బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 08, 2021 , 01:38:04

ఎవర్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌

ఎవర్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌

  • నిరంతరంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ 
  • గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులో మొక్కలు నాటిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, నటుడు అజయ్‌ దేవగన్‌ 
  • ప్రతీ ‘వేడుక’కు మొక్కలు నాటాలని పిలుపు 

ఏ ఛాలెంజ్‌ అయినా మూడు నుంచి నాలుగు నెలలే ఉం టుంది... కానీ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిరంతరంగా కొనసాగుతున్నదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండు మల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు ఆవరణలో ఆయన బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌తో కలిసి గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్‌ ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి పుట్టినరోజు, వివాహ వేడుకలకు తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులో ఒకే రోజు 5వేల మొక్కలు నాటడం విశేషం.

చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి 7 : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిరంతరం కొనసాగుతున్నదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని దండుమల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులో ఎన్‌వై ఫౌండేషన్‌ ప్రతినిధి, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌తో కలిసి ఆయన పార్కు ఆవరణంలో మొక్కలు నాటారు. ఇతర రాష్ర్టాల్లో కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను తీసుకెళ్లి హరితహారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఛాలెంజ్‌ అయినా 3-4 నెలలు మాత్రమే ఉంటుందని, కానీ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మూడేండ్ల నుంచి నిరంతరం కొనసాగుతున్నదన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పుట్టినరోజు, వివాహ వేడుకలకు మొక్కలు నాటాలని ఆయన సూచించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సహా సెలబ్రిటీలు, వ్యాపార, రాజకీయ నేతలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారని ఆయన గుర్తు చేశారు. వారంతా మొక్కలు నాటుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతున్నారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకుపోతానని బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ చెప్పడం సంతోషకరమన్నారు. 

ఈరోజు గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కులో 5వేల మొక్కలు నాటామని పరిశ్రమల ఫెడరేషన్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి ఆయనకు వివరించారు. ఈ పార్కు గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కుగా మార్చుతామని హామీ ఇచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని కూడా చెప్పారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు, కళాకారులు వారికి తమ కళానృత్యాలతో ఘనస్వాగతం పలికారు. పురోహితులు ప్రత్యేక పూజలతో ఆహ్వానించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, మాజీ మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo