గుడ్ మార్నింగ్

సరైన నిద్రతో మానసిక ప్రశాంతత
రాత్రిపూట త్వరగా పడుకుంటే మేలు
‘లేట్ నైట్' ఆరోగ్యానికి చేటు
వ్యాయామం ముఖ్యమే..
ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం, వాకింగ్, యోగా చేస్తే మనసు ఉల్లాసంగా మారుతుంది. శరీరం మనకు సహకరిస్తుంది. తద్వారా ఆకలి (అనిపిస్తుంది) పుడుతుంది. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్, డయాబెటిక్ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. రోజూ మీరు ఆలస్యంగా నిద్ర మేల్కొనే వారైతే క్రమంగా కొంత ముందుగా లేవడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తూ పోతే కొంత కాలానికి ఉదయాన్నే
నిద్ర లేవగలుగుతారు.
‘ఎర్లీ టూ బెడ్ .. ఎర్లీ టూ రైజ్' అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. యాంత్రిక జీవన విధానంలో ఇది అందరికీ ఆచరణ యోగ్యం కావడం లేదు. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఉత్తేజానికి, ఉల్లాసానికి చిరునామా ఉషా కిరణాలు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి దిన చర్య ప్రారంభిస్తే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటామని, పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతామని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
మీకు మీరే శుభాకాంక్షలు తెలుపుకోండి.
ఉదయాన్నే నిద్రలేవడానికి ఇష్టపడండి. రోజూ మేల్కొనగానే మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఈ రోజు సరైన వేళకు మేల్కొనేందుకు సంతోషిస్తూనే, విలువైన మానవ జీవితం మనది అని గుర్తు చేసుకోండి. ‘సాధ్యమైతే ఇతరులకు సాయం చేయి... ద్రోహం మాత్రం తలపెట్టకు’ అని వివేకానందుడు చెప్పిన సూక్తిని మననం చేసుకోండి. రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఆలస్యంగా నిద్రలేచి హడావుడి పడుతూ పిల్లలను స్కూలు దగ్గర దింపి, కార్యాలయానికి సమయానికి వెళ్లలేక బాస్‌తో మాటపడ్డ సందర్భాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. వీటిని నివారించాలంటే ఉదయం మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కొన్ని రోజులకు పిల్లలు కూడా ఉదయాన్నే నిద్ర లేవడానికి సుముఖత చూపుతారు.
తెల్లవారుజామున లేవడమే మేలు..
తెల్లవారుజామున మేల్కొంటే వాహనాల మోతలు, రణగొన ధ్వనులు ఉండవు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చేపట్టే పనుల్లో విజయం శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున (బ్రాహ్మీ ముహూర్తం) మేల్కోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యమని గుర్తుంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు నిద్ర లేచే వారితో పోలిస్తే.. ఆలస్యంగా మేల్కొనే వారి ఆరోగ్యంలో చాలా వ్యత్యాసాలున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో శుభకార్యాలకు కూడా ఈ సమయం కీలకం.
సూర్యోదయంతో ఉల్లాసం..
సృష్టిలో ఏ ప్రదేశంలోనైనా అద్భుతమైన దృశ్య కావ్యంగా సూర్యోదయాన్ని కవులు అభివర్ణిస్తారు. తొందరగా లేచి ఆ దృశ్యాన్ని చూసేందుకు ఇష్టపడండి. ప్రకృతిలో రోజూ సంభవించే మార్పును ఒక్కసారి మనసారా గమనించండి. గొప్ప అనుభూతికి లోనవుతారు. ఆ సమయంలో సుదీర్ఘ శ్వాసతో పీల్చే స్వచ్ఛమైన గాలికి, యాంత్రిక జీవితంలో మీరు పీల్చే గాలికి ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది.
త్వరగా పడుకోవాలి...
రాత్రి పొద్దుపోయే వరకు కంప్యూటర్లు, టీవీలతో టైంపాస్ చేస్తూ ఉదయాన్నే నిద్ర లేవాలంటే శరీరం కూడా సహకరించదు. త్వరగా నిద్రపోతూ త్వరగా మేల్కొనే ప్రయత్నం చేయాలి.
పిల్లలను ఉత్సాహపరచండి..
ఒకవేళ మీ పిల్లలు ఆలస్యంగా నిద్ర లేచే అలవాటుంటే వారికి ఉదయాన్నే మేల్కొనడం వల్ల కలిగే లాభాలు వివరించి, అలా మేల్కొంటే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పండి. వారికి కూడా ఉదయాన్నే లేవడం అలవాటవుతుంది.
రాత్రి చదువులకన్నా ఉదయమే మేలు..
మా బాబు అర్ధరాత్రి వరకు చదువుతాడు. కానీ, ఉదయాన్నే మాత్రం లేచి చదవడు అంటుంటారు చాలా మంది. ఈ అలవాటును క్రమేపీ మాన్పించి ఉదయం చదివేలా చూడాలి. వేకువజామున చదివి మననం చేసుకుంటే అది మన మదిలో నిక్షిప్తమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
లేట్ నైట్ పార్టీలు వద్దు..
మీ కార్యాలయ సిబ్బందితోనో, స్నేహితులతోనో లేట్ నైట్ పార్టీలకు వెళ్లే అలవాటుంటే మానుకుంటే మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. లేటుగా పడుకొని నిద్ర లేవడం ఆలస్యమైతే ఆ రోజంతా చికాకుగా ఉంటుంది. తొందరగా పూర్తి చేసుకొని సమయానికి ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయాలి.
ప్రశాంత వాతావరణంలో నిద్రపోవాలి..
పరిసరాలు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండటం కూడా నిద్రకు దోహదం చేస్తాయి. సెల్ఫోన్లు మంచానికి దూరంగా ఉంచుకోవడం మంచిది. పడక గది శుభ్రంగా ఉంచుకోవాలి. పెద్ద శబ్దంతో కూడిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను బాగు చేసి వాడుకోవడం మంచిది.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి