శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Dec 26, 2020 , 00:17:31

కన్నపేగుకు గుండెకోత

కన్నపేగుకు గుండెకోత

చేతికొచ్చిన కొడుకు కానరానిలోకాలకు 

పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబాలు

భువనగిరి క్రైం:  అంతులేని శోకమిది. కన్నవాళ్ల కలలను అర్ధ్ధంతరంగా చిదిమేసి కుటుంబాలను అంధకారంలో నెట్టేసిన విషాదమిది. హాయిగా సాగిపోతున్న వారిని అనుకోని ఉపద్రవం అడ్డొచ్చి మృత్యువు కబళించిన దుర్ఘటన అది. హైదరాబాద్‌ నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు భువనగిరిలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే కన్నుమూశారు. తమ కొడుకులు ఇంజినీరింగ్‌ చేస్తూ భవిష్యత్‌లో ఉన్నత విద్య అభ్యసించి పేదకుటుంబాలకు అండగా ఉంటారని ఆ తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు కానీ విధి వక్రీకరించింది. వారి ఆశలను పూర్తిగా అడిఆశలు చేస్తూ  నాలుగు ప్రాణాలను బలితీసుకున్నది. ఆ యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భువనగిరి కలెక్టరేట్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాల పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. 

అప్పుడు ఇంటి దీపం.. ఇప్పుడు ఆశాదీపం

మల్కాజిగిరిలోని ఇందిరా నెహ్రూనగర్‌కు చెందిన లక్ష్మి ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగం చేసుకుంటూ కొడుకు రవికిరణ్‌ను బీటెక్‌ చదివించుకుంటున్నది. కూతురు పదో తరగతి చదువుతున్నది. అయితే ఆరేండ్ల క్రితం భర్త భాస్కర్‌యాదవ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఇంటి దీపాన్ని కోల్పోయి బరువుగా కుటుంబాన్ని లాక్కొస్తున్న లక్ష్మి ఆశాదీపాన్ని కూడా కోల్పోయింది. భువనగిరిలో జరిగిన ప్రమాదంలో లక్ష్మి కొడుకు మరణించడంతో కాలనీలో తీవ్ర విషాదం నెలకొన్నది  

తల్లడిల్లిన తండ్రి...

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన గొరకంటి రాజుకు ఒక  కొడుకు, కూతురు ఉన్నారు.  రాజు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివిపిస్తుండగా...కొడుకు కార్తిక్‌ బీటెక్‌ చేస్తున్నాడు. భవిష్యత్‌లో కొడుకు అండగా  ఉంటాడనే నమ్మకంతో ఉన్న ఆ తండ్రి ఈ ఘటనతో  తల్లడిల్లిపోయాడు. 

ఎదిగొచ్చి చేతికొస్తారనుకుంటే..

మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన చింతల అంజయ్య, లక్ష్మి తన ఇద్దరు కుమారులతో కలిసి కుషాయిగూడలోని న్యూవిరాట్‌నగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా కిరాణా దుకాణం, కూరగాయలు విక్రయిస్తుంటారు. వీరిలో చిన్నవాడు వెంకటే మృతిచెందడంతో        వారు శోక సంద్రంలో మునిగిపోయారు. 

వ్యవసాయమే జీవనాధారంగా......

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిపాక గ్రామానికి చెందిన పన్నాల బోజిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కొడుకులు.   పెద్ద కొడుకు పన్నాల కల్యాణ్‌రెడ్డి ఘట్‌కేసర్‌లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో  అతడు మృతిచెందడంతో విషాదం నెలకొన్నది.

మొత్తం నలుగురు మృతి 

ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హర్షవర్ధన్‌ తార్నాకలోని ఆర్టీసీ దవాఖాన, సాయిచరణ్‌ ఆనంద్‌బాగ్‌లోని ఏడీఆర్‌ దవాఖాన, అఖిల్‌ మరో ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హైవేపై అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 

 ట్యాంకర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు

వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కలెక్టరేట్‌ వద్ద జరిగిన  రోడ్డు ప్రమాదానికి సంబంధించి వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌పై  కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్‌ సీఐ వి.జానయ్య శుక్రవారం తెలిపారు. ట్యాంకర్‌ ఆపిన చోట ప్రమాద సూచిక చర్యలు ఏర్పా టు చేయడంలో నిర్లక్ష్యం వహించిన డ్రైవర్‌ అంకర్ల ఆం జనేయులుపై ఐపీసీ 304(ఎ), 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

VIDEOS

logo