బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 07, 2021 , 00:26:33

టార్గెట్‌.. 60 రోజులు

టార్గెట్‌.. 60 రోజులు

ఇప్పటికే భూ ప్రక్షాళనలో 98 శాతం భూ సమస్యలు పరిష్కారం

పార్ట్‌-బీలోని 36,731ఖాతాల భూ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ఆదేశం

15,506 సాదాబైనామా దరఖాస్తులకు సైతం సత్వర పరిష్కారం

జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్న రెవెన్యూ అధికారులు

60 రోజుల్లో వందశాతం మేర పరిష్కారం కానున్న భూ వివాదాలు

త్వరలోనే సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ

తెల్లకాగితంపై కొనుగోలు చేసిన భూములు, రిజిస్ట్రేషన్‌ చేయకుండా క్రయవిక్రయాలు చేసిన భూములు, నోటరీ తదితర పత్రాలతో ఒప్పందం చేసుకున్న భూములకు సంబంధించి భూ యాజమాన్య హక్కులను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం గత యేడాది చివరలో అవకాశం కల్పించింది. సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గత యేడాది అక్టోబర్‌ 31వరకు అవకాశం కల్పించింది. అయితే సాంకేతిక సమస్యలు, ఇతరత్రా అడ్డంకుల నేపథ్యంలో గడువును నవంబర్‌ 10 వరకు పెంచింది. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 15,506 దరఖాస్తులు రాగా.. తదుపరి చర్యల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం అధికారయంత్రాంగం ఎదురుచూస్తోంది. అయితే సాదాబైనాబా దరఖాస్తుల సత్వర పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ఆయా భూములను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

యాదాద్రి భువనగిరి  ప్రతినిధి, జనవరి 6(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఉన్న భూ వివాద సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గత యేడాది చేపట్టిన భూ ప్రక్షాళన సందర్భంగా ఎన్నో భూ సమస్యలు వెలుగులోకి రాగా.. 98 శాతానికిపైగా భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,73,265 ఖాతాలను పరిశీలించి వివాదంలేని వాటికి సంబంధించి 2,25,061 ఖాతాలకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం మంజూరు చేసింది. డిజిటల్‌ సంతకాలు అయినప్పటికీ వివిధ కారణాలతో ఆగిపోయిన 873 ఖాతాలకు సంబంధించి పాసుపుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. వివాదాస్పద, అభ్యంతరకర భూములుగా పరిగణించిన భూములను ప్రభుత్వం పార్ట్‌-బీ కేటగిరీలో చేర్చింది. వాటికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా పక్కనబెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూములు, భూ విస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, ఫారెస్టు- రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న వివాదం.. వంటి నేపథ్యంలో వివాదాస్పదంగా ఉన్న ఆయా భూములను పార్ట్‌-బీ కేటగిరీలో నమోదు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 36,731 ఖాతాలను పార్ట్‌-బీలో చేర్చారు. వీటి పరిష్కారంలో జాప్యం నెలకొనడంతో పాసుపుస్తకాలు రాక రైతాంగం ఇబ్బందులు పడుతోంది. దీంతో ఓ వైపు ధరణిలో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెస్తూనే.. ప్రభుత్వం పార్ట్‌-బీ భూముల వివాదాలను సైతం సాధ్యమైనంత త్వరగా కొలిక్కితేవాలని నిర్ణయించింది. కలెక్టర్‌ వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం 60 రోజుల గడువు విధించింది.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లో పార్ట్‌-బీలోని భూముల వివాదాలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తాం. సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిశీలించి క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి కార్యాచరణను మొదలుపెడతాం. ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం పెండింగ్‌, నోటిఫికేషన్‌, కోర్టు కేసులకు సంబంధించి మాత్రమే ఆప్షన్లు వచ్చాయి. పూర్తిస్థాయిలో ఆప్షన్లు వచ్చిన వెంటనే వందశాతం భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.

- అనితారామచంద్రన్‌, కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి

VIDEOS

logo