గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 18, 2020 , 00:12:37

అభివృద్ది పరుగులు

అభివృద్ది పరుగులు

  • శ్యామ్‌ప్రసాద్‌ నేషనల్‌ రూర్బన్‌  పథకంలో చౌటుప్పల్‌కు చోటు
  • రూ. 15కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు 
  • ఇప్పటికే రూ. 7 కోట్ల 20 లక్షలు నిధుల విడుదల
  • పంచాయతీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సోలార్‌ విద్యుత్‌ దీపాలు, అంతర్గత రోడ్ల ఏర్పాటు

చౌటుప్పల్‌ : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. దేశ జనాభాలో 68 శాతం ప్రజలు జీవిస్తున్న గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని శ్యామ్‌ప్రసాద్‌ నేషనల్‌ రూర్బన్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు, పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో తీసుకెళ్ల్లేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. చౌటుప్పల్‌ మండలంలోని గ్రామాలను రూర్బన్‌ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయి ంచనున్నది. ఈ నిధులతో గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. గ్రామాల్లోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, పేదరిక నిర్మూలన, ఆర్థిక, సాంకేతిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. మండలానికి 10కి.మీ లోపు ఉన్న గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. 

14 అంశాలతో  ప్రత్యేక ప్రణాళిక..

ఈ పథకం కింద చేరిన గ్రామాల్లో అభివృద్ధిని ఎలా చేపట్టాలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. మొత్తం 14 అంశాలను అందులో పొందుపరిచింది. వీటిలో 1. వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు. 2. వ్యవసాయాభివృద్ధి, ఆగ్రో ప్రాసెసింగ్‌, వ్యవసాయ విస్తరణ సేవలు, ధాన్యం నిలువ గోదాంల నిర్మాణం, పశుగణాభివృద్ధి, డెయిరీ, ఉద్యానవనాభివృద్ధి, మత్స్యపరిశ్రమ ఏర్పాటు. 3. వైద్య సేవలు, వైద్య పరికరాలు కలిగిన ఆరోగ్య సంచార వాహనం. 4. విద్య సౌకర్యం కల్పించడం. 5. 100 శాతం పారిశుధ్యం మెరుగు. 6. రక్షిత మంచినీటి సౌకర్యం, 7. వ్యర్థ పదార్థాల నిర్వహణకు డంపింగ్‌ యార్డు. 8. గ్రామీణ వీధి రోడ్లు, డ్రైనేజీలు. 9. గ్రామీణ వీధి దీపాలు. 10. ప్రజా రవాణా, 12. ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు. 13. డిజిటల్‌ అక్షరాస్యత. 14. మీ-సేవ కేంద్రాల ఏర్పాటు. వీటిని పక్కాగా నిర్వహించేందుకు ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. 

రూ. 15 కోట్లతో పనులు..

రూ.15 కోట్లతో చౌటుప్పల్‌ మండలంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.7కోట్ల 20లక్షలు కేటాయించింది. ఇప్పటికే రూ.కోటి నిధులతో మండలంలోని పలు గ్రామాల్లో 20 అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. రూ. కోటి 20 లక్షలతో 25 గ్రామపంచాయతీల్లో 4500 సోలార్‌ విద్యుత్‌ దీపాలు, రూ.2లక్షల 42 వేలతో 25 పశువుల స్టాండ్లు, రూ. కోటితో గుండ్లబాయి నుంచి సైదాబాద్‌కి బీటీ రోడ్డు, రూ. 70 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, పలు పాఠశాలలకు ల్యాబ్‌ సౌకర్యం, ఆట స్థలాల పునరుద్ధరణ పనులు, రూ. 10 లక్షల తో రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు(ఆర్‌ఎల్‌యూ)చేపట్టారు.  అంతేకాకుండా విడుదల కావాల్సిన మిగితా నిధులతో ఒక్కొక్క సంతకు రూ. 12లక్షలతో 12 సంతలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అంగన్‌వాడీ సెంటర్ల అప్‌గ్రేడేషన్‌, ఆట వస్తువుల కొనుగోలు, సోలార్‌ అప్‌గ్రేడ్‌, 40 యూనిట్ల కూరగాయల పందిర్లు ఏర్పాటు చేయనున్నారు. మండలంలోని దండుమల్కాపురం గ్రామ పరిధిలోని సరళ మైసమ్మ తల్లి దేవాలయంలో రూ.30లక్షలతో షెడ్డు, రూ.5లక్షలతో మంచినీటి సదు పాయం, రూ.4 లక్షలతో టాయిలెట్‌ సౌకర్యాలు కల్పించనున్నారు.

అభివృద్ధి పనులకు ప్రణాళిక

రూర్బన్‌ పథకంలో భాగంగా చౌటుప్పల్‌లో రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించాము. ఇప్పటికే ప్రభుత్వం రూ.7కోట్ల 20 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు, సోలార్‌ విద్యుత్‌ దీపాలు, పశువుల స్టాండ్‌, బీటీ రోడ్డు తదితర పనులను చేపట్టాము. 

-సురేశ్‌, డీపీఎం, రూర్బన్‌ పథకం

VIDEOS

logo