ట్రెక్కింగ్ ప్యారడైజ్ భువనగిరి ఖిల్లా

పర్వతారోహకుల కల సాకారానికి శిక్షణ
భువనగిరిలో రాక్ ైక్లెంబింగ్ స్కూల్
వివిధ రాష్ర్టాలు, పలు దేశాల నుంచి వస్తున్న ఔత్సాహికులు
ఎవరెస్టు అధిరోహకులు పూర్ణ, ఆనంద్లకూ ఇక్కడే శిక్షణ
ఇక్కడ శిక్షణ పొంది ప్రపంచ శిఖరాలను అధిరోహించిన 400మందికి పైగా సాహసికులు
యాదాద్రి భువనగిరి, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనేది పర్వతారోహకుల జీవిత లక్ష్యం. అలాంటి వారికి గమ్యస్థానంగా నిలుస్తోంది భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్. బేసిక్స్ కూడా తెలియని వారు మొదలు ఇంటర్నేషనల్ ైక్లెంబర్స్ వరకు అన్ని స్థాయిల వారు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్న తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంటున్నారు. 2013 సంవత్సరం సెప్టెంబర్ 16న ఈ రాక్ ైక్లెంబింగ్ స్కూల్ ఏర్పాటు కాగా, తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టాన్సెండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎనిమిదేండ్ల నుంచి 70 ఏండ్ల వయసు గల వారు సైతం ఇక్కడి శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలు, కళాశాలలకు చెందిన విద్యార్థి బృందాలు తరుచుగా ఇక్కడకు వచ్చి మెళకువలు నేర్చుకుంటున్నాయి.
వీరిలో కొంతమంది విద్యార్థులు...
లడఖ్‌లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించి త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. ఇక్కడ ప్రాథమిక స్థాయిలో ఇచ్చే శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారిని మెరుగైన శిక్షణ కోసం హిమాలయాలు, డార్జిలింగ్ వంటి ప్రాంతాలకు ట్రాన్సెండ్ సంస్థ పంపుతోంది. ఇక్కడకు వచ్చే వారికి శిక్షణ ఇచ్చేందుకు 22 మంది శిక్షకులు అందుబాటులో ఉండగా, సౌత్ ఇండియాలోనే నంబర్‌వన్ శిక్షణా కేంద్రంగా భువనగిరి రాక్ ైక్లెంబింగ్ శిక్షణా కేంద్రం ప్రత్యేక గుర్తింపును పొందింది.
పర్వతారోహణ శిక్షణకు
అనువైన ప్రాంతం..
ఏకశిలగా ఏర్పడిన రాయి అందుబాటులో ఉండటం వల్ల పర్వతారోహణ శిక్షణకు భువనగిరి కోట అనువుగా ఉంటోంది. ఇది భూ మట్టానికి 600 అడుగుల ఎత్తులో ఉన్నది. పర్వతారోహణకు దేశంలో ఏ ప్రాంతంలో లేని అనుకూలతలు భువనగిరి దుర్గానికి ఉన్నాయి. కోటను వివిధ కోణాల్లో చుట్టివచ్చే సౌలభ్యం ఉన్నది. 90డిగ్రీల కోణంతోపాటు పలు కోణాల్లో కొండను ఎక్కి దిగిరావచ్చని నిపుణులు చెబుతున్నారు. కోట పరిసర ప్రాంతాల్లో శిక్షణకు అనువుగా సెడిమెంటరీ రాక్(ఆక్షేపణ శిలలు), మెటా మార్పిక్(రూపాంతర ప్రాప్తశిల), ఇగ్నోస్(జ్వలించే రాళ్లు) రాక్లు ఉన్నట్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారు తెలియజేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని పర్వతాలకు ఉన్న అన్ని గుణాలు ఇక్కడ కన్పించడంతో శిలలకు సంబంధించి ప్రాథమిక స్థాయిలోనే పూర్తి అవగాహన కలుగుతోందని శిక్షణకు వచ్చేవారు చెబుతున్నారు. అలాగే పర్వతారోహణ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు ఇక్కడ కూడా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలపై కూడా అవగాహన ఉంటోందని వారంటున్నారు. ఇప్పటికే పెద్దపెద్ద పర్వతాలను అధిరోహించిన వారు సైతం భువనగిరి కోటపై ైక్లెంబింగ్ చేయలేక ఇబ్బందులుపడ్డ సందర్భాలున్నాయని, శిక్షణ పూర్తయ్యాక ఏ పర్వతాన్నైనా అధిరోహిస్తామన్న ధీమా వారిలో కలుగుతోందని ట్రైనర్లు పేర్కొంటున్నారు.
