శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Dec 22, 2020 , 00:03:38

పాత పద్ధతిలో 81 రిజిస్ట్రేషన్లు

పాత పద్ధతిలో 81 రిజిస్ట్రేషన్లు

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  సందడి

భువనగిరి : ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సబ్‌రిజిస్ట్రార్‌  కార్యాలయంలో పాత పద్ధతి ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.  మూడు నెలలుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు మూసివేసిన నేపథ్యంలో క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లకు ఆదేశాలు జారీ చేసినా ప్రజల నుంచి వస్తున్న వినతుల ఆధారంగా పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు  చేపట్టేందుకు నిర్ణయించింది.  సోమవారం  ఉదయం నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద వ్యాపారులు, క్రయవిక్రయదారులతో సందడి నెలకొన్నది. మొదటి రోజు 28 రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు సబ్‌రిజిస్ట్రార్‌ మదన్‌గౌడ్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పారదర్శకతతో రిజిస్ట్రేషన్లు కొనసాగించామని ఆయన పేర్కొన్నారు.

రామన్నపేటలో ఒకే ఒక్కటి..

రామన్నపేట:  ప్రభుత్వం నిబంధనలకు లోబడి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం జరిగిన ఒకే ఒక్క రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను ఆయన పరిశీలించారు. ఇండ్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌కు సరిపడే పత్రాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు కావడం లేదని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా స్థానిక డాక్యుమెంట్‌ రైటర్లు అదనపు కలెక్టర్‌ను కలిసి డాక్యుమెంట్‌ పద్ధతి ద్వారానే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని వేడుకున్నారు. ఇబ్బందులను క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎండీ ఇబ్రహీం, సబ్‌ రిజిస్ట్రార్‌ రషిదొద్దిన్‌, జూనియర్‌ అసిస్టెంట్లు ఫసియొద్దిన్‌ ఉన్నారు. అదనపు కలెక్టర్‌ను కలిసిన డాక్యుమెంట్‌ రైటర్లు ఆముద సాయి, వెంకటేశ్వర్లు, ఎండీ షఫీ, రాజశేఖర్‌, బైరబోయిన వేణు, అప్సర్‌, ఆరీఫ్‌ ఉన్నారు.

మోత్కూరులో ఎనిమిది

మోత్కూరు : ప్రభుత్వం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు అనుమతులు జారీ చేయడంతో మోత్కూరు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం పరిధిలో సోమవారం ఎనిమిది రిజిస్ట్రేషన్లు చేసినట్లు సబ్‌రిజిస్ట్రారు ఖాదర్‌ పాషా తెలిపారు. ఆత్మకూరు(ఎం) మండల పరిధిలో డీటీసీ అనుమతులు ఉన్న 8 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్న వారు అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు. 

చౌటుప్పల్‌లో 19...

చౌటుప్పల్‌ : మండల కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్‌ వెంకట్‌రెడ్డి చేపట్టారు. సోమవారం మొత్తం 19 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగక బోసిపోయిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం.. తిరిగి రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటంతో ప్లాట్ల క్రయవిక్రయదారులతో బిజీగా కనిపించింది. 

పాతపద్ధతిలోనే 18 రిజిస్ట్రేషన్లు

ఆలేరు: యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పాత పద్ధతిలోనే జరిగాయి. 18 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయగా, ఇందులో 6 మార్టిగేజ్‌, 12 సేల్‌డీడ్‌ డాక్యుమెంట్లు ఉన్నాయని యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ దేవానంద్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 8 కంటే ముందు ఉన్న కార్డు సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్లు చేశామన్నారు. అయితే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఉన్న ఖాళీస్థలాలు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ప్రకారంగా ఉన్న అపార్ట్‌మెంట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయనున్నామన్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు మేరకు లేఅవుట్లు చేసిన ప్లాట్లకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ఇదిలా ఉండగా, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ సందర్శించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బీబీనగర్‌లో ఏడు..

బీబీనగర్‌: పాత పద్ధతిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మండల కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం  ప్రారంభమైంది. మొదటిరోజు కావడంతో భూముల క్రయవిక్రయదారులతో కార్యాలయం కిటకిటలాడింది. మొత్తం ఏడు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సబ్‌రిజిస్ట్రార్‌ సతీశ్‌ తెలిపారు. దాదాపు మూడు నెలల తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సందడి నెలకొన్నది. 


ధరణితో సులభంగా రిజిస్ట్రేషన్లు 

భువనగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తహసీల్దార్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో మీసేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఆయన ప్రొసీడింగ్‌ కాపీలు అందజేశారు. రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది స్వాతి, పాండు పాల్గొన్నారు.

ధరణితో భూ సమస్యలు పరిష్కారం

బొమ్మలరామారం: ధరణి పోర్టల్‌ ద్వారా గ్రామాల్లో భూసమస్యలు పరిష్కారమవుతున్నాయని జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. సోమవారం తహసీల్దార్‌  కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా చేపట్టిన  రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను  ఆయన పరిశీలించారు.అనంతరం రిజిస్ట్రేషన్‌ చేయించుకొన్న  రైతులకు ఈ-ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పద్మసుందరి, ఆర్‌ఐలు విజయరామారావు, వెంకట్‌రెడ్డి, సీనియర్‌ సహాయకుడు సునీల్‌, కంప్యూటర్లు ఆపరేటర్లు నరేశ్‌, శంకర్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo