శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jan 08, 2021 , 01:38:00

పండుగకు ప్రత్యేకం

పండుగకు ప్రత్యేకం

  • రద్దీకనుగుణంగా రవాణా సౌకర్యం
  • రేపటి నుంచి 19 వరకు అదనపు బస్సులు
  • ‘సంక్రాంతి’కి స్వగ్రామానికి ప్రజలు 
  • అధిక రద్దీ రూట్లపై ఆర్టీసీ దృష్టి 
  • విజయవాడకూ ‘రాజధాని బస్సు’
  • ప్రయాణికులను చేరవేయడానికి ప్రత్యేక బృందాలు 

ఆలేరు, జనవరి 7 : సంక్రాంతి పండుగకు టీఎస్‌ ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూర్లకు వస్తుంటారు. వీరి ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతోపాటు అదనంగా మరిన్నీ బస్సులను నడుపనున్నారు. నూతన సంవత్సరంలో మొదటి అతిపెద్ద పండుగ కావడంతో ఈసారి ఆదాయం పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. లాక్‌డౌన్‌లో ఆర్టీసీ సంస్థకు వచ్చిన నష్టాన్ని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు.

అదనపు బస్సులు ఇలా...

జిల్లాలో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. యాదగిరిగుట్ట డిపో నుంచి ఈ నెల 9వ తేదీన 21 బస్సులు, 10న 23, 11న 50, 12న 40, 13న 42, 14వ తేదీన 10 బస్సులను అదనంగా నడుపనున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రూట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే పండుగ ముగిసిన తరువాత ఈనెల 15, 16, 17, 18, 19వ తేదీల్లో తిరుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. 

అధిక రద్దీ రూట్లపై దృష్టి..

జంట నగరాలైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి భువనగిరి మీదుగా తిరుమలగిరి, మోత్కూరు, నల్లగొండ, సూర్యాపేట ఉన్నాయి. హరితరాళ్ల, మామిడ్లమడవ, లక్ష్మీదేవికాల్వ, దత్తప్పగూడెం, పాలడుగుతోపాటు సూర్యాపేటలో అధిక రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు పూర్తి చేశారు. ప్రస్తుతం పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులన్నీ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌తోపాటు నగరాలలోని పలు ప్రాంతాల వరకు వెళ్తాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌తోపాటు పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులతోపాటు హన్మకొండ, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌కు తరలించడానికి ప్రస్తుతం నడిచే బస్సులను కొనసాగించనున్నారు. 30 నిమిషాలకు ఓ బస్సు వెళ్లేలా ఏర్పాటు చేశారు. 

విజయవాడకు ప్రత్యేక బస్సు...

సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన రాజధాని బస్సును విజయవాడకు నడుపనున్నారు. యాదగిరిగుట్ట డిపో నుంచి హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 

ప్రత్యేక బృందాలు..

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో దాదాపుగా 5 నెలల పాటు ఆర్టీసీ బస్సులు నడువలేదు. అనంతరం కరోనాతో ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో సంస్థకు ఎంతో నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితి నుంచి లాభాల వైపు నడిపించడానికి అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ తయారు చేసింది. ఈనెల 15వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికులను చేరవేయడానికి ప్రత్యేక టీంలు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరిలో పని చేయబోతున్నారు. వీటిని డీఎం పర్యవేక్షిస్తారు. డిపోల వారీగా బస్సుల నిలుపుదల.. ప్రయాణికులను ఎప్పటికప్పుడు గమ్యస్థానం చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జగద్గిరిగుట్ట, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ఉండి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటారు. 

VIDEOS

logo