బుధవారం 03 మార్చి 2021
Yadadri - Dec 25, 2020 , 01:35:02

సంతోషం.. సగంలోనే ఆవిరి

సంతోషం.. సగంలోనే ఆవిరి

  • స్నేహితుడి చెల్లెలు పెండ్లికి వెళ్లొస్తుండగా ప్రమాదం
  • వాటర్‌ ట్యాంకర్‌ను అతివేగంగా ఢీకొట్టిన కారు
  • అక్కడికక్కడే  నలుగురు బీటెక్‌ విద్యార్థులు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • నెత్తురోడిన వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ భువనగిరి: అనునిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగే హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారి నెత్తుటి మరకలతో తడిసి ముద్దయ్యింది. స్నేహితుడి చెల్లెలు పెండ్లికి హాజరై ఆనందంగా తిరిగి వస్తున్న స్నేహితుల్లో నలుగురిని మృత్యువు కబళించింది. మరో ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడి దవాఖాన పాలయ్యారు. భువనగిరి పట్టణ పరిధిలోని పగిడిపల్లి గ్రామ సమీపంలో కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద  జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో నివాసం ఉంటూ బోగారం సమీపంలోని హోళీమేరీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితియ సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులు రవికిరణ్‌, వెంకటేశ్‌, కల్యాణ్‌రెడ్డి, కార్తిక్‌, సాయిచరణ్‌, అఖిల్‌రెడ్డి, హర్షవర్ధన్‌లు తమ స్నేహితుడు సాయికుమార్‌ చెల్లెలు వివాహం  ఆలేరులోని ఫంక్షన్‌హాల్‌లో జరుగగా స్నేహితులంతా కారును అద్దెకు తీసుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. ఆలేరులో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని సంతోషంగా వీరంతా హైదరాబాద్‌కు సాయంత్రం తిరుగుపయనమయ్యారు. వీరి కారు  హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారి మీదుగా భువనగిరి పట్టణ పరిధిలోని పగిడిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే.. ముందున్న కారును ఓవర్‌టేక్‌ చేయబోయే సందర్భంలో ఆ కారును ఢీ కొట్టి సమీపంలోనే హైవేపై ఉన్న మొక్కలకు నీరు పడుతున్న వాటర్‌ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో  కారులో ప్రయాణిస్తున్న  రవికిరణ్‌(19), వెంకటేశ్‌(19), కల్యాణ్‌రెడ్డి(19), కార్తిక్‌ (20)  అక్కడికక్కడే మృతిచెందారు. కాగా సాయిచరణ్‌, అఖిల్‌రెడ్డి, హర్షవర్ధన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న  రాచకొండ పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వెంకటేశ్‌ అనే విద్యార్థి కారును డ్రైవింగ్‌ చేస్తుండగా.. డ్రైవర్‌ సీటులో ఇరుక్కుపోయిన అతని మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం నిమిత్తం భద్రపర్చారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై కె, సైదులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గాయపడ్డ అఖిల్‌రెడ్డి ఒక్కరే ఘట్‌కేసర్‌ మండలంలోని అనోజ్‌గూడకు చెందిన వ్యక్తికాగా.. మిగతా వారంతా మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్‌ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రమాద విషయమై వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, శిక్షణ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. తహసీల్దార్‌ జనార్దన్‌రెడ్డి, డీఏవో మందడి ఉపేందర్‌రెడ్డి, రూరల్‌ సీఐ జానయ్య రాత్రి వరకు సంఘటనా స్థలం వద్దనే ఉండి పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులకు వైద్య సేవలందించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. హైవేపై జరిగిన ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

VIDEOS

logo