ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Dec 28, 2020 , 01:18:04

శ్రీ రాముడిగా.. వెంకటేశ్వరుడిగా

శ్రీ రాముడిగా.. వెంకటేశ్వరుడిగా

  • యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు

ఆలేరు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు మూడోరోజు ఆదివారం కనుల పండువగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం శ్రీరాముడిగా, సాయంత్రం శ్రీ వేంకటేశ్వురుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార సేవలను బాలాలయంలోని మండపంలో ఊరేగించారు. భక్తులు అలంకారసేవలను కనులారా వీక్షించి తరించారు.

పంచనారసింహుడిగా వెలసిన యాదాద్రి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజులో భాగంగా ఆదివారం ఉదయం యాదాద్రీశుడు శ్రీరాముడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. నిత్యపూజల అనంతరం నిర్వహించిన అధ్యయనోత్సవాలలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. శ్రీరాముడిగా స్వామివారిని అలంకరించి బాలాలయ మండపంలో ఊరేగించారు. 

సాయంత్రం శ్రీ వేంకటేశ్వుడిగా..

అధ్యయనోత్సవాలలో భాగంగా సాయంత్రం స్వామివారిని బాలాలయంలో ద్రావిడ ప్రబంధ సేవా కాలాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని శ్రీ వేంకటేశ్వరస్వామిగా అలంకరించి సేవను ఊరేగించారు. ఈ సేవ ల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారికి హారతినిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. సన్నాయి మేళం లో అర్చకులు, పారాయణికులు, రుత్వికుల వేద మంత్రోచ్ఛరణతో బాలాలాయం మారుమోగింది. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహామూర్తి, కార్యనిర్వాహణాధికారిని గీత, సహా య కార్యనిర్వాహణాధికారులు శ్రవణ్‌కుమార్‌, గజవెల్లి రమేశ్‌బా బు, ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, పర్యవేక్షకులు ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

యాదాద్రిలో భక్తుల పరవశం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నాయి. ధనుర్మాసోత్సవాలు,  స్వామివారి ఆధ్యయనోత్సవాలతోపాటు వారాంతపు సెలవురోజు కావడంతో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. కొండపై తిరువీధులన్నీ నిలబడటానికి సందులేనంతగా కిటకిటలాడాయి. నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట పడుతుందని భక్తులు చెబుతున్నారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. 

శ్రీవారి ఖజానాకు రూ. 19,34,010 ఆదాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.19,34, 010 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.2,31,010, రూ.100 దర్శనాలతో రూ.17,000, రూ.150 దర్శనాలతో 2,31,000, ప్రచారశాఖతో రూ.10,000, క్యాలెండర్లతో రూ.24,000, వ్రతాల ద్వారా రూ.1,32,500, కల్యాణ కట్టతో రూ.32,000, ప్రసాదవిక్రయాలతో రూ.8,96,400, శాశ్వత పూజలతో రూ.12,000, వాహనపూజలతో రూ.24,100, టోల్‌గేట్‌ ద్వారా రూ.2,840, అన్నదాన విరాళంతో రూ.8,229, ఇతర విభాగాలతో రూ.3,09,543 లతో కలిపి రూ.19,34,010 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్‌ దంపతులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నల్లంధీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వారికి స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్‌ దంపతులు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

యాదాద్రీశుడి దివ్యక్షేత్రం అత్యద్భుతం.. 

యాదాద్రి లక్ష్మీనరసింహుడి దివ్యక్షేత్రం అత్యద్భుతంగా నిర్మితమవుతుందని ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ధనుర్మాసం, అధ్యయనోత్సవాల్లో భాగంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు స్వామివారి అలయ పునర్నిర్మాణ పనులను కుటుంబసమేతంగా పరిశీలించి దేశంలో ఎక్కడాలేని విధంగా యాదాద్రి ఆలయం పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించడంతోపాటు అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఆలయనిర్మాణం జరగడం గొప్పవిషయమన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు.

VIDEOS

logo