8వేల మందికిపైగా శిక్షణ..
ఎవరెస్టును అధిరోహించాలన్నది ఎంతో మంది కల. అలాంటి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భువనగిరి కోటను సాహసికులు ఎంచుకుంటున్నారు. ట్రైనీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్లో శిక్షణ కోసం ఇక్కడకు వస్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడి రాక్ ైక్లెంబింగ్ స్కూల్ ప్రాథమిక శిక్షణను ఇస్తోంది. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి శిక్షణ కోసం ఇక్కడకు వస్తున్నారు. అమెరికా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఇజ్రాయిల్ తదితర దేశాల నుంచి కొందరు ఇక్కడకు వచ్చి శిక్షణ పొంది వెళ్లారని శిక్షణా కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 8వేల మందికి పైగా శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ఎవరెస్టు పర్వతాన్ని 90 మంది, సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారోను 260 మంది, యూరప్‌లోని ఎలబ్రస్ పర్వతాన్ని 59 మంది, అమెరికాలోని మౌంట్ అకాన్యాగువాను 12 మంది, ఆస్ట్రేలియాలోని మౌంట్ కొసియెస్కో పర్వతాన్ని 20 మంది, ఉత్తర అమెరికాలోని మౌంట్ బినాలి పర్వతాన్ని ఇద్దరు వ్యక్తులు అధిరోహించినట్లు ఇక్కడి శిక్షకులు చెబుతున్నారు. మాలోవత్ పూర్ణ, ఆనంద్‌లు సైతం ప్రాథమిక స్థాయిలో ఇందులోనే తర్ఫీదు పొందగా, వారి స్ఫూర్తితోనే గురుకుల, వసతి గృహాల విద్యార్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది లడఖ్‌లోని ఎత్తైన శిఖరాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.
‘ఖిల్లా’కు దేశ వ్యాప్త గుర్తింపు..
క్రీ.శ.1123లో రాజా త్రిభువనమళ్లావిక్రమాదిత్యుని కాలంలో ఈ కోటను నిర్మించారు. కల్యాణి చాళుక్యుల వంశకాలంలో భువనగిరి ఖిల్లా కోట గోడ నిర్మాణాలు ప్రసిద్ధిగాంచాయి. వందల సంవత్సరాలుగా భువనగిరి కోట చారిత్రకంగా తన ఆస్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తోంది. కొండపైన ఉన్న చారిత్రక సంపదను తిలకించేందుకు భువనగిరి కోటను సందర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి సందర్శకులు పెద్దఎత్తున వస్తుంటారు. ఇక్కడే రాక్ ైక్లెంబింగ్ శిక్షణను ఇస్తున్నారు. ఎవరెస్టుతోపాటు ఆయా దేశాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించడానికి ప్రత్యేక శిక్షణను ఇక్కడి కొండపై ఇస్తున్నారు. దీంతో పర్వతారోహకుల తాకిడి సైతం భువనగిరి కోటకు పెరిగింది. అటు చారిత్రకంగా.. ఇటు రాక్ ైక్లెంబింగ్ శిక్షణతో భువనగిరి కోటకు దేశ, విదేశాల్లోనూ గుర్తింపు వచ్చింది.
మూడు లెవెల్స్‌లో పూర్తిస్థాయి శిక్షణ..
