బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 27, 2020 , 00:09:50

పుస్తకాలే ఆస్తి.. ఇల్లే గ్రంథాలయం

పుస్తకాలే ఆస్తి.. ఇల్లే గ్రంథాలయం

మారుమూల పల్లెలో సాహిత్య పరిమళాలు  

లక్షకు పైగా పుస్తకాలతో సొంత ఇల్లే గ్రంథాలయం

కవిగా, మాతృభాషా పరిరక్షకుడిగా సాహిత్యరంగంలో విశిష్ట సేవలు

యూనివర్శిటీల్లో లేని పుస్తకాలు ఈ గ్రంథాలయంలో లభ్యం

పరిశోధనాలయంగా ‘వెల్లం’కి గ్రంథాలయం 

సన్నిహితులు, దాతల సహాయంతో గ్రంథాలయ నిర్వహణ

గత యేడాది దాశరథి కృష్ణమాచార్య అత్యున్నత పురస్కారంతో గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం

తమ చదువు కోసమో.. పిల్లల చదువు కోసమో ఆస్తులను అమ్ముకున్నవాళ్లు ఉన్నారు..లేదా అప్పులు చేసిన వాళ్లు ఉన్నారు. కానీ.. సమాజహితం కోరి ఆస్తులను వదులుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ కోవకే చెందుతారు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య. ఒక్క గది ఉన్నా.. అద్దెకు ఇవ్వాలని యోచించే ఈ రోజుల్లో ఉన్న ఇంటిని గ్రంథాలయం కోసం కేటాయించి పదిమందికీ జ్ఞాన సంపదను సమకూర్చి ఆదర్శంగా నిలుస్తున్నారీ విశ్రాంత ఉపాధ్యాయుడు. గ్లకోమా వ్యాధితో ఓ కంటి చూపు పోయినా.. ఎనభైకి పైబడిన వయసులో అక్షర వనాలను విరబూయిస్తున్నారు. గురువులకే గురువుగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విఠలాచార్యను చాలామంది ‘బాపూ’ అనే పిలుస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప గ్రంథాలయంగా వెల్లంకి గ్రంథాలయాన్ని నిలపాలన్న సంకల్పంతో దాతల సాయంతో రూ.50లక్షలతో తన ఇంటి స్థలంలోనే నిర్మిస్తున్న ఆధునిక గ్రంథాలయం అన్ని హంగులతో రూపుదిద్దుకుంటోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కూరెళ్ల విఠలాచార్య. సాహిత్యంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. కూరెళ్ల లక్ష్మ మ్మ- వెంకట రాజయ్య దంపతులకు 1938 జులై 7న జన్మించిన విఠలాచార్య జీవనయానం అంతా కష్టాల కడలిలోనే సాగింది. ఐదేండ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారు. ఎలాంటి కష్టాన్నయినా ఇష్టంగా భరించే తత్వం కలిగిఉండటంతో ఓ కంటి చూపును కోల్పోయినప్పటికీ నేటికీ గ్రంథాలయోద్యమంతోపాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. 7వ తరగతి చదువుతున్న రోజుల్లోనే పుస్తక పఠనం, రచనలపై ఆసక్తిని పెంపొందించుకున్నారు. అప్పట్లోనే కొన్ని పద్యాలు కూడా రాశారు. ఏకోపాధ్యాయ ఉద్యోగం నుంచి డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడి వరకు 35 ఏండ్లకు పైగా విద్యారంగంలో ఆయన ప్రస్తానం సాగింది. ఉపాధ్యాయునిగా.. అధ్యాపకునిగా పనిచేసిన కాలంలో ప్రతి చోట గ్రంథాలయానికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించి విద్యార్థులకు పఠనాసక్తిని పెంపొందింపజేశారు. ఆయా చోట్ల పనిచేసిన సందర్భంలో బాపూ భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, మన పురోగమనం, చిరంజీవి, ప్రియంవద, ముచికుంద వంటి పత్రికలను నిర్వహించారు. పదవీ విరమణ పొందినా.. ఆయన ధ్యాస అంతా పుస్తకాలపైనే. తన జీవితంలో ఎంతో ఉపయోగపడిన పుస్తకాలను విద్యార్థులు, యువకులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అందుబాటులో ఉంచాలనుకున్నారు విఠలాచార్య. తన ఆలోచనను కుటుంబ సభ్యులతో పంచుకుని తన సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి ‘ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు.

రచనలు.. సత్కారాలు..

విఠలాచార్య ఇప్పటివరకు ముప్పైకి పైగా పుస్తకాలు రాశారు. ఇందులో కొన్ని ముద్రణకు నోచుకోగా.. ఇంకా కొన్ని పుస్తకాలను ముద్రించాల్సి ఉంది. అయితే ఈయన రాసిన పద్య ప్రక్రియలో ‘విఠలేశ్వర శతకం’, గద్య కవితలలో ‘కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌', పరిశోధనలో ‘గొలుసుకట్టు’ నవలా ప్రక్రియ పాఠకుల అభిమానాన్ని చూరగొనడంతోపాటు విఠలాచార్యకు మంచి గుర్తింపును తెచ్చాయి. సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు, జీవన సాఫల్య విశిష్ట పురస్కారాలతోపాటు సత్కారాలు పొందారు. అయితే మహాకవి దాశరథి పేరిట తెలంగాణ ప్రభు త్వం ఏర్పాటుచేసిన ‘దాశరథి కృష్ణమాచార్య’ అత్యున్నత పురస్కారాన్ని 2019 లో అందుకున్నారు. 

నాడు ఐదువేలు.. నేడు లక్షకుపైగా పుస్తకాలు..

ఆరంభంలో సొంతంగా 5వేల పుస్తకాలతో కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పుస్తక సేకరణలో భాగంగా అప్పట్లో ‘గ్రంథభిక్షకై అభ్యర్థన’ పేరుతో కరపత్రాన్ని రూపొందించి ఏ సభకు, ఏ ఊరికి వెళ్లినా పంచి పెట్టడంతో తమ గ్రంథాలయల్లోని పుస్తకాలను ఇచ్చేందుకు చాలామంది సాహితీవేత్తలు ముందుకు వచ్చారు. పలు రాష్టాల్లో ఉన్న తెలుగువాళ్లు కూడా సహకరించి నేటికీ పుస్తకాలను అందిస్తున్నారు. బస్తాల కొద్దీ దూర ప్రాంతాల నుంచి వచ్చే పుస్తకాలను ఇక్కడకు తెచ్చేందుకు విఠలాచార్య శిష్యులు ఖర్చులు భరించి తోడ్పాటునందిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించకుండా ‘ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్‌'ను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా.. దాతల సాయంతోనే గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి గ్రంథాలయంలో లక్షకు పైగా గ్రంథాలుండగా.. మరో లక్ష వరకు సేకరించే పనిలో ఉన్నారు. ఎన్నోఏళ్లనాటి పత్రికలతో పాటు పద్యం, గద్యం, విజ్ఞాన సర్వస్వాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన, బాల సాహిత్యం, విద్య, వైద్యం, చరిత్ర, రామాయణం, మహాభారతం, రాజకీయం.. ఇలా అన్ని అంశాలకు సంబంధించిన పుస్తకాలు కూరెళ్ల గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గ్రంథాలయం పరిశోధనాలయంగా నిలుస్తోంది. పెద్దపెద్ద యూనివర్శిటీలలోనూ దొరకని పుస్తకాలు ఇక్కడ లభ్యం అవుతుండటంతో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధన కోసం విద్యార్థులు తరచుగా కూరెళ్ల గ్రంథాలయానికి వస్తూనే ఉన్నారు. ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకున్న వారిలో ఎనిమిది మంది డాక్టరేట్స్‌ పొందగా.. ఇక్కడి పుస్తకాల ఆధారంగా పరిశోధనలు చేసి పదిమంది పీహెచ్‌డీలు చేశారు. 

గ్రంథాలయోద్యమ స్ఫూర్తితోనే..

