గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 27, 2020 , 00:07:45

యాదాద్రిలో భక్తజన సంద్రం

యాదాద్రిలో భక్తజన సంద్రం

కొనసాగుతున్నఅధ్యయనోత్సవాలు 

మొక్కులు  చెల్లించుకున్న భక్తులు

శ్రీవారి ఖజానాకు రూ. 15,62,498 ఆదాయం

ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. ధనుర్మాస ఉత్సవాలతో పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు  లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలను పఠిస్తూ తిరుప్పావై పూజలు అత్యంత వైభవంగా చేపట్టారు. అర్చకులు గోదాదేవి రంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించి భక్తులకు వినిపించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు వైభవంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

రూ. 15,62,498 ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 15,62,498 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌  ద్వారా రూ. 2,02,784, రూ. 100 దర్శనాల ద్వారా  రూ. 6,400, రూ. 150 దర్శనాల ద్వారా రూ. 2,10,000, ప్రచారశాఖ ద్వారా రూ. 7,150, క్యాలెండర్ల ద్వారా రూ. 39,000, వ్రతాల ద్వారా రూ. 1,56,500, కల్యాణకట్ట ద్వారా రూ. 24,960, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 6,36,900, శాశ్వత పూజల ద్వారా రూ. 6,696, వాహనపూజల ద్వారా రూ. 25,200, టోల్‌గేట్‌ ద్వారా రూ. 2,140, అన్నదాన విరాళం ద్వారా రూ. 13,024, ఇతర విభాగాలు రూ. 2,31,744 లతో కలిపి రూ. 15,62,498 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు. 

శాస్ర్తోక్తంగా అధ్యయనోత్సవాలు  

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో అధ్యయనోత్సవాలు  శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ  ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయన ఉత్సవాల్లో భాగంగా శనివారం రెండోరోజు స్వామివారిని ఉదయం వేణుగోపాలస్వామి, రాత్రి గోవర్ధనగిరిధారి అవతారాల్లో సేవలు నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు, రుత్వికులు ప్రత్యేకంగా పాశురాలను పఠించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఉదయం వేణుగోపాలస్వామిగా..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో రెండో రోజు అధ్యయన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం పారాయణికులచే దివ్య ప్రబంధ పారాయణాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వేణుగోపాలస్వామి  అలంకారంలో భక్తులకు దర్శనార్థం బాలాలయంలో ఊరేగించారు. 

సాయంత్రం గోవర్ధనగిరిధారిగా..

స్వామివారి బాలాలయంలో నిత్యారాధనల అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామివారి ద్రావిడ ప్రబంధ సేవకాలంను పారాయణికులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం  స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి భక్తుల దర్శనభాగ్యం కల్పించారు. ఈ వేడుకలను ఆలయ స్థానాచార్యులు సంధుగుల రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు గజవెల్లి రమేశ్‌బాబు, శ్రవణ్‌కుమార్‌, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

నేటి నుంచి అయ్యప్పకొండపై ఏకశిల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

ధర్మశాస్త్ర దేవాలయం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని అయ్యప్ప కొండపై ఆదివారం, సోమవారం  ఏకశిల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనమహోత్సవం, మండల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ అధ్యక్షుడు సుడుగు శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీత, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, యాదగిరిగుట్ట ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

VIDEOS

logo