ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 31, 2020 , 00:35:31

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
  • చౌటుప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

చౌటుప్పల్‌ : ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలు, పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటుపై మున్సిపల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అవాల్యుయేషన్‌ ధ్రువపత్రాలు మున్సిపాలిటీలో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సర్వీస్‌రోడ్ల వెంట ఏర్పాటు చేసిన డ్రైనేజీలను జీఎంఆర్‌ అధికారులు శుభ్రం చేసేలా చూడాలని లక్కారం 8వ వార్డు కౌన్సిలర్‌ కొయ్యడ సైదులుగౌడ్‌ కలెక్టర్‌ను కోరారు. మున్సిపాలిటీ కేంద్రంలోని వరద ప్రాంతాల్లో నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని 11 వార్డు కౌన్సిలర్‌ తాడూరి శిరీషాపరమేశ్‌ కోరారు. లింగోజీగూడెంలో కుక్కల బెడద నివారణ చర్యలు చేపట్టాలని కౌన్సిలర్‌ బండమీద మల్లేశం విన్నవించుకున్నారు. చిన్నకొండూరు రోడ్డు పక్కన ఎంతమేర రోడ్డు విస్తరణ పనులు చేపడుతారో తెలియజేయాలని మున్సిపల్‌ వైస్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌ కోరారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములకు పెన్షింగ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతున్నాయన్నారు. జిల్లాలో దండుమాల్కాపురం, సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సర్వేల్‌, కొండాపూర్‌, తుర్కపల్లి, బీబీనగర్‌లలో 3వేల డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పూర్తయిన ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌, కమిషనర్‌ రాందుర్గారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

బ్యాంకులు రుణాలు అందించాలి..

భువనగిరి కలెక్టరేట్‌ : నాబార్డ్‌ పొటెన్షియల్‌ లింక్‌డ్‌ రూణప్రణాళిక ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు విరివిగా రుణసౌకర్యం అందించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. 2021-22 వార్షిక సంవత్సరానికి నాబార్డు రూ.2,521.99 కోట్లతో రూపొందించిన పొటెన్షియల్‌ లింక్‌డ్‌ ప్రణాళికను కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యాంకులు నాబార్డు రూపొందించిన పొటెన్షియల్‌ లింక్‌డ్‌ ప్లాన్‌ ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున్న రుణసౌకర్యం అందించాలన్నారు. గత ఏడాది రూ.2221.24 కోట్లతో నాబార్డు ప్రణాళిక రూపొందించగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం అదనంగా రూ.2521.89 కోట్లతో ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో పంట రుణాలు, వ్యవసాయ రుణాల కింద రూ.1392.97 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.189.01 కోట్లు, వ్యవసాయ రంగానికి సంబంధించి గోదాముల నిర్మాణం ఇతర మౌలిక సౌకర్యాలకు రూ.936.61 కోట్లు, ఇతర రంగాలకు 416.15 కోట్లు, మైక్రో, చిన్నతరహ ఔత్సాహిక పారిశ్రామిక రంగాలకు రూ.293.25 కోట్లు, విద్యార్థులకు 436.50 కోట్లు, గృహ నిర్మాణాలకు 616.50 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు ఇతర సామాజిక అవసరాలకు రూ.173.93 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రంగాల అభివృద్ధికి నాబార్డు రూపొందించిన ప్రణాళికలను బ్యాంకులు అమలు చేయాలన్నారు. నాబార్డు రూపొందించిన లింక్‌డ్‌ రుణప్రణాళిక బ్యాంకులకు దిశా నిర్ధేశం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి సత్యానారాయణ, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ నాగార్జున బాబు, జిల్లా పశు సంవర్ధక అధికారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం సందర్శన..

చౌటుప్పల్‌ రూరల్‌ : చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సందర్శించి ధరణి పోర్టల్‌ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ గిరిధర్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్‌ ఉన్నారు.

VIDEOS

logo