గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 07, 2021 , 00:26:31

ఆపతిలో సోపతి

ఆపతిలో సోపతి

మహిళలకు బాసటగా నిలుస్తున్న సఖీ

        ఆపదలో ఉన్న మహి ళలకు సఖీ కేంద్రం అండగా నిలుస్త్తోంది. కుటుంబ కలహాలు, ప్రేమించి మోసపోయిన యువతులు, లైంగిక వేధింపులతో సతమతమవుతూ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న అతివలు, తండ్రి, భర్త వేధింపులు ఇలా.. అనేక సమస్యలతో సతమతమవుతున్న బాధితులకు సఖీ బాసటగా నిలుస్తూ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 2019 నవంబర్‌ 4వ తేదీన ప్రారంభమైన సఖీ కేంద్రం 210 కేసుల్లో పురోగతి సాధించి బాధిత మహిళల పక్షాన నిలిచింది. సఖీ బృందాన్ని కలిసిన ‘నమస్తే తెలంగాణ’కు మానవీయతను చూపిన ఎన్నో ఘటనలు  బయటపడ్డాయి. 

2019 నవంబర్‌లో ప్రారంభం..

బాలికలు, మహిళలు, వృద్ధులు ఎదుర్కొంటున్న వేధింపులు - హింసల నుంచి రక్షణ కల్పించడానికి.. వారికి సంబంధించిన అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అందించే ముఖ్య ఉద్దేశంతో 2019 నవంబర్‌ 4వ తేదీన సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 15 మంది సిబ్బంది పని చేస్తుంటారు. 

ఆలేరు, జవనరి 6: ఎవరికీ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొస్తున్న సఖీ కేంద్రం బాధితులకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్య పరంగా వైద్య సేవలను అందిస్తూ అవసరం అనుకుంటే పోలీస్‌ కేసులు పెట్టాలనుకున్నప్పుడు పోలీసులతో మాట్లాడి వారికి జరిగిన అన్యాయంపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదీ కుదరకపోతే కోర్టు ద్వారా న్యాయ సేవలు అందించేందుకు కూడా లీగల్‌ కోఆర్డినేటర్లను సఖీ కేంద్రంలోనే అందుబాటులో ఉంచారు. తాత్కాలికంగా వారికి వసతిని కల్పించడానికి కూడా ఈ కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. బాధితులు శాశ్వతంగా మేము ఈ కేంద్రంలోనే ఉంటామన్నప్పుడు వారిని చదివించడానికి అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో ఉండే కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సఖీ సెంటర్‌లో అందించే సేవలు..

భార్యాభర్తల గొడవలు, మహిళలపై అత్యాచారాలు, పెండ్లి చేసుకుంటామని మోసం చేసిన కేసులు, విద్యార్థినుల ఈవ్‌ టీజింగ్‌, యాసిడ్‌ దాడి, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు సంబంధించిన కేసుల్లో బాధిత మహిళలకు అండగా ఉండేందుకు సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రత్యేక అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాల్‌ చేస్తే క్షణాల్లో ఆ గ్రామానికి వెళ్లేందుకు 181 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కార్యాలయంలో 08685-295181 నంబర్‌తో ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌, వాట్సాప్‌ నంబర్‌ 9666684181ను కూడా అందుబాటులో ఉంచారు. సఖీ కేంద్రంలో ఉన్న 15 మంది సిబ్బందిలో కౌన్సిలర్లు, కేస్‌ వర్కర్లు, మల్టీపర్పస్‌ వర్కర్లు, పారా మెడికల్‌ వర్కర్స్‌, లీగల్‌ కోఆర్డినేటర్లు, ఐటీ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ఏ సమయంలో కాల్‌ చేసినా ఆ గ్రామానికి వెళ్లి వారికి సఖీ సెంటర్‌లో సౌకర్యాలు కల్పించి న్యాయం చేసేలా చూస్తున్నారు.

అమ్మకానికి ఆడశిశువు...

పాపం.. నేను అమ్ముడుపోతున్నానని ఆ పసిపాపకు తెలియదు. ఆ పాపను ఇతరులకు అమ్మేందుకు పాప అమ్మమ్మ ప్రయత్నించగా, సఖీ బృందం అడ్డుకుని బాసటగా నిలిచింది. భువనగిరికి చెందిన ఓ కుటుంబం మేడ్చల్‌ జిల్లా నేరేడుమెట్‌లో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నది. వారి కూతురు ఇంటర్మీడియట్‌ చదివి మధ్యలో మానేసింది. ఆ అమ్మాయికి అక్కడ దగ్గరలో ఉన్న ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడం, శారీరకంగా దగ్గరవ్వడంతో గర్భం దాల్చింది. పెండ్లి చేసుకుందామని అబ్బాయితో చెప్పగా నిరాకరించాడు. దీంతో అమ్మాయి నేరేడుమెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అబ్బాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గర్భానికి, నాకు ఎలాంటి సంబంధంలేదని ఆ అబ్బాయి తేల్చి చెప్పాడు. దీంతో అమ్మాయి డీఎన్‌ఏ పరీక్షను చేసేందుకు సిద్ధమని తెలిపింది. 2019 సెప్టెంబర్‌ నెలలో అమ్మాయికి 9 నెలలు నిండటంతో సొంతూరైన భువనగిరి జిల్లా దవాఖానలో అడ్మిట్‌ కాగా, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఆడపిల్లను అమ్మాలని అమ్మాయికి తెలియకుండానే వాళ్ల అమ్మమ్మ, ఇతర కుటుంబసభ్యులు భువనగిరి చుట్టు పక్కల గల తండావాసులకు రూ.50వేలకు అమ్మకానికి పెట్టారు. అప్పటికే నేరేడుమెట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై ఉండటంతో అక్కడి సఖీ కేంద్రం, పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి భువనగిరి దవాఖానకు రాగానే ఆడపిల్లను అమ్మకానికి పెట్టారని తెలిసింది. దీంతో వారు స్థానిక సఖీ కేంద్రానికి సమాచారం అందించగా, సఖీ బృందం షీటీమ్‌ సహాయంతో పసిపాపను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిని, పసిపాపకు నాలుగు రోజులపాటు ఆశ్రయమిచ్చారు. నల్లగొండలోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆదేశాలతో ప్రస్తుతం పసిపాపను నల్లగొండ ప్రభుత్వ శిశు గృహంలో ఉంచి సంరక్షిస్తున్నారు. 

నూతన జీవితం ప్రారంభించాలని..

పడుపువృత్తిని మానేసి నూతన జీవితాన్ని ప్రారంభించాలని ఓ అమ్మాయి ఓ యువకుడిని వివాహం చేసుకున్నది. ఆ యువకుడు ఆమెను గర్భవతిని చేసి మోసం చేశాడు. వెంటనే సఖీ కేంద్రానికి వెళ్లగా, అమ్మాయికి అండగా నిలిచారు. యాదగిరిగుట్ట పట్టణంలో పడుపు వృత్తికి చెందిన 30 ఏండ్ల వయస్సు గల యువతి విజయవాడకు చెందిన టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడిని వివాహం చేసుకున్నది. ఆ యువతి 8 నెలల గర్భవతి కాగా, 2019 ఆగస్టులో యువతిని పెండ్లి చేసుకున్న యువకుడు ఇంటికి వెళ్దామని భువనగిరి బస్టాండ్‌కు తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. భువనగిరి నుంచి యువతి తిరిగి విజయవాడకు అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. చేతిలో చిల్లిగవ్వలేదని బస్సెక్కిన అమ్మాయి బతిమిలాడటంతో కండక్టర్‌ ఖమ్మం వద్ద దింపేశాడు. పోలీసుల సహాయంతో ఖమ్మం సఖీ కేంద్రాన్ని సంప్రదించగా, అక్కడి సిబ్బంది భువనగిరి సఖీ కేంద్రానికి తరలించారు. స్పందించిన సఖీ బృందం చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు అనాథాశ్రమానికి ఆమెను తరలించి ఆశ్రయమిచ్చారు. గర్భవతి కావడంతో వైద్య సేవలు అందించారు. ప్రసవం సమయంలో నల్లగొండ ఏరియా దవాఖానకు తరలించారు. అమ్మాయికి సీజేరియన్‌ చేయగా, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మాయిని, పుట్టిన పాపను నల్లగొండ స్వదారి హోంలో ఆశ్రయం కల్పించారు. అమ్మాయికి ఏదైనా ఉపాధి కల్పించి నూతన జీవితాన్ని ఇవ్వాలని సఖీ భావిస్తుంది. ఇందుకు కావాల్సిన ప్రక్రియను ప్రారంభించింది. త్వరలో ఏదో ఒక ఉద్యోగాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విడిపోయిన ప్రేమ జంటను కలిపారు..

ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానన్న ఓ అమ్మాయికి సఖీ కేంద్రం అండగా నిలిచింది. పెండ్లికి నిరాకరిస్తున్న అబ్బాయితో మాట్లాడి ఇద్దరిని ఒకటి చేశారు. వలిగొండ మండల పరిధికి చెందిన 27 ఏండ్ల ఓ అమ్మాయి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ మేడిపల్లి వద్ద అద్దె ఇంట్లో ఉండేది. ఆమె బంధువైన ఓ అబ్బాయిని ప్రేమించింది. పెండ్లి చేసుకుందామని భావించిన వారు శారీరంగా ఒకటి కావడంతో గర్భం దాల్చింది. కుటుంబసభ్యులు భయంతో ఆ అబ్బాయి పెండ్లికి నిరాకరించాడు. దీంతో అమ్మాయి భువనగిరి సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో 12 రోజుల పాటు అమ్మాయికి ఆశ్రయం ఇచ్చి, సఖీ టీం ఆ అబ్బాయిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పెద్దవాళ్లకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ అమ్మాయిని చేసుకోను అని మూర్ఖంగా వ్యవహరించాడు. పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు, ఆ గ్రామానికి చెందిన పలువురి వద్ద అబ్బాయికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాదాపుగా 12 రోజుల పాటు కౌన్సెలింగ్‌ ఇవ్వగా, చివరికి అబ్బాయిలో మార్పు రావడంతో ఇద్దరికి వివాహం జరిగింది. వాళ్లు సంతోషంగా కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప పుట్టింది. 

కాపాడాల్సిన తండ్రే కామంతో...!

కాపాడాల్సిన తండ్రే కామంతో చూశాడు. ఎవరికి చెప్పను నా బాధ అంటూ.. చనిపోవడానికి సిద్ధపడ్డ ఓ బాలికకు సఖీ అక్కున చేర్చుకుని అండగా నిలిచింది. 2019 డిసెంబర్‌లో జరిగిన ఘటన ఇది. రామన్నపేట మండల పరిధిలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులకు మధ్య విభేదాలు రావడంతో 15ఏండ్ల బాలిక తన తల్లి వద్దే ఉంటూ వస్తుంది. తన అక్క ప్రేమ వివాహం విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నది. దీంతో దూరంగా ఉంటున్న అమ్మానాన్నలు ఒక్కటయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తండ్రి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు బయటకు చెబితే చంపేస్తాను.. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు... అంటూ బాలికను భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ బాలిక తల్లికి కూడా చెప్పలేదు. తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక బాలిక చెయ్యిని కోసుకు ని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తల్లి హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించి చికిత్స చేయించింది. కోలుకున్న తరువాత బాలిక విషయం తల్లికి చెప్పింది. దీంతో వారు 181 కాల్‌ చేసి సఖీ కేంద్రాన్ని సంప్రదించారు. బాలికకు 8 రోజులపాటు ఆశ్రయం కల్పించి, తండ్రిపై కేసు నమోదు చేశారు. ముందస్తు జాగ్రత్తగా బాలికను ఓ హోంలో చేర్పించి సంరక్షిస్తున్నారు. 

అందుబాటులో ఉంటాం..

బాధితులు ఏ సమయంలోనైనా సఖీ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. సిబ్బంది కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181కు సంప్రదించవచ్చు. లేకుంటే నేరుగా జిల్లా కేంద్రంలో సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌కు వచ్చి సమస్యలు తెలియజేయవచ్చు. ఏడాదిగా జిల్లాలో ఎన్నో సమస్యలను అధిగమించి బాధితుల పక్షాన నిలిచాం. నేరుగా వారి ఇంటికి వెళ్లి సమస్యలను విని వారికి కావాల్సిన సౌకర్యాలను అందజేస్తున్నాం. మహిళలు తమకు ఉన్న సమస్యలను భయపడకుండా తమ దృష్టికి తీసుకురావాలి.

- వనజా, సఖీ కేంద్రం కార్యాలయ నిర్వాహకురాలు


VIDEOS

logo