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి తెలుగువారికి స్ఫూర్తినిచ్చింది గ్రంథాలయోద్యమమే కాగా... ఆ స్ఫూర్తితోనే మారుమూల ప్రాంతమైన వెల్లంకిలో పెద్ద ఎత్తున గ్రంథాలయాన్ని పెట్టడానికి నిర్ణయించుకున్నానని విఠలాచార్య చెబుతారు. గ్రంథాలయాలు సమాజంలో చైతన్యాన్ని నింపడమే కాకుండా.. విజ్ఞాన వికాసానికి ఎంతో తోడ్పడుతాయని అంటారు. 1954లో కొంతమంది మిత్రులతో కలిసి గ్రంథాలయాన్ని స్థాపించగా.. అది ఎక్కువ కాలం నడవలేదు. ఆ తర్వాత భువనగిరిలోని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న సందర్భంలో పుస్తకాలు కొనుక్కునే శక్తి లేక పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. గ్రామీన ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో తానే సొంతంగా గ్రంథాలయాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఈ మేరకు 2014 ఫిబ్రవరి 13న వెల్లంకిలోని తన సొంతింటిలోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. కూరెళ్ల గ్రంథాలయం స్ఫూర్తితో పలుచోట్ల గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. అనంతగిరి మండలం అమీనాబాద్‌లో, రామన్నపేట మండలం కక్కిరేణిలో, వలిగొండ మండలం చిత్తాపురంలో ఏర్పాటైన గ్రంథాలయాలన్నీ విఠలాచార్య ప్రారంభించగా.. అవన్నీ నిరాటంకంగా నడుస్తున్నాయి. అలాగే పలుచోట్ల సాహిత్య, సాంస్కృతిక, విద్య, ఆధ్యాత్మిక, సామాజిక రంగాలకు సంబంధించిన సంస్థలను స్థాపించగా.. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతుండగా.. మరికొన్ని వివిధ కారణాలతో మూతబడ్డాయి.

పఠనాసక్తిని పెంచాలనే..

ప్రజల్లో పఠనాసక్తిని పెంచాలన్నది నా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే మారుమూల ఉన్న వెల్లంకిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1960లోనే భువనగిరి మండలం వడాయిగూడెంలో టీచర్‌గా పనిచేసినప్పుడు అక్షర ఉద్యమాన్ని నిర్వహించి వృద్ధులకు సైతం సంతకం నేర్పించాను. ప్రస్తుతం ఊరు ఊరికో గ్రంథాలయం.. ఊరికో పోతన పేరిట ఉద్యమం నిర్వహిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎందరో కవులుగా, వాగ్గేయకారులుగా మంచి పేరు సంపాదించుకోగలిగారు. వెల్లంకిలో ఆరు ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ప్రభుత్వానికి విక్రయించి నిరుపేదలకు ఇండ్ల వసతి కల్పించాను.  ఇక నాకు మిగిలిన నా ఇండ్లను కూడా గ్రంథాలయానికే అంకితం చేశాను. పెన్షన్‌ డబ్బులను సైతం గ్రంథాలయ నిర్వహణకే ఖర్చుచేస్తున్నా. రాబోవు రోజుల్లో ఇక్కడి గ్రంథాలయానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు దాతల సాయంతో రెండు అంతస్తులతో అన్ని సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మించతలపెట్టిన. త్వరలోనే ఇది కార్యరూపంలోకి వచ్చి గతానికి మించి సేవలు అందించనుంది.

- డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య

కూరెళ్ల సాహిత్యంపై పరిశోధన చేయడం  అదృష్టం..

ప్రైవేటు విద్యాసంస్థల్లో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నాను. నాకు ఎంఫిల్‌ పరిశోధన చేయాలన్న ఆసక్తి ఉండేది. డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య రచించిన ‘విఠలేశ్వర శతకం’పై పరిశోధన చేయాలని శ్రేయోభిలాషులు సూచించారు. నా పరిశోధనా గ్రంథం ఉత్తమ గ్రంథంగా ఎంపికైంది. తన జీవితాన్ని ధారపోసి సాహితీ లోకానికే అంకితమై పనిచేస్తున్న ఆచార్య కూరెళ్ల విఠలాచార్య రాసిన సాహిత్యంపై పరిశోధన చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.   

-రెబ్బ మల్లికార్జున్‌, తెలుగు ఉపన్యాసకుడు, వలిగొండ

పల్లెటూళ్లోని  గ్రంథాలయానికి విశేష ఆదరణ..

మారుమూలన ఉన్న వెల్లంకిలో ఏర్పాటు చేసిన కూరెళ్ల గ్రంథాలయానికి స్థానికుల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం విశేష ఆదరణ వస్తోంది. ప్రతి నిత్యం గ్రామస్తులతోపాటు దూర ప్రాంతాల నుంచి పాఠకులు ఇక్కడకు వస్తున్నారు. పఠనాశక్తిని పెంచేందుకు గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి యేటా సన్మానం చేయడంతోపాటు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నాం. మా గురువు కూరెళ్ల శిష్యునిగా గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తుండటం సంతోషంగా ఉంది.

- టి.స్వామి, గ్రంథాలయ నిర్వాహకుడు


VIDEOS

logo