శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Dec 24, 2020 , 00:06:34

మోదీ కుట్రను రైతులు తిప్పికొట్టాలి

మోదీ కుట్రను రైతులు తిప్పికొట్టాలి

మార్కెట్లు, సొసైటీలను ఎత్తివేస్తే పతనం ఖాయం

ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

ఆలేరు : రైతులను నట్టెట ముంచేందుకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కుట్రను రైతాంగమంతా తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా పంటలను అమ్ముకోవచ్చంటూ సన్న, చిన్నకారు రైతుల మనుగడ లేకుండా చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లిలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. పలువురి రైతులతో ముచ్చటించిన ఆమె వరినాట్లు వేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రపంచ రైతు దినోత్సవం పురస్కరించుకుని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం.. జై శ్రీరాం అనడంకాదు, జై కిసాన్‌ అనాలని హితవుపలికారు. రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి కావాల్సిన రుణాలను అందజేస్తూ, గ్రామాలకే కొనుగోలు కేంద్రాలను ప్రవేశపెట్టే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, సొసైటీలను ఎత్తివేసే ప్రక్రియను మోదీ ప్రారంభించారన్నారు. పూర్తిగా కొనుగోలు హక్కులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టారని దూయబట్టారు. దీంతో రైతు తాను పండించే పంటకు ధరను నిర్ణయించే హక్కును కొల్పోయి, కార్పొరేట్‌ సంస్థలు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి ఉంటుందన్నారు. సాధారణ రైతు పరిస్థితి ప్రశ్నార్థంగా మారే పరిస్థితి ఉంటుందన్నారు. అదే జరిగితే మోదీని రైతులంతా తరిమి కొడుతారన్నారు. దేశవ్యాప్తంగా రైతులంతా మోదీ పాలనను వ్యతిరేకిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే జన్‌ధన్‌ ఖాతా ద్వారా ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు అందిస్తామన్నారని, ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. పాత నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పిన మోదీ, 7 ఏండ్లుగా నల్లధనం ఎక్కడికిపోయిందో జీఎస్టీ నిధులు ఎవరికిచ్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. దేశం మొత్తం నా గుప్పిట్లో ఉండాలన్నదే నరేంద్రమోదీ ఆలోచనగా ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. రైతుల ఉసురుపోసుకుంటే బీజేపీ పథనం ఖాయమన్నారు. బీజేపీ ఎంపీలు వ్యవసాయ బిల్లును వ్యతిరేకించేదిపోయి, స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌ జిన్నా మాధవరెడ్డి, సర్పంచ్‌ సిరికొండ సత్యనారాయణ, ఉప సర్పంచులు కాయితీ మల్లారెడ్డి, పాండురంగం పాల్గొన్నారు.

VIDEOS

logo