ఇందుకు అనుగుణంగా సంబంధిత సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణను సైతం అందించారు. 

వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. 

డ్రైరన్‌లో భాగంగా చేపట్టనున్న వ్యాక్సినేషన్‌కు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అందులో భాగంగా మూడు గదులను కేటాయించి అందులో మొదటి గదిలో వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారిని కూర్చోబెడుతారు. రెండో గదిలో వ్యాక్సినేషన్‌ వేస్తారు. అదేవిధంగా మూడో గదిలో వ్యాక్సినేషన్‌ వేసిన వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.

సమస్యలు అధిగమించేందుకే డ్రైరన్‌.. 

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా చేపడుతున్న డ్రైరన్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నాం. డ్రైరన్‌తో తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకునేందుకు ఎంతగానో వీలుంటుంది. డ్రైరన్‌లో లోటుపాట్లను గుర్తించి అసలైన టీకా వచ్చే నాటికి ఇబ్బందులను అధిగమించేందుకు డ్రైరన్‌ ఎంతగానో దోహదపడనున్నది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి విడుత డ్రైరన్‌ను చేపట్టనున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డ్రైరన్‌ ప్రారంభం కానున్నది.

- డాక్టర్‌ సాంబశివరావు, జిల్లా వైద్యాధికారి

డ్రైరన్‌పై అవగాహన

 మండల వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌పై మండల వైద్యాధికారి నరేశ్‌ ప్రజాప్రతినిధులకు గురువారం ప్రభుత్వ దవాఖాన ఆవరణలో  అవగాహన సమావేశం నిర్వహించారు. రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు గుండిగ జోసఫ్‌  పాల్గొన్నారు. 

VIDEOS

logo