వ్యాక్సిన్.. ప్లాన్ పక్కా..! టీకా పంపిణీకి కసరత్తు

సర్వం సిద్ధం చేస్తున్న జిల్లా వైద్యారోగ్య శాఖ
ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు తొలి ప్రాధాన్యం
జిల్లాలో 22 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు
తొలి విడుతలో.. 4,320 మందికి
జిల్లాలో 4,320 మంది వివరాల సేకరణ
కరోనా టీకా పంపిణీకి వేళైంది. కొవిడ్ నిరోధక వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి సంబంధించి జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెలలో టీకా వచ్చే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యం వారియర్స్‌కే ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగతా వారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు విడుతలుగా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనుండగా జిల్లా, మున్సిపల్, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ప్రతి పీహెచ్సీ, సీహెచ్‌సీలకు కోల్డ్ బాక్స్‌లను అందించనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. టీకా వేయించుకునే వారు కొవిడ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు చేపట్టిన సన్నద్ధత ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తున్నది.
-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే...
వ్యాక్సిన్ కోసం ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ కేంద్రంలో, ఏ సమయంలో టీకా పంపిణీ ఉంటుందన్నది రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ముందుగానే ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది.
సరఫరా ఇలా...
భువనగిరి ఏరియా దవాఖానలో వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచనున్నారు. అటునుంచి పీహెచ్సీ, సీహెచ్సీలల్లో కోల్డ్ బాక్స్‌లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ భద్రపర్చనున్నారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలకు సరఫరా చేస్తారు
వ్యాక్సినేషన్...
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించేందుకు జిల్లా ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తున్నది. ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. టీకా వేసిన తర్వాత అరగంట పరిశీలనలో ఉంచి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపిస్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజానీకం వేయి కండ్లతో ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జిల్లా లో త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధవుతున్నారు. ఏయే విభాగాలకు చెందిన వారికి తొలుత టీకా అందించాలి. మిగిలిన వారికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి.. వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మొదటి విడుతలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు టీకా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల పరిధిలో పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంబంధిత డాక్టర్లు, సిబ్బందికి జూమ్ యాప్ ద్వారా టీకా పంపిణీపై శిక్షణ సైతం ఇచ్చారు. పర్యవేక్షణ కోసం జిల్లా, మున్సిపల్, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాక్సిన్ డోసుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో టీకాను ఇవ్వడం జరుగుతుందని.. టీకా ను వేసుకోవడం స్వచ్ఛందమేనని.. ప్రజలు ఎవరికి వారే నిర్ణ యం తీసుకుని రిజిస్టర్ చేసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో 4,320 మందికి
ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బందితోపాటు అంగన్వాడీ కార్యకర్తలకు ముందుగా టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 22 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీల పరిధిలోని ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రైవేటు వైద్య సిబ్బంది, అంగన్వా డీ కార్యకర్తలు కలిపి మొత్తం 4,320 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి వివరాలు సేకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. తొలి విడతలో వీరికి మాత్ర మే వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి జిల్లా, మున్సిపల్, మండల స్థాయి లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తూ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. జడ్పీ చైర్మన్, కలెక్టర్, జడ్పీ సీఈవో, అదనపు కలెక్టర్, డీఎంహెచ్‌వో, ఆర్డీవోలతో జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తుండగా.. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ చైర్మన్‌గా, కమిషనర్ కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నారు. అలాగే మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఎంపీపీ చైర్మన్‌గా, ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
వ్యాక్సిన్ నిల్వ ఇలా..
తొలి విడుత వ్యాక్సిన్ పంపిణీ కోసం నేరుగా భువనగిరి ఏరియా దవాఖానకు వ్యాక్సిన్‌ను చేరవేస్తారు. టీకాను నిల్వ చేసేందుకు అన్ని పీహెచ్సీ, సీహెచ్సీలలో శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏరియా దవాఖాన నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలకు రవాణా చేస్తారు. కోల్డ్ బాక్స్‌లను, ఐస్ బాక్సులను, 0.5 ఎంఎల్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచుతున్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకే వైద్యాధికారులకు, ప్రోగ్రాం అధికారులకు శిక్షణ ఇవ్వగా.. జిల్లాలోని వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ
వ్యాక్సినేషన్ కోసం 26 కేంద్రాలు
జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతోపాటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాలను గుర్తించి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం 220 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి కేంద్రంలో ఒక సహాయకుడు, పోలీసుతోపాటు ముగ్గురు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. పల్స్ పోలియో మాదిరిగానే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూం, పర్యవేక్షణ గదులను ఏర్పాటు చేయను న్నా రు. టీకా వేశాక వారిని పరిశీలన గదిలో అరగంట పాటు ఉంచుతారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కలగలేదని నిర్ధారించుకున్నాకే ఇంటికి పంపిస్తారు.
వ్యాక్సిన్ పంపిణీ ఇలా..
ఒకటవ విడుతలో : జిల్లాలోని వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ల్యాబ్ టెక్నీషియ న్లు, 108, 104, 102 వాహన సిబ్బంది. అంగన్వాడీ వర్కర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందికి..
రెండో విడుతలో : పోలీసులు, యూనిఫాం శాఖలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, మున్సిపల్, పంచాయతీ పారిశుధ్య కార్మికులకు..
మూడో విడుతలో : 50 ఏళ్ల పైబడిన వారికి, 50 ఏళ్లలోపు మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి..
నాల్గో విడుతలో : కొవిడ్-19 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్/యాప్‌లో రిజిస్టర్ అయిన వారికి విడతల వారీగా టీకా వేయనున్నారు. వీరికి మరో ఆరు నెలల సమ యం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
కొవిడ్-19 రోగులకు చికిత్సను అందించే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ పంపిణీలో తొలి ప్రాధాన్యం ఉంటుండగా.. టీకా లభ్యతను బట్టి 50ఏండ్లు దాటిన వారికి కూడా వేయనున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంపై ఎవరికివారే నిర్ణయం తీసుకోవాలని, అయితే టీకా వేసుకోవాలనుకుంటున్న వారు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్/యాప్‌లో వివరాలను నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేస్తున్నది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. రిజిస్టర్ చేసుకున్న వారి మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రానుండగా.. అందులో టీకా వేసే ఆరోగ్య కేంద్రం, టీకా వేసే సమయం తదితర వివరాలు ఉంటాయి. కొవిడ్ పోర్టల్‌లో రిజిస్టరైన వాళ్లనే వ్యాక్సినేషన్ కేంద్రంలోకి అనుమతిచ్చి టీకాను వేస్తారు. కాబట్టి టీకా కావాల్సిన వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విధివిధానాలపై దృష్టి సారించాం
వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అవలంభించాల్సిన విధివిధానాలపై దృష్టి సారించాం. తొలి విడత లో టీకాను కరోనా వారియర్స్‌కే ఇస్తున్నందున పంపిణీ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసు కుంటున్నాం. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వైద్యులను అందుబాటులో ఉంచడంతోపాటు జిల్లాలోని అన్ని దవాఖానాల్లో సదుపాయాలను సిద్ధం చేస్తున్నాం. వ్యాక్సినేషన్‌కు సంబంధించి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
తాజావార్తలు
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
- శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఏపీలో తగ్గిన కరోనా కేసులు
- పలువురు సిట్టింగులను తప్పించనున్న మమతా బెనర్జీ..?