ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 02, 2021 , 00:17:35

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రిలో భక్తుల రద్దీ

స్వామివారికి విశేష పూజలు

ధర్మదర్శనానికి మూడున్నర గంటల సమయం

వైభవంగా అమ్మవారికి ఊంజల్‌సేవ 

ఆలేరు, జవనరి1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది.  శుక్రవారం 2021 నూతన సంవత్సరంతో పాటు సెలవుకావడంతో జంటనగరాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరిగింది. సుమారు 25వేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. నూతన సంవత్సరంరోజు స్వామివారిని దర్శించుకుంటే ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో భక్తులు తమ కుటుంబసభ్యులు, చిన్నపిల్లలతో కలిసి వచ్చారు. క్యూలెన్లు, ఆలయ సన్నిధి, తిరువీధుల్లో భక్తుల రద్దీ కనిపించింది. కొత్త ఏడాది తొలిరోజు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని, 2021 క్యాలెండర్లను భక్తులు అధిక సంఖ్యలో కొనుగోలు చేశారు. వాహనాలను కొండపైకి అనుమతించలేదు. దీంతో భక్తులు తమవాహనాలను కొండకింద గల తులసీ కాటేజీ వద్ద గల పార్కింగ్‌లో పార్క్‌ చేశారు. యాదాద్రీశుడి దర్శనం కాని పలువురు భక్తులు పాతగుట్టలో స్వామివారిని దర్శించుకుని వెనుదిరిగారు. 

స్వామివారికి విశేష పూజలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో విశేష పూజలు  జరిగాయి. వేకువజామునే మూడు గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ఆరాధన, బాలభోగం, తిరుప్పావై, అభిషేకం, సహస్రనామార్చన వంటి పూజలు ఆగమశాస్ర్తానుసారం జరిపారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తరం నిర్వహించారు. సుదర్శన నారసింహహోమం, కల్యాణసేవ, నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిపారు.  

 అమ్మవారికి ఊంజల్‌సేవ

లక్ష్మీనరసింహుడి బాలాలయంలో ఊంజల్‌ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళాభక్తులు పాల్గొనే ఊంజల్‌ సేవలో వేలాది మంది  పాల్గొని తరించారు. బాలాలయం ముఖమండపం లో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.516  టికెట్‌ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని  బాలాలయం ముఖమంటపంలోని ఊయలలో శయనింప చేయించారు. గంటపాటు వివిధ రకా ల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. 

 శ్రీవారి ఖజానాకు రూ. 29,13,393 ఆదాయం

నూతన సంవత్సరం పురస్కరించుకుని యాదాద్రి  లక్ష్మీనరసింహుడికి భారీ ఆదా యం సమకూరింది. ఒక్క రోజే స్వామివారి ఖజానాకు రూ. 29,13,393 ఆదాయం వచ్చింది. ప్రధాన బుకింగ్‌ ద్వారా  రూ. 5,82,078, రూ. 100 దర్శనాల ద్వారా  రూ. 37,400, రూ. 150 దర్శనాల ద్వారా 4,20,900, ప్రచారశాఖ ద్వారా రూ. 8,500,  క్యాలెండర్ల ద్వారా  రూ. 44,8 00, వ్రతాల ద్వారా రూ. 66,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 23,360, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 14,01,400, శాశ్వత పూజల ద్వారా రూ. 24,000, వాహనపూజల ద్వారా రూ. 19,800, టోల్‌గేట్‌ ద్వారా రూ. 3,030, అన్నదాన విరాళం ద్వారా  రూ. 57,249, ఇతర విభాగాలు రూ. 2,24,376లతో కలిపి రూ. 29,13,393 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

VIDEOS

logo