గురువారం 04 మార్చి 2021
Yadadri - Dec 21, 2020 , 00:02:51

ప్రకృతి వనం.. పల్లెకు వరం

ప్రకృతి వనం.. పల్లెకు వరం

పచ్చదనంతో కళకళలాడుతున్న గ్రామాలు 

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో నూతన శోభ

నిరంతర పర్యవేక్షణతో ముందడుగు  

శ్రమించి లక్ష్యాలు అధిగమించాం : డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి 

పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల  పూలు,పండ్ల మొక్కలు పెంచేందుకు  ముందడుగు వేసింది. ఈ క్రమంలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం చర్యలు చేపట్టింది.జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, 229 ఆవాసాలు ఉండగా 585 పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసి అధికారులు ముందుకు సాగుతున్నారు. -భువనగిరి 

భువనగిరి : పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల పండ్లు, పూల మొక్కలు, నీడనిచ్చే భారీ వృక్షాలు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే చెట్లు పెంచాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది. ఈ క్రమంలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్దేశిత స్థలాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతోపాటు నిరంతర పర్యవేక్షణ చేపడుతుండటంతో పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తూ ఆకర్షణగా నిలుస్తున్నాయి. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, 229 ఆవాసాలు ఉండగా, అందులో రెండు గ్రామ పంచాయతీలను మినహాయించి 419 గ్రామ పంచాయతీలు. 229 ఆవాసాలకు సంబంధించి 18 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు భూమి సరిగాలేదు. ఈ క్రమంలో జిల్లాలో 585 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టగా, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 585 పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసి అధికారులు ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా మిగిలిన కొద్ది మేర లక్ష్యాలను సైతం అధిగమించేందుకు సమగ్ర చర్యలను వేగవంతం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా స్థలాల గుర్తింపు తదితర కార్యాచరణ ప్రణాళికలను చేపడుతూ ముందడుగు వేస్తున్నారు.

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు నూతన శోభ..

గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలతో నూతన శోభ సంతరించుకుంటున్నాయి. పల్లెలను ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో చేపట్టిన పల్లెప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో పర్యావరణం అభివృద్ధి చెంది గ్రామాలు కాలుష్య కోరల్లో నుంచి బయటపడేందుకు అనువుగా మారుతున్నాయి. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో గ్రామ పంచాయతీల భాగస్వామ్యం పూర్తిస్థాయిలో ఉంటుండటంతో పనుల్లో వేగం పెరిగి త్వరితగతిన కార్యరూపాలు దాల్చాయి. పల్లెప్రకృతి వనాల మూలంగా గ్రామీణ వాతావరణం పూర్తిస్థాయిలో మారిపోయిందని పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఒకే చోట మొక్కలు ఏపుగా పెరిగి అందంగా మారి అడవులను తలపిస్తూ కనువిందు చేస్తుండటంతో పల్లెలు ప్రకృతిని ఒడిసి పడుతున్నాయి. ప్రశాంత వాతావరణాన్ని అందిస్తూ ఆహ్లాదకర జీవనానికి పల్లెప్రకృతి వనాలు ఎంతగానో దోహదపడుతున్నాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు.

నిరంతర పర్యవేక్షణతో ముందడుగు..

పల్లెప్రకృతి వనాల ఏర్పాటు కోసం స్థలాల సేకరణ, మొక్కల పెంపకం తదితర పనుల వేగవంతానికి సంబంధిత శాఖల అధికారుల నిరంతర పర్యవేక్షణ ఎంతో ఉన్నది. పల్లెప్రకృతి వనాల లక్ష్యాలను చేరుకోవడంలో అనునిత్యం అధికారులు శ్రమించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పల్లెప్రకృతి వనాల్లో మొక్కల పెంపకానికి పూనుకుని విజయం సాధించారు. మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన 

జాగ్రత్తలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు కిందిస్థాయి సిబ్బందికి సూచిస్తూ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లారు.

నిర్దేశిత లక్ష్యాలు పూర్తి...

ప్రభుత్వం జిల్లాలో పల్లెప్రకృతి వనాల ఏర్పాటు కోసం నిర్దేశించిన లక్ష్యాలను సంబంధిత శాఖల అధికారులు, గ్రామ పంచాయతీల పాలకవర్గాల సమన్వయంతో పూర్తిస్థాయిలో చేపట్టారు. 585 పల్లెప్రకృతి వనాలకు 585 పల్లెప్రకృతి వనాలను చేపట్టడంతోపాటు కొద్దిమేర పల్లెప్రకృతి వనాల ఏర్పాటు కోసం స్థలాల కొరత ఉన్న చోట్లలో సైతం అనుకూల స్థలాల కోసం చర్యలను వేగవంతం చేస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగి అధికారులు కలలను సాకారం చేస్తూ.. మంచి గుర్తింపును తీసుకువస్తున్నాయి.శ్రమించి లక్ష్యాలు అధిగమించాం 

ప్రభుత్వ ఆదేశాలను తూ.చా తప్పక పాటిస్తూ పల్లెప్రకృతి వనాల ఏర్పాటు కోసం ఎంతగానో శ్రమించాం. నిరంతర పర్యవేక్షణతోపాటు మొక్కల సంరక్షణ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడా ఎలాంటి ఆలస్యాలు జరుగకుండా పూర్తిస్థాయిలో పల్లెప్రకృతి వనాల చేపట్టేందుకు సమగ్రంగా వ్యవహరించాం. అనునిత్యం గ్రామాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వానికి అందజేసి ముందడుగు వేశాం. స్థలాల కొరత ఉన్న కొన్ని గ్రామాల్లో స్థలాలను సేకరించి నూరుశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి

VIDEOS

logo