ముల్కలపల్లి మాణిక్యాలు

- తెలంగాణ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2020లో జిల్లాకు మొదటిస్థానం
- సత్తా చాటిన ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు
- ‘ఆర్గానిక్ జీరో వేస్ట్ శానిటరీ ప్యాడ్' రూపకల్పన
- రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ ఫినాలేకు 25 ప్రదర్శనలు
- ప్రశంసించిన మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి
- రూ.75వేల పారితోషికాన్ని అందుకున్న విద్యార్థినులు
మారుమూల ప్రాంతం... చదువుతున్నది ప్రభుత్వ పాఠశాలలోనే.. కానీ.. తమ సృజనాత్మకతకు మరెవరూ సాటిరారని నిరూపించారు ఆ విద్యార్థినులు. చక్కటి ఆలోచనలతో రూపొందించిన వారి ప్రదర్శనకు రాష్ట్ర స్థాయిలో అందలం దక్కింది. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ వేదికగా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యూనిసెఫ్‌లు నిర్వహించిన ‘ఇన్నోవేషన్ చాలెంజ్-2020’లో తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రదర్శనల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన 25 నమూనాలను ప్రదర్శించగా.. ఈ పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ‘ఆర్గానిక్ జీరో వేస్ట్ శానిటరీ ప్యాడ్' ప్రాజెక్టు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విద్యార్థినులు రూ.75వేల పారితోషికాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోనే జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ముల్కలపల్లి పాఠశాల విద్యార్థినుల టాలెంట్‌ను జిల్లా ప్రజానీకం వేన్నోళ్లా పొగుడుతోంది.
- యాదాద్రి భువనగిరి, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్నోవేషన్ సెల్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యూనిసెఫ్‌లు దేశవ్యాప్తంగా ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్-2020’ను నిర్వహించాలని సంకల్పించాయి. ప్రప్రథమంగా తెలంగాణలోనే నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో గత యేడాది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులను ఎంపిక చేసి గత యేడాది సెప్టెంబర్‌లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఉద్దేశం గురించి జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సృజన, ఆవిష్కరణలకు సంబంధించి విద్యార్థుల ఆలోచనలను సేకరించి ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 7,093 బృందాలు పాల్గొనగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 860 బృందాలు తమ ఆలోచనలను పంపాయి. వీటన్నింటిని పరిశీలించిన నిపుణుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమమైన 25 పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపిక చేశారు. అందులో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి ఒక్కొక్కటి ఎంపికయ్యాయి. వీరంతా సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు ‘ఆర్గానిక్ జీరో వేస్ట్ శానిటరీ ప్యాడ్' తయారీపై రూపొందించిన ప్రాజెక్టు మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విద్యార్థినులు షీల్డ్‌తో పాటు రూ.75వేల పారితోషికాన్ని అందుకున్నారు.
సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్..
స్త్రీలు రుతుచక్ర సమయంలో మార్కెట్లలో దొరికే పలు రకాల ప్యాడ్స్‌ను వాడుతుండటంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌లేని అందుబాటులో దొరికే ఔషధ మొక్కల నుంచి తీసిన రసాయనాలతో ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన డి.అనిత, బి.స్వాతి, డి.శైలజ విద్యార్థినుల బృందం స్త్రీ రక్ష ప్యాడ్లను రూపొందించి గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శించింది. ఈ ప్రదర్శన మంత్రి కేటీఆర్‌తో పాటు నిపుణుల బృందాన్ని సైతం ఆకట్టుకున్నది. మన చుట్టూ పరిసరాల్లో లభ్యమయ్యే గుర్రపుడెక్క ఆకు, వేప, మెంతులు, సబ్జా గింజలు, పసుపులాంటి యాంటీ-ఇన్ఫెక్షన్ పదార్థాలను ఉపయోగించి సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేశారు. పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పి.కల్యాణి గైడ్‌గా వ్యవహరించి ప్రాజెక్టు రూపకల్పనకు సహకరించారు. డీఈవో చైతన్యజైనీ, అడ్డగూడూరు జడ్పీహెచ్ఎస్ ఎన్సీఎస్ఈ కోఆర్డినేటర్ సీహెచ్ భరణి, సెక్టార్ ఆఫీసర్ అండాలు, జిల్లా సైన్స్ అధికారి పి.రాజశేఖర్ మొదటినుంచీ విద్యార్థినులకు తమవంతు ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు.
ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా
ప్రస్తుత మార్కెట్లో అనేక రకాల ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ విద్యార్థులతో సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్యాడ్స్ తయారు చేయించాలని లక్ష్యంగా ఎంచుకున్నా. చెత్త సేకరించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నూతన పద్ధతులు కనుగొంటున్నారు. చెత్త సేకరణ చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఆలోచనతో విద్యార్థినులతో ఆర్గానిక్-జీరోవేస్ట్-శానిటరీ ప్యాడ్స్ తయారు చేయించా. ఈ ఎగ్జిబిట్‌ను తయారు చేయడంలో మొదటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా. కానీ రాష్ట్రస్థాయిలో మా ఎగ్జిబిట్‌కు ప్రథమ బహుమతి దక్కుతుందని ఊహించలేదు. రాష్ట్రస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉంది.
- పి.కల్యాణి, జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు
చాలా సంతోషంగా ఉంది
మా పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఆర్గానిక్-జీరోవేస్ట్-స్త్రీరక్ష ప్యాడ్స్ ఎగ్జిబిట్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పద్ధతితో తయారు చేసిన ప్యాడ్ చెత్త సేకరణ చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి నుంచి ఈ ప్రాజెక్టును ప్రణాళిక పద్ధతిలో రూపొందించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థినులు తయారు చేసిన ప్యాడ్‌తో చెత్త సేకరణ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
- ధీరావత్ అనిత, 9వ తరగతి, ముల్కలపల్లి
మొదటి బహుమతి రావడం మర్చిపోలేను
రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి రావడం ఎప్పటికీ మర్చిపోలేను. మా ఉపాధ్యాయురాలి శిక్షణ, మేము చేసిన కృషి ఫలితంగానే రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి రావడం ఊహించలేకపోతున్నా. ఈ అవార్డు రావటానికి కృషి చేసిన ఉపాధ్యాయురాలికి కృతజ్ఞతలు.
- శైలజ, పదోతరగతి
విద్యార్థుల ప్రతిభకు హ్యాట్సాఫ్
దేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చడం సంతోషం. విద్యార్థి దశలో కొంత ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నదానికి ముల్కలపల్లి పాఠశాల విద్యార్థినులే నిదర్శనం. ఛాలెంజ్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభకనబర్చాలని భావించి టీచర్లు, విద్యార్థులను ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకున్నా. నా సంకల్పం నెరవేరింది. గ్రాండ్ ఫినాలేలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థినులకు, గైడ్ టీచర్‌కు హ్యాట్సాఫ్.
- చైతన్యజైనీ, జిల్లా విద్యాశాఖాధికారి
అవార్డు వస్తదని ఊహించలేదు
మేము తయారు చేసిన ఎగ్జిబిట్ రాష్ట్రస్థాయికి ఎంపికై అవార్డు వస్తదని ఊహించలేదు. ఎగ్జిబిట్ రాష్ట్రస్థాయి అవార్డు పొందడం మా ఉపాధ్యాయురాలు కృషి, పట్టుదల ఎంతో ఉంది. అవార్డు రావడం ఎప్పటికీ మర్చిపోలేను.
- స్వాతి, పదో తరగతి
తాజావార్తలు
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30