ఎవరెస్టు వంటి శిఖరాల పర్వతారోహణకు కావాల్సిన ట్రెక్కింగ్, హైకింగ్, ైక్లెంబింగ్ వంటి అంశాలపై భువనగిరి కోట వద్ద పూర్తిస్థాయిలో శిక్షణ కొనసాగుతోంది. సాహస యాత్రలంటే ఆసక్తి చూపేవారికి మొదట మూడు రోజులు.. ఆ తర్వాత ఐదు రోజుల కోర్సులను 3 లెవెల్స్‌లో అమలు చేస్తున్నారు. ఇందుకు ఐదు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు ైక్లెంబింగ్ టెస్టులు, ఒకటి గేర్ టెస్ట్, మరోటి నార్త్ టెస్ట్‌లు చేపడుతారు. ఐదు రోజుల శిక్షణలో తొలిరోజు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. పర్వతాలు ఎక్కే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవానే అంశంపై అవగాహన కల్పిస్తారు. రెండోరోజు కింది నుంచి కొండ పైకి ఎలా చేరుకోవాలో నేర్పిస్తారు. అలాంటి సమయంలో శిలల రూపాలపై అవగాహన కల్పించి.. ఎలాంటి శిల అధిరోహించడానికి అవకాశం ఉంటుంది.. ఎలాంటి కొండలకు దూరంగా ఉండాలన్న అంశాలపై తర్ఫీదు ఇస్తారు. అలా శిలల తత్వం తెలియజేస్తూనే.. ఎక్కే క్రమంలో శరీర సాధన ఎలా ఉండాలన్న విషయాలను వివరిస్తారు. సెంటర్‌ఫర్ గ్రావిటీ ఎలా అమలు చేయాలన్న దానిపై సూచనలు ఇస్తారు. ఇక మూడోరోజు 300 అడుగుల ఎత్తులో ర్యాప్లింగ్ అంటే పై నుంచి కిందకు దిగడంపై శిక్షణ ఉంటుంది. 45, 65, 75 డిగ్రీల కోణంలోని రాతి కొండలను ఎలా ఎక్కాలో సాంకేతిక శిక్షణ అందిస్తారు. నాలుగోరోజు సైతం మూడో రోజు జరిగే కార్యక్రమాల్ని తిరిగి చేయిస్తారు. ఇక చివరి రోజు అయిన ఐదవ రోజు 90 డిగ్రీల కోణంలో కొండపైకి ఏ విధంగా ఎక్కి దిగాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ ఐదు రోజులు కోర్సు పూర్తి కాగానే రాత పరీక్ష నిర్వహించి 75 శాతం మార్కులు వచ్చిన వారికి ధ్రువపత్రం అందజేస్తున్నారు. ఇందుకుగాను నామ మాత్రంగా ఫీజును వసూలు చేస్తున్న నిర్వాహకులు శిక్షణ కోసం వచ్చే వారికి వసతి సౌకర్యంతోపాటు భోజన వసతిని కల్పిస్తున్నారు. శిక్షణా కాలంలో వారికి మితంగా ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా కాన్ఫిడెన్షియల్ సెషన్స్‌ను నిర్వహిస్తుండటంతో టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడాకారులు సైతం ఇక్కడి కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందుతున్నారని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
రాక్ ైక్లెంబింగ్పై ఆసక్తి పెరిగింది
భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్లోనే ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సందర్భంగా చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. దీంతో శిక్షణ కోసం మళ్లీ భువనగిరికి వచ్చాను. మూడు రోజులపాటు ఇచ్చే లెవెల్ టూ ట్రైనింగ్‌ను తీసుకుంటున్నా. ఇక్కడ శిక్షణ బాగా ఇస్తున్నారు. గతంలో కంటే నాకు ైక్లెంబింగ్పై ఇంట్రస్ట్ కూడా పెరిగింది. రాబోయే రోజుల్లో పెద్దపెద్ద పర్వతాలను అధిరోహించేందుకు ఇక్కడి బేసిక్స్ చాలా ఉపయోగపడనున్నాయి. ఇక్కడ ఇస్తున్న శిక్షణ పర్వతారోహకులకు మంచి అనుభవం లాంటిది. - అనిల్‌కుమార్, ఐటీ ఉద్యోగి, కందుకూరు, రంగారెడ్డి జిల్లా
శిక్షణతో పర్వతారోహణ ఈజీ..
ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇండియాలోని అత్యంత క్లిష్టమైన పర్వతాలపై గతంలో ట్రెక్కింగ్ చేశాను. ట్రెక్కింగ్‌లో మరింత నైపుణ్యతను సాధించేందుకు శిక్షణ అవసరం అని భావించి భువనగిరి రాక్ ైక్లెంబింగ్ శిక్షణా కేంద్రంలో చేరాను. ఫస్ట్ లెవెల్ శిక్షణలో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. పర్వతారోహణ మెలకువలపై పూర్తి అవగాహన వచ్చింది. భయాన్ని పోగొట్టుకుంటే వయసుతో సంబంధం లేకుండా పర్వతాలను అధిరోహించవచ్చు.
- దివ్య, శాస్త్రవేత్త, హైదరాబాద్
దాతలు సహకరిస్తే కిలిమంజారో ఎక్కేస్తా
పర్వతారోహణ అంటే మొదటి నుంచీ ఇష్టం. భువనగిరిలో ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చాను. జనవరి 21న కిలిమంజారో పర్వతాన్ని ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నాను. ఇప్పటికే ఫస్ట్ లెవెల్ శిక్షణ పూర్తయ్యింది. సెకండ్ లెవెల్ శిక్షణను తీసుకుంటున్నా. శిక్షణ తీసుకున్నాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎటువంటి పర్వతాలనైనా ఎక్కగలనన్న విశ్వాసం కలిగింది. దాతలు సహకరిస్తే కిలిమంజారోపై మన దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తా.
- సంతోష్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, వికారాబాద్ జిల్లా
శిక్షణ ఉపాధి చూపించింది
భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్లో శిక్షణ పొందాను. పూర్తి నైపుణ్యతను పొందాక 2017లో 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని, 2018లో ఆస్ట్రేలియాలోని కొసియెస్కో పర్వతాన్ని అధిరోహించాను. ైక్లెంబింగ్‌లో తీసుకున్న శిక్షణ నాకు ఉపాధిని చూపించింది. ప్రస్తుతం భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్లోనే మేనేజర్‌గా పనిచేస్తున్నాను. కొత్తగా శిక్షణ పొందేందుకు వచ్చే వారికి కూడా ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాను.
- రాఘవేందర్, ఇన్స్ట్రక్టర్, భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్
ఇంటర్నేషనల్ ైక్లెంబర్స్ వస్తున్నరు
బేసిక్ నాలెడ్జ్ తెలియని వాళ్ల నుంచి ఇంటర్నేషనల్ ైక్లెంబర్స్ కూడా భువనగిరి కోటపై ైక్లెంబింగ్ చేసేందుకు అనువైన శిలలు ఇక్కడ ఉన్నాయి. గతంలో పెద్ద పర్వతాలను అధిరోహించిన వారు సైతం ఇక్కడకు వివిధ దేశాల నుంచి వచ్చి శిక్షణ తీసుకున్నారు. ఇప్పటి వరకు 8వేల మందికిపైగా శిక్షణ ఇవ్వగా, 400 మందికి పైగా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. త్రీ లెవెల్స్‌లో ఇచ్చే శిక్షణలో టెక్నిక్స్‌తోపాటు వినియోగించే వస్తువులపై కూడా పూర్తి అవగాహన కల్పిస్తాం. శిక్షణ సమయంలో ఎనర్జీ అవసరం కాబట్టి ప్రత్యేక డైట్‌ను అమలు చేస్తాం.
- పరమేశ్, ప్రధాన శిక్షకుడు,
భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్
తాజావార్తలు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- అగ్రిహబ్‌కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